Saturday, December 27, 2008

గమ్మత్తు

విజయనగరం మహారాజుల ఇంటిపేరు ‘పూసపాటి’ వారి వద్ద, నడిమింటి ప్రభాకర శాస్త్రి గారు ఆస్థానపండితులుగా వుండేవారు. ఒకరోజు రాజుగారు ఆయన్ని వేళాకోళం చెయ్యడానికి, ‘బొత్తిగా మొదటి ఇల్లూ కాక, చివరి ఇల్లూ కాక మీది నడిమిల్లు యేమిటండీ?’ అని అడిగారట. శాస్త్రిగారు కూడా నవ్వి, ‘యేదో ఓ ఇల్లు లెండి మహరాజా! యేదైనా పూసపాటి చెయ్యకపోదుగా!’ అన్నారట. గోదావరి జిల్లాలలో కొన్ని వూళ్ళలో క్షత్రియ కుటుంబాలు యెక్కువ. వాళ్ళలొ, అచారంగా తాత పేరు మనవడికి, పెడుతుంటారు. ఓ తాతరాజుగారికి నలుగురు కొడుకులనుకోండి, ఆ నలుగురు కొడుకుల కొడుకులకీ, తాతరాజు పేరు వస్తుంది! అలాగ, ఒకే పేరువున్న రాజులు చాలామంది వుంటుంటారు! మరి మనకి కావలసిన ఫలానా రాజుగారి గురించి మాట్లాడాలంటే, మిగిలినవాళ్ళైతే, తండ్రిపేరో, ఇంటిపేరో చెపితే సరిపోతుంది. కాని, రాజుల్లో, కనీసం 3 తరాల పేర్లు చెపితేగానీ తెలియదు! అలా, ‘వెంకట్రాజుగారి, బుల్లిరాజుగారి సత్తిరాజుగారు’ అనో, 'బుల్లిరాజుగారి, వెంకట్రాజుగారి కనకరాజుగారు’ అనో, ‘సత్తిరాజుగారి, రామరాజుగారి బుచ్చిరాజుగారు అనో అనాల్సి వస్తుంది! వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడూ, ఫోనులో మాట్లాడేటప్పుడూ వినాలి—‘యెంట్రారి బుల్రారి సత్రారు’, బుల్రారి యెంట్రారి కండ్రారు’, ‘సత్రారి రావరారి బుచ్రారు’ అంటూ వేగంగా మాట్లాడుతుంటే గమ్మత్తుగా వుంటుంది! అందుకే, చాలా మందికి మారు పేర్లు వుంటాయి—సామాన్యంగా యేదో ఒక ప్రత్యేకతని గుర్తిస్తూ—ముక్కురాజు అనో, గుడ్లు రాజు అనో, గుండెత్తురాజు అనో—ఇలాగన్న మాట. అదీ సంగతి!

6 comments:

రాధిక said...

:) nijam gane gammattu gaa vunnaayi.

కొత్త పాళీ said...

LOL!
ఈ యిజీనారం రాజుల యవ్వారాలు కేయెన్వై పతంజలి రచనల్లోనూ, పూసపాటి కృష్ణంరాజుగారి కథల్లోనూ బాగా రంజుగా కనిపిస్తాయి.
నడిమింటి ఆయన మహా పండితుడేగాక అసాధ్యుడు గూడానట. ఈయన కబుర్లు కొన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పొందు పరిచారు.

వేణూశ్రీకాంత్ said...

హ హ భలే ఉన్నాయండి.. ఓ మూడూ పేర్ల వెనక రహస్యం ఇదా...

A K Sastry said...

డియర్ రాధిక గారూ!

మీకు నచ్చినందుకు చాలా సంతోషం!

ఇంకా గమ్మత్తులున్నాయి! చదువుతూ వుండండి!

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

మీలాంటివాళ్ళ వ్యాఖ్యల వల్ల నా బ్లాగు విలువ పెరుగుతోంది! ధన్యవాదాలు!

అన్నట్టు శ్రీ కేయెన్వై పతంజలి తెలుగు సాహిత్యంలో మొదటిసారిగా ఒక ప్రయోగం చేసిన రికార్డు వుంది! అదేమిటో తెలుసా?

A K Sastry said...

డియర్ వేణూ శ్రీకాంత్!

బావుందన్నందుకు సంతోషం!

ఇంకా కొన్ని మూడు పేర్ల రహస్యాలున్నాయి! చదువుతూ వుండండి!