Monday, January 26, 2009

మరో గమ్మత్తు

మరో గమ్మత్తు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని, పార్వతీపురం మొదలైన అటవీ ప్రాంతాల్లో, గుమ్మలక్ష్మీపురం అనే అడివి పల్లెలో, ఓ బ్యాంకు శాఖలో ఓ దృశ్యం! బ్యాంకు అధికారి యెదురుగా నించున్న ఓ గిరిజనుడు—పొదుపు ఖాతా, తరవాత ఋణ ఖాతా తెరవాలి. వారి మధ్య సంభాషణ! నీ పేరు? సుక్కడండి! మీ తండ్రిపేరు? మంగడండి! పుట్టిన రోజు? యెరుకనేదండి! యెలాగో తిప్పలుపడి, పని అయిందనిపించాడు బ్యాంకు అధికారి! ‘నెక్స్ట్!’ అన్నాడు. బ్యాంకు జవాను, తరవాత గిరిజనుణ్ణి ముందుకు తోశాడు. నీ పేరు? సుక్కడండి! తండ్రిపేరు? మంగడండి! అదేమిటి? ఇందాక వచ్చిన వాడి పేరూ సుక్కడే, తండ్రి పేరూ మంగడే కదా? ఆడు మా అన్నేనండి! మరి యెవరెవరో యెలా తెలుస్తుంది? ఫోటోలున్నాయి కదండి? సరేలే! ఫొటొల్నీ, మీ వ్రేలి ముద్రల్నీ గుర్తు పట్టగలిగితే, హాయిగా పట్నంలోనే వుండేవాణ్ణి! నాకీ ఖర్మ యెందుకు! సరేలే! మీ తాత పేరు? బుడ్డడండి! బ్రతికించావు! మరి పుట్టిన తేదీ? అల్లప్పుడు, లచ్చడుని పులి ముక్కు గీరేసినాది సూడు, ఆ రొజునండి! అది నాకెలా తెలుస్తుంది? అదేనండి! మా మావకి సలిజొరం ఒచ్చీసి, మా నాన పట్నం తోల్క పోతాంటే, మాయమ్మ ‘నువ్వెల్లద్దయ్యా! బిడ్డ పుట్టబోతంది’ అని సెప్పిందట సూడు! అదే రోజు! హారి భగవంతుడా! సరే! నెక్స్ట్! నీ పేరు? శుక్కడండి! తండ్రిపేరు? మంగడండి! హరినీ! నువ్వూ ఇంతకుముందు వాళ్ళ తమ్ముడివేనా? కాదండి! మరి! (జుట్టు పీక్కోవడమే తరవాయి) పోనీ, మీ తాత పేరు? సొక్కడండి! ఆ్! సుక్కడా? కాదండి! సొక్కడు! హమ్మయ్య! బ్రతికించావు! ఇలా ఓ నెలలో ఓ రెండు మూడు వందలమందికి ఖాతాలు పెట్టడానికి బ్యాంకు వాళ్ళ తాతలు దిగి వచ్చేవారు! ఇంతకీ గమ్మత్తు యేమిటంటారా? ఆ గిరిజనుల అచారం ప్రకారం, సోమ వారం పుట్టిన వాడికి—సొక్కడు; మంగళవారం పుట్టిన వాడికి—మంగడు; బుధవారం పుట్టిన వాడికి—బుడ్డడు; లక్ష్మివారం పుట్టిన వాడికి—లచ్చడు; శుక్రవారం పుట్టిన వాడికి—సుక్కడు; శనివారం పుట్టిన వాడికి—శంకడు; ఆదివారం పుట్టిన వాడికి—అబ్బడు అనే పేర్లు పెడతారు! మరందుకే-----------!

9 comments:

ఉమాశంకర్ said...

"అల్లప్పుడు, లచ్చడుని పులి ముక్కు గీరేసినాది సూడు, ఆ రొజునండి!" :)

బావుంది..

రాధిక said...

హ హ....అమాయకులతో బాగా టైం పాస్ అవుతుందన్న మాట.

చైతన్య.ఎస్ said...

హ.హ బాగుంది.

--- సొక్కడు

A K Sastry said...

డియర్ ఉమాశంకర్!

ఇరవై యేళ్ళ క్రితం, నేను శ్రీకాకుళం లో పని చేస్తూండగా, ఓ సారి పిక్నిక్ గా గుమ్మలక్ష్మీపురం వెళ్ళినప్పుడు, ఊరి మొదట్లో, ఓ మైలురాయి మీద కూర్చొని మాకు స్వాగతం చెప్పాడు—ఆ లచ్చడు! ఆరదుగుల సన్నటి మనిషి, కాస్త గూనిగా వొంగి, పెద్ద పంచె మోకాళ్ళ పైకి పొరలు పొరలుగా మడిచి పైకి కట్టి, చేతిలో తనకన్నా రెట్టింపు పొడుగున్న కఱ్ఱతో, ముక్కు స్థానంలో రెండు రంధ్రాలు మాత్రమే వున్న ఆ లచ్చడు ఈ నాటికీ కళ్ళకు కడతాడు! ఆతనితో తీయించుకున్న ఫోటోలు ఇంకా నా దగ్గర వున్నాయి! అతను పులితో చేసిన పోరాటం అతను వర్ణించిన తీరు కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది!

అతనిని ఇలా ఉపయోగించుకున్నాను! అతను యే లోకంలో వున్నా సుఖంగా వుండాలి! అతనికీ, మీకూ కూడా నా కృతజ్ఞతలు!

A K Sastry said...

డియర్ రాధికా!

బాగుందమ్మా! మీకు టైం పాస్ గా కనిపించిందన్నమాట—వాళ్ళ అవస్థ!

A K Sastry said...

డియర్ చైతన్య!

సొక్కడుగా గుర్తింపబడుతున్నందుకు థాంక్స్!

Shashank said...

బాగా రాసారండీ. ఇదే కాదు మీరు రాసిన మిగితా టపాలు కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నయీ. మీ జీవిత సంఘటనలని ఇలా వర్ణించడం చాలా నచ్చింది నాకు. ధన్యవాదములండీ

A K Sastry said...

Dear Shashank!

Thanks for your compliment!

Visit my other blogs also and offer your comments!

http:// osaamaa.blogspot.com/
http://teluguradical.blogspot.com/
http://krishnasree.blogspot.com/
http://yekesa.blogspot.com/
http://ammanamanchi.blogspot.com/
http://amkrisas.blogspot.com/
http://krishnaagovindaa.blogspot.com/
http://kalyanakrishnasree.blogspot.com/

Praveen Mandangi said...

మా నాన్న గారు తూర్పు గోదావరి జిల్లా పొన్నమండ గ్రామ ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ లో పని చేసే రోజుల్లో అతనికి ముగ్గురు కస్టమర్లు ఉండేవాళ్ళు. ఆ ముగ్గురి పేరూ సాగి సుబ్బరాజే. ఆ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. తాత, తండ్రి, మనవడు.