Wednesday, September 9, 2009

హేతువాదం......


హేతువాదులు--14


ఆచారాలు, సాంప్రదాయాలు : --  


యెప్పటినుంచో ప్రాచీన వైష్ణవాలయాల్లో దేవుడికి అష్టోత్తర పూజా, సహస్ర నామార్చనా జరిపించడం ఆచారం.  


మొన్న వినాయక చవితి నాడు, కాణిపాకం వినాయకాలయం లో జరుగుతున్న పూజని తి తి దే భక్తి చానెల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేశారు. 


మంత్రాలు చదువుతున్నవాళ్ళు చదువుతూండగా, పాపం పూజ జరుపుతున్న బ్రాహ్మడు అష్ట కష్టాలూ పడ్డాడు!  


మొదట కూర్చొని, పసుపు వినాయకునికి పూజ చేశాడు. బాగానే వుంది. ఇక పెద్ద విగ్రహం ముందు నించొని, వ్రతకల్పం ప్రకారం పూజ మొదలు పెట్టాడు. 


షోడశోపచార పూజా, సర్వాంగార్చనా, గరిక పూజా--ఇలా సుమారు ఓ గంట గడిచింది.  


తరవాత, మంత్రాలు చదివే ఆయన 'యేక వింశతి పూజా' అని, ఓ లావాటి పెద్ద సైజు పుస్తకాన్ని--కొత్తగా ప్రింట్ అయినట్టు తళతళా మెరుస్తోంది--తెరిచి, నామాలు చదవడం మొదలు పెట్టాడు! వాటిలో చాలా మటుకు పది పదిహేను పదాల సమాసాలే!  


యేక వింశతి అంటే, 21 అనుకుంటా--పంచ వింశతి అంటే 25 కదా! మరి ఆ నామాలు 21 వందలో, 21 వేలో తెలియదు--యెంతకీ తరగవు! అసలు ఆయన ప్రతీ నామానికీ ముందు ఒకటీ, వెనుక ఒకటీ 'ఓం' లు చేర్చి చదువుతున్నాడు--'ఓం వక్రతుండాయ నమహ్ ఓం' 'ఓం శూర్పకర్ణాయ నమహ్ ఓం'--ఇలా!  


అన్నినామాలూ అవుతుండగా, పూజ చేసే బ్రాహ్మడు పాపం అలాగే నిలబడి, తనకి పక్కనించి అందించేవాళ్ళు ఇస్తున్న పుష్పాలూ, పత్రీ, గరికా, అన్నీ ఒక్కొక్కటీ అవగొడుతూ చాలా కష్టపడ్డాడు.  


ఈ లోపల అక్కడి మహిళా యెమ్మెల్యేనో, మంత్రో భర్తా, పరివారం సహితంగా ప్రవేశించేశారు! మంత్రాలు చదువుతున్నాయన ఒక్కడే కూర్చుని చదువుతున్నాడు--మైక్ అంతయెత్తే వుంది కాబట్టి కావచ్చు! మిగిలినవాళ్ళు యధేచ్చగా విగ్రహం ముందునించీ, ఆ ప్రాంతమంతా కలయతిరుగుతూండగా, పాపం విడియో తీసేవాడు మేఘాలనీ, ధ్వజ స్థంభాన్నీ చూపించాడు!  


తరవాత మెమెంటోలూ, ప్రసాదం సంచీలూ పంచిపెట్టడం బలవంతంగా వీడియో వాడి చేత కవరు చేయించారు--వాళ్ళ తైనాతీలు!  


అంతసేపూ, ఆయన నామాలు చదువుతూనే వున్నాడు, ఈయన పూజ చేస్తూనే వున్నాడు! నాకు విసుగొచ్చి టివీ కట్టేశాను!  


ఇక కొత్తగా, లక్ష కుంకుమ పూజలూ, లక్ష గరిక పూజలూ--ఇవేమిటో! లక్ష అనేది సంఖ్యా వాచకం కదా? లక్ష పత్రి అంతే, లెఖ్ఖపెట్టి లక్ష ఆకుల్ని పూజ చెయ్యచ్చు, లక్ష వత్తులంటే, లెఖ్ఖపెట్టి లక్ష వత్తుల్నీ వెలిగించవచ్చు--మరి లక్ష 'కుంకుమనీ, లక్ష 'గరికనీ యెలా లెఖ్ఖిస్తారు?  


పూర్వం ఆడవాళ్ళలో పెద్దవాళ్ళు స్వయంగా తమ తీరిక సమయాల్లో 'లక్ష వత్తులూ' చేసుకొని, లక్ష సంఖ్య పూర్తి అవగానే, నోము నోచుకొనేవారు! (ఇప్పుడు ఫలానారోజు లక్షవత్తుల నోము చేసుకుంటున్నాం--మీరందరూ వీలైనన్ని వొత్తులు చేసి తీసుకురండి--అంటున్నారు!)  


నిన్ననే ఒకాయన వచ్చేనెలలో ఫలానా తేదీల మధ్య 'శతకోటి మహలక్ష్మీ యాగం' చేస్తాం--అందరూ పాల్గొని, తిలకించి, తరించాలన్నాడు!  


మరి ఇదేమి యాగమో? శతకోటి దేనికి సూచకమో?  


ఇవన్నీ యెందుకు?2 comments:

రాజశేఖరుని విజయ్ శర్మ said...

నిజమే చిత్త శుద్ధి లేని శివ పోజ లెందుకూ....... ? వ్యర్ధమే... :)

కానీ పూజలే వ్యర్ధమంటే నేనొప్పుకోను. అతి లేకుండా చేసుకునే ఏ పూజైనా చక్కని ఆత్మ బలాన్ని ఇస్తుందని నమ్ము తాను

Krishna Sree said...

డియర్ రాజశేఖరుని విజయ్ శర్మ!

చిన్న వయసులో చక్కగా వ్రాస్తున్నారు--మీ టపాలు కూడా చదివాను.

మీ పూజా విధానం లో 'బ్రహ్మకర్మ సమారంభే' తరవాత, 'ప్రాణాయామం చెయ్యాలి ' అని యెందుకు వదిలేశారు? ముక్కుమీద చేతినుంచుకొని, 'ఓం భూహ్......' అని వ్రాయకపోవడం లో యేమైనా గూఢార్థం వుందా?

కళ్యాణాల గురించి నా పాత టపాలు చదివారా? మీ అభిప్రాయం యేమిటి?

దయచేసి చెప్పరూ!

ధన్యవాదాలు!