స్వామీజీలకి.....
21-10-2009--రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి, డీ జీ పీ శ్రీ గిరీష్ కుమార్--ప్రకాశం జిల్లాలో చేవూరు వద్ద అయిదోనెంబరు జాతీయ రహదారిపై వున్న స్వామీజీ రామదూత పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారట!
ఆయన తన చొక్కా వూడిపోతూండగా, మోకాళ్ళునేలకాంచి, ఆ స్వామీజీ పాదాలపై చేతులూ, తలా ఆనించిన ఫోటో పత్రికల్లో ప్రచురించబడింది!
ఆ స్వామితోపాటు, అభిషేక పూజల్లో ఇంకా కొంతమంది కూడా పాల్గొన్నారట! వాళ్ళందరికీ యేవో కారణాలుండవచ్చు--కానీ ఈ డీ జీ పీ కేం ఖర్మ రా బాబూ అనీ, అసలు ఈ రామదూత స్వామి యెవడూ? అనుకున్నాను!
ఆ మర్నాడు పేపర్లో, ఆ స్వామీజీ బండారం బయటపెట్టబడింది--కొంతమందిచే!
చేవూరులో రామదాసు అనే వ్యక్తి 'రామదూత స్వామి ' గా అవతరించి, సర్వే నెంబరు 883 లోని అటవీ భూమినీ, సర్వే నెంబరు 879 లోని చెరువు పోరంబోకు భూమినీ--దాదాపు 20 యెకరాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారట.
గతం లో ఆ ప్రాంతం లో భిక్షాటన చేసుకునే వ్యక్తి ఈ రోజు దొంగస్వామిగా మారి, ఏ సీ కార్లలో విహరిస్తున్నాడట.
14-7-2002న అప్పటి అటవీశాఖ మంత్రి ఆయ్యన్న పాత్రుడు ఈ దొంగ స్వామి భూ ఆక్రమణదారుడే అని ప్రకటించారట!
8-7-2004న రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చంద్రశేఖర్ దొంగస్వామి భూఆక్రమణ నిజమేనని ప్రకటించారట.
భూమి తిరిగి స్వాధీనం చేసుకోనందుకు అప్పటి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి డి శ్రీనివాస్ అధికారులపై మండిపడ్డారట కూడా!
వీటన్నిటికీ దోహదం చేసిన అయ్యేయస్, ఐపీయస్ అధికారులెవరో, రాజకీయ నాయకులెవరో, పారిశ్రామికవేత్తలెవరో, ఈ డీజీపీకి ఆయనమీద అంతభక్తి వుండడమెందుకో, దాన్ని ఆయన అలా సిగ్గువిడివి ప్రదర్శించడమెందుకో--యెవరైనా అడిగారా!
యెన్ని హేతువాద సంఘాలైనా, ఓపీడీఆర్లైనా, కమ్యూనిష్టులైనా--బుద్ధున్నవాళ్ళెవరైనా--ఈ మూర్ఖుల్నీ, వాళ్ళ మూర్ఖత్వాన్నీ పొగొట్టగలరని ఆశించగలమా?
4 comments:
నిజమే ఇదొకటి మనదగ్గర. ప్రధానులు, రాష్ట్రపతులు (కలాంలో కూడా నాకునచ్చనిదదొక్కటే) కూడా (ఆ హూదాలోనే వెళ్ళి) కాళ్ళమీద పడుతుంటారు వాళ్ళాసమయంలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్న విషయాన్ని కూడా మరచిపోయి. ఇక డి.జి.పి. అనగా ఎంత?
డియర్ Indian Minverva!
కలాం అయినా, యెవరైనా, ముందుగా మనుషులూ, తరవాతే రాష్ట్రపతులూ గట్రా! వాళ్ళ వాళ్ళ నమ్మకాలూ, బలహీనతలూ వాళ్ళకుంటాయి కదా! ఇక్కడ జరగవలసింది యేమిటంటే--ఇలాంటి సంఘటన జరగగానే, ప్రభుత్వ నిఘా/దర్యాప్తు సంస్థలు వెంటనే దాని 'వెనకున్న కారణాలపై' దర్యాప్తు చేసి, ఆ రహస్యాలని ప్రకటించాలి! అసలు నిజాలు ప్రజలకి తెలియాలి!
అదీ అసలైన ప్రజాస్వామ్యం!
ఆ రోజుకోసం యెదురు చూద్దాం.
ముందుగా మంచి పోస్టు రాసినందుకు మీకు అభినందనలు.
కృష్ణశ్రీ గారు అది మన దౌర్భాగ్యం.
డియర్ కుమార్!
చాలా సంతోషం.
ఆ దౌర్భాగ్యాన్నించి బయటపడే దారులు వెతుకుదాం!
ధన్యవాదాలు.
Post a Comment