Sunday, February 28, 2010

ముందు

బాల మేథావులు

ఓ పది పన్నెండేళ్ళ క్రితం, 'అట్లాస్ ' లో వున్నదేశాలన్నింటి రాజథానులూ, వాటి జెండాలూ యెవరు అడిగినా, వెంటనే కరెక్ట్ గా జవాబు చెప్పిన 'చుండూరి శ్రినివాస్ ' కొడుకు ఇప్పుడు యేమిచేస్తున్నాడో?

ఇవాళ దేశం లోని అన్ని రాష్ట్రాల ముఖ్య పట్టణాలనీ గుక్క తిప్పుకోకుండా చెపుతున్న చిన్న పాప, ఇంకో ఇరవై యేళ్ళ తరవాత యేమవుతుందో?

Saturday, February 27, 2010

ప్రజల సొమ్ము


'ఫలభా' యంత్రం

'ఫలభా' యంత్రం పేరెప్పుడైనా విన్నారా?

ఒక గుండ్రని వృత్తం గీసి, అందులో కేంద్రం గుండా వ్యాసం పొడవునా ఒక చిన్న గోడ కడతారు. ఆ గోడ కట్టిన దిశా, యెత్తూ బట్టి సూర్య కాంతి వల్ల నీడ పడే విధానం వల్ల 'టైం' తెలుస్తుంది.

దీన్నే 'సన్ డయల్ ' అంటారు.

దీని ఖరీదు--మనం ఖర్చు పెట్టినంత.

దీన్ని ఇసుకా సిమెంటుతో కట్టచ్చు, రాయితో కట్టచ్చు, గ్రానైట్ తోనూ, పాల రాయితోనూ కూడా కట్టచ్చు, బంగారంతోనూ, వజ్రాలతోనూ కూడా కట్టచ్చు.

రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్న సామెత యెలాగూ వుంది--ఇప్పుడు దేవుడి సొమ్ము కూడా రాళ్ళూ, అవి కట్టించేవాళ్ళ పాలు అవుతున్నాయి!

ఇలాంటి ఫలభా యంత్రమొకటి మన అన్నవరం కొండమీద గుడి దగ్గర వుంది. నిర్మించి చాలా యేళ్ళయ్యింది. మీరు గమనించి వుండరులెండి. 

నిజానికి అక్కడికి వచ్చే భక్తులెవరూ సాధారణం గా గమనించరు--యెవరో పరిసరాలన్నీ ఇంటరెస్ట్ గా పరిశీలించేవాళ్ళు తప్ప.

ఇప్పుడు అలాంటి ఫలభా యంత్రాన్నే, ఓ పది లక్షల ఖర్చుతో, గ్రానైట్ రాయితో, మన ద్వారకా తిరుమల కొండమీద నిర్మించారట.

అదీ సంగతి.




Thursday, February 25, 2010

వూరేగింపులు

వాయిద్యాలు

మా చిన్నప్పుడు, పర్వదినాల్లో దేవుడిని వూరేగించేవారు (ఇప్పుడూ కొన్ని వూళ్ళలో వూరేగిస్తున్నారు).

దేవుడి పల్లకీ ఇంకా చాలా దూరం లో వుండగానే, బాజాలు వినిపించి, 'దేవుడొస్తున్నాడు ' అంటూ పళ్ళెం లో బియ్యం, అగరువత్తులూ, దీపం కుందీ, నైవేద్యానికి ఓ బెల్లం ముక్కా, ఓ అరటి పండూ, ఓ పదిపైసలు దక్షిణా వేసి సిధ్ధం చేశేవాళ్ళం.

వాయిద్యాల్లో ముఖ్యమైనవి--పెద్ద డోలు--'ఢుం ఢుం ఢుం' అంటూ మార్చింగ్ పేస్ సెట్ చేసేది. 'కాహళి ' అని పొడవాటి ఇత్తడి బూరా--'తూ....తురు తురు తూ....' అంటూ దేవుడి రాకని హెచ్చరించేది. ఇక చిన్న డోళ్ళూ, సన్నాయి, స్వరం, మద్దెలలతో పాటు, చేతి హార్మణీ, డప్పులూ, 'డువుడు ' అని--'డువుడు డువుడు.....డుడ్డువుడు డువుడు ' అని ఓ వింత శబ్దం చేసేది, మా కుమ్మరి గెద్దయ్య వాయిస్తుంటే!

అమ్మవారి గరగలకి వేరే వాయిద్యాలు వాయించేవారు.

ఇక శవయాత్రలకి వాయించే వాయిద్యాలు వేరు.

ఇలా ఆ వాయిద్యాలని బట్టి యేమి వూరేగింపో తెలిసేది.

ఇప్పుడవన్నీ యెక్కడ?

నైవేద్యాలు

మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేర్ దగ్గర చింతలకుంట లో వ్యాస ప్రతిష్ట జరిగిన 'ఆంజనేయ స్వామి ' గుడిలో--చికెనూ, మటనూ నైవేద్యం పెడతారట!

మరి శ్రీశైలం లో తిన్నడు, ఒక చేతిలో మాంసం, ఇంకో చేతిలో పువ్వులూ పట్టుకొని, అభిషేకానికి నీటిని పుక్కిట్లో పట్టుకొని, శివుడిని సేవించుకొనేగా భక్త కన్నప్ప అయ్యాడు!

కొన్ని గుళ్ళలో కల్లూ, సారాయీ కూడా నైవేద్యం పెడతారు.

అందుకే--యెవరి భక్తి వారిది.

అమెరికాలోనూ అక్కడా, ఆవులకి మాంస వ్యర్థాలు పెట్టడం వల్లే అదేదో వ్యాధి వచ్చి, వేలాది పశువుల్ని చంపేశారు.

ఒక ఇంగ్లీష్ నవల్లో విలన్ పందుల్ని మాంసం అవీ పెట్టి, యేనుగుల్లా పెంచుతాడు--తన శతృవుల్ని వాటికి ఆహారం గా వేస్తూంటాడు.

పెంపుడు జంతువులకి--కుక్కలకీ, గొర్రెలూ మేకలకీ, పిల్లులకీ, చిలకలకీ కూడా మాంసం, విస్కీ బ్రాందీలూ మేపడం అదపాదడపా టీవీల్లో చూపిస్తున్నారు.

ఇవోరకం విపరీతాలు!

Tuesday, February 2, 2010

జాతీయ (వగైరా) గీతాలు!

జనగణమన

జాన్ ఎఫ్ కెన్నెడీ, అదేదో మీటింగులో సీరియస్ గా ఇతరులతో మాట్లాడుతూండగా, అకస్మాత్తుగా లేచి అటెన్షన్ లో నిలబడి కొంతసేపు వుండిపోయాడట--మిగిలినవాళ్ళు కూడా ఆయన్ని అనుసరించగా! తరవాత ఆ సమావేశాం మామూలుగా కొనసాగిందట!

దీనికి కారణమేమి అని ఆరా తీస్తే, పక్కనెక్కడో వున్న స్కూల్లో వాళ్ళ జాతీయ గీతాన్ని పాడారట పిల్లలు!

ఈ సంఘటనని మళ్ళీ మళ్ళీ మాకు మా స్కూలు అసెంబ్లీలో వినిపించేవారు--మా హెడ్మాష్టారు!

యెప్పుడైనా మా స్కూలు గ్రామఫోను రిపేరుకి వస్తే, మా 'డబల్ జీరో' మేష్టారు దాన్ని టెస్ట్ చెయ్యడానికి, పొరపాటున 'జనగణమన ' రికార్డు వేస్తుంటే, మా క్లాసుల్లో టీచర్లూ, విద్యార్థులూ అందరూ పాఠాలు మానేసి లేచి నిలబడి అటెన్షన్ లో నిలబడడం, మధ్యలో ఆ గీతం ఆగి పోగానే కూర్చోవడం, మళ్ళీ మొదలవగానే అటెన్షన్ లో నిలబడడం--ఈ మధ్యలో మా హెడ్మాష్టారు వెళ్ళి, 'అది తీసేసి వేరే రికార్దు పెట్టరా' అని ఆ మేష్టార్ని తిట్టడం--ఇవన్నీ మధుర స్మృతులు!

సినిమా హాళ్ళలో చిత్రం పూర్తవగానే జాతీయగీతం వేసేవారు--పరువు దక్కించుకోడానికి కోర్టులు వద్దనేదాకా!

శ్రీ గజేంద్ర గఢ్కర్ ప్రవేశ పెట్టిన 'ప్రతిఙ్ఞ ' ప్రతీ పాఠ్య పుస్తకం లో వుండేది, ప్రతీ స్కూల్లో అసెంబ్లీ లో ఖచ్చితం గా చదివేవారు--'భారతదేశము నా మాతృభూమి--భారతీయులందరూ నా సహోదరులు..........' ఇలా సాగేది ఆ 'ప్రార్థన '!

ఇవన్నీ 'ఇందిరమ్మ ' తన రాజ్యాంగ సవరణ ద్వారా 'మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యాంగం' అనకుండా 'సర్వమత సమభావనగల రాజ్యంగం' అని యిరికించగానే, చంకనాకిపోయాయి! యెందుకో యెవరూ పట్టించుకోలేదు!

ఇప్పుడు మన దేశ భక్తి యెలా యేడుస్తోందంటే, దేశ భక్తి గీతాలంటూ పాడడం యెప్పుడో మానేశాం. ఇక రాష్ట్రగీతం అనదగ్గ 'మా తెలుగు తల్లికి ' పాడడం మానేశాం--పైగా, కే సీ ఆర్, 'యెవరికి తల్లి? యెక్కడి తెలుగు తల్లి?' అంటూ యేదేదో పేలాడు! (మళ్ళీ తెలంగాణా తల్లి అంటూ విగ్రహం చేయించాడు!--అది యెవడి తల్లో!)

మరి మన తెలుగువాళ్ళు వీడిని 'తెలుగు మాట్లాడితే నాలుక కోస్తాం!' అని యెందుకు హెచ్చరించలేదో తెలియదు. ప్రస్తుతం వాడు మాట్లాడే భాష యేమిటో మరి! (ఖచ్చితం గా పాకీ భాష కాదు!) (నేనెవర్నీ కులం పేరుతో దూషించడం లేదండోయ్!)

ఇక జాతీయ గీతాల విషయానికొస్తే, వందే మాతరం పాడకూడదని మన హోం మంత్రి సమక్షంలోనే ఫత్వా ఇచ్చేవాళ్ళున్న దేశం మనది.

ఇక మిగిలినది--జనగణమన.

అది వ్రాయబడ్డప్పుడు, పాడబడ్డప్పుడు వివాదాలకి అతీతం కాకపోయినా, ఇప్పుడు యే వివాదాలూ లేని గీతం ఇది.

మరిప్పుడు, దీన్ని కూడా భ్రష్టుపట్టించడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు--మన రాజకీయులు!

మొన్న ఈ గీతం జయంతో యేదో జరిపించి, కాలేజి పిల్లల్ని యెండలో గ్రవుండులో నిలబెట్టి జాతీయగీతం పాడించారు--రాజకీయులు స్టేజి మీద నీడలో నిలబడి (వీళ్ళలో పురం'ధ 'రేశ్వరి కూడా వున్నారు!)!

టీవీల్లో లైవ్ లూ, రిపీట్ లూ, దుమ్మెత్తించారు!

కానీ, ఆ రాజకీయుల భంగిమల్ని గమనించారా?

ప్రపంచం లో యే రెండువాచీలూ ఒకే టైము చూపించవంటారు!  యేదైనా మిలటరీనో, గూఢచారి ఆపరేషన్ అయినా, అందరూ 'సింక్రనైజ్ అవర్ వాచెస్ ' అని ఒకేసారి, ఒకే టైము అందరూ--సెకెండ్లతో సహా పెట్టుకున్నా, యెక్కడో తేడాలు వస్తూ వుంటాయి! ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసులు కూడా వున్నాయి!

అలా, ఆ స్టేజి మీద వున్న రాజకీయులు--ఒకడు చేతులు కట్టుకొనీ, ఒకడు చేతులు ముందు 'ప్రార్థనా స్థాన్ ' లో పెట్టుకొనీ, ఒకడు వెనకాల పెట్టుకొనీ, ఒకడు పొట్ట ముందు పెట్టి, తలెగరేస్తూనూ, కాళ్ళు జాచుకొని కొంతమందీ, కాళ్ళతో తాళం వేస్తూ కొంతమందీ, ఆడాళ్ళు మూతికి అరచెయ్యి అడ్డు పెట్టుకొనీ, మధ్యలో కొంగుని నిండుగా కప్పుకొంటూ--ఇలా రకరకాల భంగిమల్లో--"ఆ గీతాన్ని భ్రష్టు పట్టించడమే మా ధ్యేయం" అన్నట్టు నిలబడ్డారు!


బై ది వే, ఇలాంటి వాళ్ళకి 'సూ మోటో' గా, సుప్రీం కోర్టు, 'అదే భంగిమలో' ఓ రోజంతా నిలబడేలా శిక్ష వేస్తే యెంతబాగుంటుంది?

మీ దేశా భక్తి తగలెయ్యా! ఇలాంటి ప్రదర్శనలు వద్దురా రా(జకీయ)బందులారా!

దేశానికి మిగిలిన ఆ ఒక్క వారసత్వాన్నీ కనీసం మిగల్చండ్రా!