Thursday, February 25, 2010

వూరేగింపులు

వాయిద్యాలు

మా చిన్నప్పుడు, పర్వదినాల్లో దేవుడిని వూరేగించేవారు (ఇప్పుడూ కొన్ని వూళ్ళలో వూరేగిస్తున్నారు).

దేవుడి పల్లకీ ఇంకా చాలా దూరం లో వుండగానే, బాజాలు వినిపించి, 'దేవుడొస్తున్నాడు ' అంటూ పళ్ళెం లో బియ్యం, అగరువత్తులూ, దీపం కుందీ, నైవేద్యానికి ఓ బెల్లం ముక్కా, ఓ అరటి పండూ, ఓ పదిపైసలు దక్షిణా వేసి సిధ్ధం చేశేవాళ్ళం.

వాయిద్యాల్లో ముఖ్యమైనవి--పెద్ద డోలు--'ఢుం ఢుం ఢుం' అంటూ మార్చింగ్ పేస్ సెట్ చేసేది. 'కాహళి ' అని పొడవాటి ఇత్తడి బూరా--'తూ....తురు తురు తూ....' అంటూ దేవుడి రాకని హెచ్చరించేది. ఇక చిన్న డోళ్ళూ, సన్నాయి, స్వరం, మద్దెలలతో పాటు, చేతి హార్మణీ, డప్పులూ, 'డువుడు ' అని--'డువుడు డువుడు.....డుడ్డువుడు డువుడు ' అని ఓ వింత శబ్దం చేసేది, మా కుమ్మరి గెద్దయ్య వాయిస్తుంటే!

అమ్మవారి గరగలకి వేరే వాయిద్యాలు వాయించేవారు.

ఇక శవయాత్రలకి వాయించే వాయిద్యాలు వేరు.

ఇలా ఆ వాయిద్యాలని బట్టి యేమి వూరేగింపో తెలిసేది.

ఇప్పుడవన్నీ యెక్కడ?

నైవేద్యాలు

మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేర్ దగ్గర చింతలకుంట లో వ్యాస ప్రతిష్ట జరిగిన 'ఆంజనేయ స్వామి ' గుడిలో--చికెనూ, మటనూ నైవేద్యం పెడతారట!

మరి శ్రీశైలం లో తిన్నడు, ఒక చేతిలో మాంసం, ఇంకో చేతిలో పువ్వులూ పట్టుకొని, అభిషేకానికి నీటిని పుక్కిట్లో పట్టుకొని, శివుడిని సేవించుకొనేగా భక్త కన్నప్ప అయ్యాడు!

కొన్ని గుళ్ళలో కల్లూ, సారాయీ కూడా నైవేద్యం పెడతారు.

అందుకే--యెవరి భక్తి వారిది.

అమెరికాలోనూ అక్కడా, ఆవులకి మాంస వ్యర్థాలు పెట్టడం వల్లే అదేదో వ్యాధి వచ్చి, వేలాది పశువుల్ని చంపేశారు.

ఒక ఇంగ్లీష్ నవల్లో విలన్ పందుల్ని మాంసం అవీ పెట్టి, యేనుగుల్లా పెంచుతాడు--తన శతృవుల్ని వాటికి ఆహారం గా వేస్తూంటాడు.

పెంపుడు జంతువులకి--కుక్కలకీ, గొర్రెలూ మేకలకీ, పిల్లులకీ, చిలకలకీ కూడా మాంసం, విస్కీ బ్రాందీలూ మేపడం అదపాదడపా టీవీల్లో చూపిస్తున్నారు.

ఇవోరకం విపరీతాలు!

2 comments:

హరి said...

తమ ఆహారంలో కొంత భాగాన్ని దేవుడికి అర్పించడం ఆటవిక సమాజం నుండి కూడా ఉన్న ఆనవాయితీయే. ఆహారం అలవాట్లు రక రకాలు గా ఉన్నట్లు గానే నైవేద్యాలు కూడా భిన్నంగా వుంటాయి. కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇవి ఎంతగా పాతుకొని పోయి ఉంటాయి అంటే, వీటిని కాదనడం హైందవ పూజారుల వాళ్ళ కూడా కాదు.

మందును నైవేద్యంలో భాగంగా ఉంచడం కూడా ఇలాంటిదే. ఇలా పెట్టె వాళ్ళు తమకు ఉన్న దాంట్లో గొప్ప గా నైవేద్యం పెడుతున్నా మనే తప్ప వేరే భావం ఉండదు. మనం పాశ్చాత్య దేశాలలో కూడా చూస్తుంటాం, శుభ కార్యాలకు షాంపేన్ బాటిళ్ళు పగల గొట్టడం (మన కొబ్బరి కాయ లాగా), షాంపేన్ చిలకరించడం.

A K Sastry said...

డియర్ హరి దోర్నాల!

బాగా వివరించారు. సంతోషం!

ధన్యవాదాలు.