వెంకట 'మరణ'
వాళ్ళ రూమ్ ప్రక్కన వుండే ఫంక్షన్ హాళ్ళలో దాదాపు సంవత్సరమంతా యేదో ఫంక్షన్ జరుగుతూనే వుండేది--దాంట్లో మనవాడికీ, వాళ్ళ అన్నదమ్ముల అనుబంధానికీ ఉచిత భోజన పథకం అమలయ్యేది. (అదీ అడ్వాంటేజ్!)
మా ఇంకో స్నేహితుడు వరప్రసాద్, బీసెంటురోడ్డులో యేవో జాతరలు జరిగి, పేదవాళ్ళకి అన్న సంతర్పణలు జరుగుతుంటే, 'ఒరే! పందిరేసి, విస్తరేశారు.....ఇక మనదే ఆలస్యం!' అని మమ్మల్ని వేళాకోళమాడేవాడు............వాడి ముందు!
(దయచేసి వాణ్ణి హేళన చెయ్యడానికి ఈ టపాలు వ్రాస్తున్నాననుకోవద్దు! వాడు చిరునవ్వుతో అనుభవించిన కష్టాలని మీ చెవిన వేద్దామనే నా తపన.)
అలాంటి మా రమణ (వాళ్ళది ప్రకాశం జిల్లా), గోదావరి జిల్లాల్లోని ఓ పట్టణం లో వుండే కుటుంబం లో అమ్మాయిని పెళ్ళిచేసుకొన్నాడు! వాళ్ళ అత్తవారిది కూడా పెద్ద కుటుంబం. ఆ వూళ్ళో మెయిన్ బజారులో ఓ వీధంతా రెండువైపులా వాళ్ళ షాపులే వుంటాయి. ఇంకో పేటలో ఒక వీధిలో రెండువైపులా వాళ్ళ ఇళ్ళే వరసగా వుంటాయి.
వాడి అదృష్టం ఆ అమ్మాయిరాకతో తిరిగింది. బాగా సంపాదించాడు. ఇంకో జిల్లా ముఖ్యపట్టణం లో రాజభవనం లాంటి ఇల్లు కట్టాడు. ఇద్దరు మగపిల్లల్నీ ఇంజనీర్లని చేశాడు. ఆడపిల్లకి అమెరికా సంబంధం చేశాడు! అందరూ చాలా సంతోషం గా వున్న సమయం లో.............
యాభయ్యారేళ్ళ వయసులో 'మహమ్మారి' బారిన పడ్డాడు......కొండనాలుకకి కేన్సరు వచ్చింది. రెండేళ్ళు బాధపడి, లక్షలు ఖర్చుపెట్టి, చివరకి యేడాది క్రితం పై లోకాలకి వెళ్ళిపోయాడు.
కాకతాళీయం గా వాడు పోవడానికి ఓ వారం ముందు నాకు ఫోన్ లో కలిసాడు. అప్పుడు వాడు వేసిన జోకు--"ఒరే! వక్కపొళ్ళు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందుకొట్టేవాళ్ళు మన ఫ్రెండ్స్ అందరికీ రాని జబ్బు నాకొచ్చిందేమిట్రా?" అనడిగితే, నా సమాధానం "కేరేఝాట్ అనేవాళ్ళకి యేమీ రావు. నువ్వుకూడా కేరేఝాట్ అను............నా అంత్యక్రియలకి నువ్వు వద్దూగాని!' అని. "అంతమాటనకురా! నా టైము అయిపోయింది........అంతే! పైలోకాన్నించి వస్తాన్లే!" అన్నాడు.
ఇంకో చిన్న జోకు చెప్పి వాడి కథనం ముగిస్తాను.
వాడు ఓ నేమ్ బోర్డు వ్రాయించి పెట్టుకున్నాడు. యే వూరు వెళ్ళినా, ఇంటిముందు అది తగిలించేవాడు. దాని కొలతలు--వెడల్పు 3 అడుగులు, పొడవు 4 అడుగులు.
దానిమీద అందంగా తన పేరు, భార్యపేరు వ్రాసివుండేవి.
ఆ క్రింద, తన పిల్లల అందరివీ (అసలు పేర్లుకాదు) ముద్దుపేర్లు వ్రాసి వుండేవి! (వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ ఇంట్లో వాళ్ళు వుంటారని తెలియాలి కదురా! అనేవాడు. మరి ముద్దు పేర్లు యెందుకు? స్కూల్లో పేర్లు వ్రాయించవచ్చుకదా--అంటే--అక్కడే వుంది మజా! అని నవ్వేవాడు!)
ఓ రోజు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. (హనుమంతు అని, వాడింకా పెద్ద జోకర్!)
నేమ్ బోర్డు చూసి, "ఇంకా చాలా వ్రాయడం మరిచిపోయారు! వెంటనే వ్రాయించండి. 'పని మనిషి సావిత్రి, చాకలి మంగమ్మ, మంగలి ముఖలింగం.............' ఇలా......"
అదీ సంగతి!