Sunday, March 14, 2010

నా ఇంకో కొండె.....2

వెంకట 'మరణ '

అప్పట్లో, బ్యాంకుల్లో ఐదు రూపాయలు, రెండు రూపాయలు, ఒక రూపాయి కూడా తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లోంచి డ్రా చేసుకోడానికి వచ్చేవారు జనం.

ఇక మా రమణ తన బ్యాంకులో డ్యూటీలో వుండగా, ఓ తమ్ముడు వచ్చేవాడట. 'నాకు ఓ కొత్త రబ్బరు (ఇరేజరు) కావాలన్నయ్యా' అంటే, ఓ విత్ డ్రాయల్ ఫారం తీసి, తన ఖాతాలోంచి ఓ ఇరవై పైసలకి వ్రాసి, ఆ డబ్బు తన తమ్ముడికిచ్చి పంపించేవాడట.

కాసేపటికి ఇంకో తమ్ముడు వచ్చి, 'నా పెన్నులో రీఫిల్ అయిపోయింది' అంటే, ఇంకో యాభై పైసలకి విత్ డ్రాయల్ వ్రాసేవాడట.

ఇంకో తమ్ముడు వచ్చి, 'లెఖ్ఖల పుస్తకం అయిపోయిందన్నయ్యా' అంటే, ఓ రూపాయి ఇరవై పైసలకి ఇంకో విత్ డ్రాయాల్ వ్రాసేవాడట.

కేషియర్ వీరాస్వామిగారు 'బుధ్ధి లేదా? ప్రతీరోజూ ఓ ఐదు రూపాయలు డ్రా చేసి జేబులో వుంచుకోవచ్చుకదా?' అని కోప్పడేవాడట.

వుత్తర భారతం నించి వచ్చిన ఓ ప్రొబేషనరీ ఆఫీసరు (తెలుగు రానివాడు) వాణ్ణి 'అన్నదమ్ముల అనుబంధం వచ్చింది' అని గేలిచేసేవాడు.

ఇవిలా వుండగా, బ్యాంకు వాళ్ళందరికీ కొత్త సినిమాలు రిలీజు అయ్యే ముందు మొదటిరోజు మొదటి ఆటకి టిక్కెట్లు ఇప్పించేవారు--ఆంధ్రా బ్యాంకులో ఖాతాలు వున్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు.

మా రమణ సినిమా చూస్తూంటే, ఆహ్లాదకరమైన సన్నివేశం వచ్చినప్పుడు, ప్రక్కవాడి తొడమీద చరిచి, వ్రేళ్ళని దగ్గరకిలాక్కుంటూ చెయ్యి పైకిలాగి, 'హహ్హహ్హా' అని నవ్వేవాడు. వూహించండి మీ తొడని అలా లాగితే మీకెంత నెప్పెడుతుందో!

అందుకని మా రాంబాబు (వీడిని మా 'డైరెక్టరు' అనేవాళ్ళం. ఆక్కడక్కడా వచ్చిన మా బ్యాంకువాళ్ళ సీట్లని 'అడ్జస్ట్' చేసి, అందరినీ ఒకే వరుసలో కూచోబెట్టేవాడు) వాడికి ప్రత్యేకంగా తెలియనివాళ్ళ ప్రక్కన సీటు వచ్చేలా యేర్పాటు చేసేవాడు.

హైలైట్ యేమిటంటే, 'షోలే' సినిమా మొదటిరోజు మొదటి ఆట చూస్తున్నాం--అమితాభ్ 'ఆ తుపాకీ నాకందించండి' అని అడుగుతాడు సంజీవ్ కుమార్ని. అందించడు! తరువాత కాస్సేపటికి, ఓ పెద్ద గాలి వీచి, సంజీవ్ కప్పుకున్న వుత్తరీయం యెగిరి పడ్డాక, కనిపిస్తుంది--తనకి రెండు చేతులూ లేవు--అని!

వెంటనే మా రమణ 'అర్రే! చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడ్రా!' అన్నాడు.

మా రాంబాబు 'నువ్విచ్చే రెండున్నర రూపాయలకోసం వాడి చేతులు నిజం గా నరికేస్తారన్నుకున్నావేంట్రా? బేవకూఫ్' అని వాణ్ణి తిట్టాడు. చుట్టూ జనాలందరు 'ఘొల్లు '!

.............మిగతా ఇంకోసారి.

2 comments:

రమణారెడ్డి said...

చాలా బావుంది.బాగా నవ్వుకున్నాము.

కృష్ణశ్రీ said...

డియర్ రమణారెడ్డి!

అందరూ మంచి వుత్కంఠగా చూస్తూ వుండగా, హాలు అంతా నిశ్శబ్దం గా వున్నప్పుడు పేలిన ఆ జోకు తలుచుకుంటే, ఇప్పటికీ ఆగని నవ్వువస్తుంటుంది మాకు!

ధన్యవాదాలు!