"క్రిమినల్ వేస్ట్"
ద్రవ్యోల్బణం రెండంకెలనించి దిగిరానంటోంది. కూరగాయలేవీ వినియోగదారుడికి కేజీ 20 నించి 40 లోపు దొరకడం లేదు.
వర్షాలు బాగా పడితే, వరదలు ముంచెత్తకుండా వుంటే, పంటలు బాగా పండితే....ఇలా కొన్ని 'తే' లతో, వచ్చే ఆరేడు నెలల్లో ద్రవ్యోల్బణం ఒక అంకె స్థాయికి దిగి 'రావచ్చు' అంటాడు ప్రథానమంత్రి.
ఇక తొలేకాశి తో మొదలయ్యింది భక్తి పర్వం!
ఇక్కణ్ణించీ ప్రతీ రోజూ చాలా పవిత్రమైనదే! ప్రతీ రోజుకీ యేదో మహత్యం వుంటుంది--ఉపనిషత్తులూ, పురాణాలూ, భగవద్ గీతా, భారత భాగవతాలూ, ఇంకా ఈనాడు అంతర్యామీ--ఇలా యెక్కడో అక్కడ ఆ మహత్యం గురించి వర్ణించబడే వుంటుంది.
ఇక మధ్యలో గురుపూర్ణిమ లాంటివి వస్తూనే వుంటాయి.
మూడురోజులుగా, కనకదుర్గ అమ్మవారికి 'శాకాంబరీ' అవతారం లో పూజలు చేస్తున్నారట.
నిన్న ఒక్కరోజే, భీమవరం లో అమ్మవారికి అక్షరాలా 1200 కేజీల కూరగాయలతో (ఆకు కూరలు కాకుండా) అలంకరించారట.
ఒక్క విశాఖపట్నం లోని ఒక సాయిబాబా గుళ్ళోనే, అక్షరాలా 800 కేజీల బియ్యం తో అన్నం వండి, అన్నాభిషేకం చేశారట.
ఇక కొన్ని లక్షల బాబా గుళ్ళలోనూ, కొన్ని వేల అమ్మవారి గుళ్ళలోనూ, యెన్ని కిలోల బియ్యం, కూరగాయలూ వినియోగించారో!
ఇలాంటివాటికి, సామాన్యుడు ఐదో పదో విరాళమిస్తుంటే, కోట్లు సంపాదించినవాడు లక్షల్లో విరాళాలిస్తున్నాడు.
యేదైనా, భారం పడేది సామాన్యుడిమీదేకదా?
రేట్లెలా పెరిగినా ఫరవాలేదు--మా భక్తి మాది అంటారా--మీ ఇష్టం.
యేమైనా ఆహార పదార్థాల క్రిమినల్ వేస్ట్ నిరోధించడానికి ఒక చిన్న ప్రయత్నమైనా యెవరైనా చేస్తే బాగుండును!
16 comments:
నిజమైన భక్తికి ఒక తులసిదళం చాలు.
అన్నట్టు ఆ అభిషేకం చేసినతరువాత ఆ అన్నాన్ని ఎవరికైనా ఇచ్చారో లేదో తెలియట్లేదు. ఒక వేళ ఎవరికీ పెట్టకుండా పారేసుంటే మాత్రం నిజంగా పొరపాటే!
kuragaayalu alankarinchi,vandi annadaanam cheste nastam evariki ledu.paarestene bhada.evaritlo vaallam kuragaayalu,aakukuralu pandinchukunte kharchu taggutundi kada.gajula
డియర్ Malakpet Rowdy!
చాలా కాలానికి, నేను వ్రాసిన "ముఖ్య విషయం" మీద వ్యాఖ్యానించినందుకు చాలా సంతోషం!
వీలైనంతవరకూ ప్రతీ లక్ష్మివారం మా ఆవిడని స్థానిక బాబా గుడికి తీసుకెళతాను. (ఆవిడ పరమ భక్తురాలు)
నేను ఓ ఐదు మీటర్ల దూరం లో స్కూటర్ మీదే కూర్చొని వుండగా, ఆవిడ తన చెప్పులు స్కూటర్ తొట్లో వేసేసి, గుళ్లోకి వెళ్లిపోతుంది. ఓ పావు గంట తరవాత తిరిగి వస్తుంది....విబూది నా నుదుటన వుంచుతుంది. ఇంటికి బయల్దేరతాం.
ఈ లోపల, గుళ్లో ఇచ్చిన "అన్నం మెతుకులు" + ఇంకేవో కలిపిన ప్రసాదాన్ని కుడి చేతిలో పెట్టించుకొచ్చిన మా ఆవిడ, బయట వున్న ముష్టి వాళ్లకి వేసేస్తుంది. సాధారణం గా కుడివైపున్న మొదటి వున్న ముష్టిదానికే ఆ గౌరవం దక్కుతుంది.
ఆ మొదటి ముష్టిది "....యేసింది....ప్రసాదం......ఓ పది రూపాయలన్నా యేసింది కాదు బత్తురాలు....." అని ఈసడించుకుంటూ, ప్రక్కనున్న రేకు డబ్బాలో వేసేస్తుందా ప్రసాదాన్ని!
రాత్రి 10.00 దాటాక, గుడి మూసేశాక, అక్కడ చేరతారు...."ఆమాత్రం" కూడా గతిలేనివాళ్ళు.
వాళ్ళకి, ఈ ముష్టివాళ్లందరూ కలెక్ట్ చేసిన ప్రసాదాన్ని "ప్లేటు" ఐదు రూపాయలకి అమ్మేస్తున్నారు!
యెవరి వ్యాపారం వారిది కదా!!!
ధన్యవాదాలు.
డియర్ gajula!
'ప్లాస్టిక్' దారాలతో గుచ్చి, 'అలంకరించి', అర్థరాత్రివరకూ వుంచిన కూరగాయలని ఇంకెప్పుడు వండుతారు?
1200 కేజీల కూరగాయల్ని యెన్ని కూరలు చేసి, యెంతమందికి "వండి" అన్నదానం చేస్తారు?
హేపీ కిచెన్ గార్డెనింగ్!
రేపణ్ణించి మీరు కూరగాయలకి రూపాయి ఖర్చు పెట్టినా, అమ్మవారిమీదొట్టు!
మన శాస్త్రానుసారం పుణ్యకార్యక్రమాలలో అన్నదానం ,ఇతరసంపదలను దానం చెయ్యటం ఆనవాయితీ . ఇక ఆధునిక కాలంలో విఅపరీతమైన భేషజాలు అసలు భక్తిభావాన్ని అందులో అంతర్గతంగా ఇమిడిఉన్న లోకోపకారకమైన లోక క్షేమకరమైన చర్యలను మరుగునపడెలాచేస్తున్నాయి కొంతవరకు . ఇవి సంస్కరించబడతాయని కోరుకుందాం
కాయగూరలతొ దేవికి అలంకారము అసలు ఎందుకు చేస్తారో తెలుసా: మనకు నిత్యము అన్నముని ప్రసాదిస్తున్న ప్రకృతికి మన కృతజ్ణతలు తెలియచేసుకుంటూ, ఆ వస్తువులను దేవికి సమర్పించడంలో భాగముగా,ఈ అలంకరములు, పూజలు. వ్యర్ధము అనుకుంటే అన్నీ వ్యర్ధమే.
డియర్ durgeswara!
యేకీభవించినందుకు చాలా సంతోషం.
ధన్యవాదాలు.
> నేను ఓ ఐదు మీటర్ల దూరం లో స్కూటర్ మీదే కూర్చొని వుండగా, ఆవిడ తన చెప్పులు స్కూటర్ తొట్లో వేసేసి, గుళ్లోకి వెళ్లిపోతుంది
మీరు గుడికి వెళ్లరా?
> ఈ ముష్టివాళ్లందరూ కలెక్ట్ చేసిన ప్రసాదాన్ని "ప్లేటు" ఐదు రూపాయలకి అమ్మేస్తున్నారు!
ఇది నిజమా?
వాళ్ళకి, ఈ ముష్టివాళ్లందరూ కలెక్ట్ చేసిన ప్రసాదాన్ని "ప్లేటు" ఐదు రూపాయలకి అమ్మేస్తున్నారు!
యెవరి వ్యాపారం వారిది కదా!!!
_____________________________________
Interesting!!!!
Khandavilli garu
కూరగాయలతో అలంకరించడం తప్పు కాదు - కానీ 1200 కేజీలంటే? అదీ ఒక్క రోజులో - ఒక్క సారి ఆలోచించండి. అలంకరించాక వాటిని కుళ్ళబెట్టి పారెయ్యకుండా అక్కడ ఉన్న వారికి వండి పెడితే జగన్మాత సంతోషించదంటారా?
As Durgeswara said, we need some reforms here!
డియర్ KHANDAVILLI!
మీ వయసు కనీసం 25 వుంటుందనుకుంటా! (తెలుసుకుందామంటే, 'ప్రొఫైల్ నాట్ అవైలబుల్')
మీ చిన్నప్పుడు గానీ, హైస్కూల్లో వున్నప్పుడుగానీ, యెంతమంది 'శాకాంబరులు' వుండేవారో గుర్తు చేసుకోండి!
ఈ రకం గా "ప్రకృతికి కృతఙ్ఞతలు" తెలియచెయ్యడం, యెప్పుడు, యెవరు, యెందుకు ప్రవేశపెట్టారు? దాన్ని ఇప్పుడు "విరివిగా" యెందుకు పాటిస్తున్నారు? దానికి శాస్త్ర ప్రమాణాలేమయినా వున్నాయా?
వెతకండి. అప్పుడు మాట్లాడదాం!
ధన్యవాదాలు.
ఇంతకీ ఇది జరిగిందెక్కడ? మావూళ్లమ్మ గుడిలోనా?
డియర్ పానీపూరి123!
"మీరు.....వెళ్ళరా?"
....అనేకదా నేను వ్రాసింది!
ఇంకా నమ్మకం లేకపోతే, నా పూర్తి ప్రొఫైల్, నా వెబ్ పేజీ--దాంట్లో నా 'ఆలోచనలు' చదవండి.
"ఇది నిజమా?"
నాకు తెలిసినదే చెప్పాను! మీరు తీరిక చేసుకొని పరిశీలిస్తే, మీకూ తెలుస్తుంది. లేదా, ఆ గుళ్ళలో పూజారులనీ, పుట్టిన రోజుకీ వాటికీ ప్రసాదాలు తయారు చేయించి, గుళ్ళలో పంచిపెట్టమని అప్పగించేవాళ్ళనీ అడిగి చూడండి!
డియర్ Malakpet Rowdy!
అంతలోకే యెక్కడికో వెళ్ళిపోతే యెలాగ!
నేను మావుళ్ళమ్మల గుళ్ళకి యెప్పుడూ వెళ్ళలేదు.
ఇది జరుగుతున్నది, షిరిడీ సాయిబాబా గుళ్ళ దగ్గర.
డియర్ Malakpet Rowdy మరియూ ఇతర వ్యాఖ్యాతలూ!
నేను మొదటినించీ కోరుకొంటున్నది--నేటి యువతలో ఈ చైతన్యాన్నే!
చాలా సంతోషం!
ధన్యవాదాలు--మళ్లీ మళ్లీ!
పత్రం,పుష్పం,ఫలం,తోయం అన్నారు!
ఆ అన్నాన్ని పేదలకు పంచి ఉంటే అభినందించాల్సిందే! సాధారణంగా సాయి బాబా గుళ్ళలో వితరణ జరుగుతుంది కాబట్టి అన్న దానం చేసి ఉంటారని భావిద్దాం!
అదిసరే, కృష్ణ శ్రీ సార్,
మీరు రాసినవి చదువుతుంటే "అవును, లాజిక్కే" అని ఒప్పుకోవాలనిపిస్తుంది నాకు చాలా సార్లు!అంటే కొంత ప్రభావాన్ని మీ రాతలు కల్గిస్తున్నాయనే అర్థం! మీ కుటుంబ సభ్యుల మీద మీ ప్రభావం లేకపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.
ఇంకో మాట...కొద్ది ప్రసాదానికే గతి లేని వారి గురించి మానవతా వాదంతో ప్రస్తావించిన మీరు "ముష్టిది" "ముష్టిదాన్ని" అనే మాటలు వాడటం అంత బావోలేదండీ! యాచకులు అన్నా, అడుక్కునే వాళ్ళు అన్నా అదే అర్థం వచ్చినా పదం కొంచెం రిఫైండ్ గా ఉంటే బావుంటుంది కదా!
ఏమీ అనుకోరుగా!
డియర్ సుజాత!
".....లాజిక్కే......కొంత ప్రభావాన్ని...."
దీన్ని లాజిక్ అనరు. కామన్ సెన్స్ అంటే చాలు.
ఇక ప్రభావం అంటే, చెప్పానుగా, నేటి యువతలో నేను కోరుకున్నది ఈ మాత్రమైనా, చైతన్యమే!
నా కుటుంబ సభ్యుల మీద--లేదని యెందుకు అనుకుంటున్నారు? పూర్తిగా వుంది!
మా ఆవిడా, నేనూ అయితే, టీవీలో చూడ్డానికి ఆసక్తి కలిగించేవి యేమీ లేకపోతే, చానెళ్లు తిప్పుతూ, భక్తి టీవీలనీ, రాశి ఫలం, ధర్మ సందేహాలు, పిచ్చి భక్తి సీరియళ్లు, సినిమాలు, వార్తలూ......ఇవన్నీ చూస్తూ, కామెంట్ చేసుకుంటూ, భలే ఎంజాయ్ చేస్తాం!
(తను ఓ గుడికి వెళ్ళడం వల్ల మంచి జరిగింది అని నమ్మితే, ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యడానికి నేను ప్రయత్నించనఖ్ఖర్లేదనుకుంటా!)
ఇక "ముష్టిది" అనడం కేవలం ఎఫెక్ట్ కోసమే! అంతకు తప్ప స్త్రీలనీ, యాచకులనీ కించపరిచే వుద్దేశ్యం అసలు లేదు.
చాలా సంతోషం!
అనేక ధన్యవాదాలు.
Post a Comment