తెలుగుకు తెగులు
ఈ మధ్య మిత్రుడెవరో "ఐ న్యూస్ కి తెగులు సోకిందహో!" అనే ఓ టపాని వ్రాశాడు. దానిమీద నా వ్యాఖ్య కూడా వ్రాసాను. అది ప్రచురితమయ్యిందో లేదో తెలియదు.
ఇప్పుడు, ఈనాడు వారు కూడా తెలుగు నేర్చుకోవలసిన దుస్థితిలో వున్నారేమో అనిపిస్తూంది.
వుదాహరణకి, వారి జిల్లా ప్రచురణల్లో నమూనా ప్రకటన ఇస్తూ, "5వ వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షలు అనే ఓ హెడ్డింగు చూపించారు!
ఇక వారి ప్రకటనల్లో, "పదమూడవ విహాహ", "పధ్ధెనిమిదో వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షల ప్రకటనల్ని విడుదల చేస్తున్నారు!
మొన్న, ఓ 85 యేళ్లాయనకి "65వ వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షలందించారు!
బాప్రే! 85 యేళ్లలో 65 వివాహాలా! హేట్సాఫ్ బాస్! అనచ్చు మనం.
ఇలాగే--"హత్యకేసులో భర్తకు జీవిత ఖైదు" అని ఓ వార్త! యెవరి హత్యో, యెవరి భర్తో యెవరికీ తెలియదు!
"భార్య హత్య" అనో, "ఓ మహిళ హత్య" అనో వ్రాసి, "కేసులో భర్తకు" అంటే అర్థవంతం గా వుంటుంది కదా?
ఇక మొన్న వరలక్ష్మీ వ్రతం సందర్భం గా, ఈనాడువారు, "శ్రావణ శుక్ర" పౌర్ణిమకు ముందువచ్చేదే "శ్రావణ శుక్రవారం" అన్నారు! శ్రావణ శుక్రం యెక్కడ తెచ్చారో!
"భవిష్యోత్తర పురాణం" ప్రకారం, 'ముత్తయిదువలకు ' వాయినాలు ఇస్తారట. "ముత్తయిదువలు" అంటే యెవరు?
కలశం లో "మర్రి, మామిడి, రవి, జువ్వి చిగుళ్లను" వుంచుతారట! ఈ కాలం లో మామిడి చిగుళ్లు దొరకవు! "....పురాణం" లో ఇది యెక్కడ వుందో చెప్పగలరా?
"....మొలకెత్తిన శనగలు" వాయినాలుగా ఇస్తారట! (ఇలా శనగలు ఇవ్వడం లోని "ఆరోగ్యసిధ్ధిని" ఆనాడే పెద్దలు గుర్తించారట!) ఇదే పురాణం లో వుంది? (మొలకెత్తిన ధాన్యాలు, పప్పులు, దానం చెయ్యడం, వాయినం ఇవ్వడం నిజంగా నిషిధ్ధం!)
అసలు ఇదంతా యెందుకు?............అంటే.....(ప గో) జిల్లలో సుమారు 450 బంగారు దుకాణాలు వున్నాయి. గత యేడాది ఈ నెలలో రూ.కోటి వ్యాపారం జరిగింది. ఈ యేడాది అంతకన్నా యెక్కువ వ్యాపారం జరుగుతుందని ఆశాభావం!
అదండీ సంగతి!
ఇక వేదాంత విజయ వెంకట రామానుజాచార్యులంటాడూ....."విష్ణు ధర్మోత్తర పురాణం" అనుసరించి....."ట! ఇంకా "రుగ్వేదఖిలకాండలో శ్రీసూక్తం........." అంటాడు.
పెద్దబిందెమీద చిన్న బిందెనిపెట్టి, దానిమీద మూతపెట్టి, చెంబుని వుంచి, దానిమీద కొబ్బరికాయకి ముక్కూ, నోరూ, కళ్లూ చెవులూ పెట్టి, ఖరీదైన పట్టుచీరలు కట్టి, బంగారు వడ్డాణాలూ, చెవి, ముక్కు పోగులూ, మెడలో కాసుల పేర్లూ ఇలా అలంకరించి, ఫోటోలు తీసుకొని, పేపర్లోనూ, టీవీల్లోనూ, నెట్ లోనూ వుంచి, ఆనందిస్తే యేమవుతుంది?
ఇక బంగారు రూపులూ, విగ్రహాలూ వుంచడం?
నాకు తెలిసి, 1975 లో మా వివాహమయ్యక, మా యింట్లో యెప్పుడూ ఈ రూపులు పెట్టుకొని, కొబ్బరికాయకి అలంకరణలూ చెయ్యలేదు!
అసలు....శ్రీమహాలక్ష్మికి అలంకారం చెయ్యడం నిషిధ్ధం! (ఆవిడ యే పురాణం లో అయినా, యే కథలో అయినా, ముసలి ముత్తయిదువ రూపం లోనే ప్రకటితమయి, వరాలు ఇచ్చింది!)
పైగా, యెంత అలంకారం చేస్తే, అంతకు తగ్గా శాంతులు జరిపించాలి.....అంత నిష్టగా పూజించాలి ఆవిడని!
కానీ, ఈ రోజు వేలం వెర్రిగా ఈ పనులు చేస్తున్న గృహిణి యెవరైనా, క్రితం యేడాది ఈ పూజలు చేసిన తరవాత, తమకి యెంత నష్టం జరిగిందో.....గుండెలమీద చెయ్యివేసుకొని, ఆలోచించి, సమాధానం చెప్పగలరా?
(యెందుకంటే ఇలాంటి చాలా కేసులు నాకు తెలుసు మరి!)
యేమిటో! తెలుగు భాషతో మొదలు పెట్టి, యెక్కడికో వెళ్లిపోయాను......అయినా ఇవీ తెలుగు "సంప్రదాయాలే" అంటున్నారుగా మరి!
12 comments:
బావుంది మీ పోస్టు. ఈనాడులో భాషాదోషాలకేమీ తక్కువ లేదు. ఆమాటకొస్తే ఏ పత్రికలోనైనా ఇదే పరిస్థితి! వార్షికోత్సవ ప్రకటనలు బాగా నవ్వించాయి.మీకు గుర్తుందా, ఇదివరలో దూరదర్శన్ లో సాయంత్రం వేళ "తప్పిపోయిన వారి ప్రకటనలు" చదివే వారు...అక్కడికేదో తప్పిపోయినవారే వచ్చి ఆ ప్రకటనలు ఇస్తున్నట్లు!
తమకు తోచిందే విజ్ఞానమనుకునే వాళ్లు ప్రతి డెస్క్ లోనూ ఉంటారు.వాళ్లకు తెలియవు,సీనియర్లను అడగరు. ఏం జరుగుతుంది మరి?
ఇకపోతే వరలక్ష్మీ వ్రత కథ పుస్తకంలోనే ఉంటుంది కదండీ కలశంలో పంచపల్లవములతో కలశంబేర్పరచి....అని! (ఇంతకీ మీరు 'రావి" బదులు రవి అని రాశారు. అది మీరే పొరపాటుగా రాశారా లేక పేపర్లోనే అలా వచ్చిందా? :-)) మామిడి చిగుళ్ళు దొరుకుతాయిలెండి(మా ఇంట్లోనే మూడు జాతుల మామిడి చెట్లున్నాయి) గానీ అసలు జువ్వి చెట్టంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలీదు.అందుకే తమలపాకులు పెట్టి పని కానిచ్చేయడమే!
అలంకారాల విషయానికొస్తే ఇది ఆనవాయితీ ని అనుసరించి ఉంటుందట. మా ఇంట్లో కేవలం కలశం తప్ప ముక్కు,కళ్ళు,బిందెలు పెట్టి చీర కట్టే ఆచారం లేదు. మా పక్కింట్లో ఉంది.కుటుంబ ఆనవాయితీట మరి!
అసలు....శ్రీమహాలక్ష్మికి అలంకారం చెయ్యడం నిషిధ్ధం!..అవునా!మరి వ్రతంలో కలశం పెట్టినపుడు ఎలాగంటారు? లేక ఫొటో పెట్టేస్తే సరిపోతుందంటారా? అలంకారం చెయ్యకూడదని ఏ పురాణంలో ఉందంటారు(నిజంగానే తెలీదు నాకు)
అలాగే నానపెట్టిన శనగల్ని వాయినంగా ఇస్తారు గానీ మరీ మొలకలు తీగలు వచ్చినవాటిని కాదు. దానానికి,వాయినానికీ తేడా లేదంటారా?
నాకు అన్నీ సందేహాలే! ఎందుకంటే ఆనవాయితీగా ఆచరించడమే తప్ప ఏవీ పూర్తిగా తెలీవు.ఎవరైనా ఇక్కడికి వచ్చి వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
HA HA HA HA GUD POST
SUJI PL CLICK MY WEB SITE. SEND UR FEED BACK
ONE IMP. IN OUR SITE SOME LETTER MISTAKES R THERE. U DONTWORRY ABOUT THAT. I WANT ONLY UR COMMENTS ON SITE. HOW IT IS, HOW HELPFUL FOR DIVOTIES..................
THNq WITH NAMASKAAR.
REGARDS.,
RAYAPRLOLU MALLIKARJUNA SHARMA,
CHAIRMAN, WWW.SAKALAPOOJALU.COM\
FINALLY WE R APPRIACIATE U...............
‘హత్య కేసులో భర్తకు..’ అన్నపుడు అది భార్య హత్యేనని అర్థం కాదా? శీర్షిక పెట్టేటపుడు స్థలం వీలైనంతగా ఆదా చెయ్యాలని చూస్తుంటారు జర్నలిస్టులు.
‘65వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అనే వాక్యంలో మీరు పట్టుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ, దురర్థం రాకుండా దీన్ని ఎలా రాయాలో మీరే చెప్పండి చూద్దాం!
‘తెలుగుకు తెగులు ’ అని శీర్షిక ఘాటుగా పెట్టారు కానీ, లోపల విషయాలు సాదాసీదాగానే అనిపిస్తున్నాయండీ. ఏమిటో... మీ టపాలో భాషను సగంలోనే వదిలిపెట్టేసి, సంప్రదాయాల్లోకీ, శాంతుల్లోకీ, నిష్ఠల్లోకీ జారిపోయారు!
నిజమేనండీ.. టైటిలంత ఘాటుగా లేదు మీ యీ పోస్టు..
పోతే లక్ష్మీదేవికి "భూషణ ప్రియ" వగైరా నామాలుండాలనుకుంటానే? సుజాతగారు ముందుగానే అడిగేసినట్టు, అలంకారాలు వద్దని ఎక్కడ రాశారు?
డియర్ సుజాత!
చాలా సంతోషం--చక్కగా చదివి వ్యాఖ్యానించినందుకు.
యీ దోషాలకొకటే పరిష్కారం--వ్రాసింది మళ్లీ ఓ సారి
చదువుకోవడం! పాఠకులకి యెలా అర్థం అవుతుంది అని ఓ సారి ఆలోచించడం!
"వివాహ 67వ వార్షికోత్సవం" అంటే సరిపోదా? (క్రింది
వ్యాఖ్యలో యెవరో అడిగారు లెండి)
"......పల్లవములతో.....యేర్పరచి" అంటే, కలశం అంచు చుట్టూ, తొడిమలు కలశం లో వుండేలాగ, ఈ పంచపల్లవాల్లో యేవైనా వుంచచ్చు.....అని. చిగుళ్లు కలశంలో వెయ్యమని కాదు.
కలశం లోని నీటిలోకి పవిత్రనదుల జలాలని ఆవాహన
చేస్తారంతే. కలశంలో ఇంకేవి వేసినా ఆ పవిత్రజలాలు
కలుషితం అయిపోవూ?
రవి అని పత్రికలో వచ్చినదే--యథతధం గా వ్రాయాలనే అలా వ్రాశాను--అది అచ్చుతప్పే అని తెలిసినా.
సాధారణం గా మిగిలిన ఆకులకోసం వెతుక్కోకుండా, మామిడి ఆకులనే కలశం లో వుంచుతారు.
ఇక జువ్వి అంటే, మర్రిలాగే వుంటుంది--ఆకులు మాత్రం చాలా పెద్దవిగా (మర్రితో పోలిస్తే) వుంటాయి. పళ్లు కూడా మర్రికన్నా యెర్రగా, కొంచెం పెద్దవిగా వుంటాయి.
మహాలక్ష్మినేకాదు--యేదేవతనైనా, దేవుణ్నయినా ప్రతీకల్లోకి ఆవాహన చెయ్యాలిగాని, వారిని అలంకరించడం మనలాంటివాళ్ల తరమా! అది కూడా అనూచానం గా వస్తున్నదే--పురాణ ప్రమాణాలు
అవసరమంటారా? (వున్నాయేమో నాకు తెలియదు--మీరన్నట్టు యెవరైనా వచ్చి చెపితే బాగానే వుంటుంది)
ఈనాడులోనేకాదు, యెక్కడైనా యెవరైనా అలవోకగా,
భవిష్యోత్తర పురాణం, దేవీ పురాణం,బ్రహ్మాండపురాణం,
విష్ణు ధర్మోత్తర పురాణం......లో ఇలా వుంది అని
వల్లెవేయకుండా, కనీసం ఆ శ్లోకం మొదలూ తుదీ వ్రాస్తే, బాగుంటుంది. (నిజంగా అందులో అలా వుందోలేదో, అవి వీళ్లు చదివారోలేదో మనకి తెలిసిపోతుంది)
ఇలాంటివి ఆనవాయితీగా ఆచరించడమే మంచిది. ఇంకా వీలైతే యేది యెందుకు చేస్తున్నాము అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తే ఇంకా మంచిదే--కానీ, సొంత తెలివిలు వుపయోగించి, శనగలూ,
పోషక విలువలూ, ఆరోగ్య రహస్యాలూ అంటూ మాట్లాడకపోవడం మంచిది కాదూ?
మరోసారి మీకు ధన్యవాదాలు!
డియర్ sakalapoojalu!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
డియర్ critic!
చాలా సంతోషం.
నేనూ మీరన్నట్టు 'స్థలం ఆదా' కోసమా అని ఆలోచించాను ముందు. కానీ, ప్రక్కన ఓ బెలూన్ వేసి, అందులో 'తణుకులో......' అని వివరణ కూడా వ్రాశారు. వ్రాయగా, శీర్షికకీ బెలూన్ కీ మధ్యా, బెలూన్ తరవాతా ఒక్కో కాలం సెంటీమీటరు ఖాళీ వదిలారు! (అందుకే ఇది పెట్టినవాడికి '......బధ్ధకం' అనిపించి ఇలా వ్రాశాను)
"వివాహ 65వ" అంటే సరిపోదూ?
నేనే వ్రాశానుగా, యెక్కడికో వెళ్లిపోయానని! ఒకే పేపరులో ఇవన్నీ వుండడం తో పనిలో పనిగా ప్రస్తావించాను--వేరే టపా యెందుకులే అని. (అవీ తెలుగుకి సంబంధించినవే కదా అని).
ధన్యవాదాలు!
డియర్ Narayana!
టపా వ్రాసింది ఘాటుకోసం కాదండోయ్!
ఆవిడకి ఇంకా చాలా నామాలున్నాయి. అలా అని, అన్నినామాలలోనూ వున్నట్టు అలంకరించేస్తారా!
ఆవిడ భూషణ ప్రియ అయినా, "అలంకారార్థం అక్షతాం సమర్పయామి!" అంతే!
సుజాతగారికి ఇచ్చిన వివరణ చదవండి.
ధన్యవాదాలు.
కృష్ణశ్రీ గారికి, నమస్కారములు.
టపా బాగుంది. "వివాహ 67వ వార్షికోత్సవం" అనే బదులుగా, " 67 వ వార్షికోత్సవ వివాహ శుభాకాంక్షలు " అని అంటే కూడా బాగుంటుందని నా అభిప్రాయం.
భవదీయుడు,
మాధవరావు.
డియర్ madhavarao.pabbaraju!
సంతోషం.
అమ్మాయి సుజాత సంబంధితులకి క్లాసు పీకారేమో--నిన్న (07-09-2010) పత్రికలో, "60 వసంతాలు" అని ఓ చిన్న బుడగలో వేసి, ప్రక్కన "వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు" అని ప్రకటించారు. బాగుంది.
ఈనాడులో తెలివైనవాళ్లు వున్నారని వొప్పుకుందాం!
నమూనా ప్రకటన మాత్రం ఇంకా మారలేదు మరి.
ధన్యవాదాలు.
ప్రకటనల్లో దోషాలకు ప్రకటణదారుడి దే బాధ్యత అనుకుంటాను. పేపరు వాళ్ళు వాటిలోని వ్యాకరణ దోషాలు పట్టించుకోరన్నది నా అభిప్రాయం.
డియర్ Krishnarjun!
పేపరువాళ్ల "డిస్ క్లెయిమర్" ని బాగా గుర్తుపెట్టుకొని చెప్పారు.
కానీ--నమూనా ప్రకటనైనా సరిగ్గా వుండాలా వొద్దా?
అయినా, అర్థం పూర్తిగా మారిపోతుంటే--వాటిని వ్యాకరణ దోషాలో, అచ్చుతప్పులో అంటే యెలా!
ధన్యవాదాలు.
Post a Comment