Wednesday, September 22, 2010

చవితి అయ్యింది.

నిమజ్జనాలు 

...........మొదలయ్యాయి.

ఓ యాభయ్యేళ్ల క్రితం ఈ నిమజ్జనాల వెర్రి వుండేది కాదు. జనాలు డబ్బుతో అంత వొళ్లు వాచీ లేరు.

చవితికి పెద్ద ఖర్చల్లా, వినాయకుడి బొమ్మ కొనడమే.

కుండలు చేసే కుమ్మరులే, చెక్క అచ్చులమధ్య మట్టితో వినాయకుడి బొమ్మ చేసి, ఆవఁ లో కాల్చి, వాటికి నీటి రంగులు వేసి, బజార్లో అమ్మేవారు. నాకు తెలిసినప్పటినించీ ఓ పెద్ద సైజు బొమ్మ ఖరీదు ఆరణాలు. చిన్న సైజు పావలా. 

(రెండే సైజులు--చిన్న సైజు అంటే ఆరంగుళాలు యెత్తు--చిన్న గుండ్రటి పీఠం మీద ముందుభాగం చక్కగా చెక్కి వుండేది--వెనక వైపు యేమీ వుండేది కాదు. పెద్దసైజు 9 అంగుళాల యెత్తు, నలుచదరం పీఠం పై కూచొన్నట్టు, వెనుక వైపు కూడా వినాయకుడి వీపూ, జుట్టూ అన్నీ వుండేవి.)

పూజా అవీ అయిపోయాక, మర్నాడు పత్రీ వగైరా కాలవలో కలిపేసి, బొమ్మని సిం హద్వారం పైన వుండే గూడుబల్ల మీద చేర్చేవారు. అలా ప్రతి యేటివీ ఓ యేడెనిమిది బొమ్మలు వుంటుండేవి ప్రతీ యింట్లో--పగిలినవి పోగా.

యే సంవత్సరమైనా బొమ్మ కొనడానికి తాహతు సరిపోకపోతే, క్రితం యేడాది బొమ్మని దింపి, దానికే పూజ చేసేవారు.

చైనా యుధ్ధం టైములోననుకుంటా, ఒకేసారి బొమ్మ రేటు రెండురూపాయలకి పెరిగిపోతే, ఓ రెండు సంవత్సరాలు మేము కూడా పాత బొమ్మకే పూజలు చేసుకొని, మళ్లీ గొడుగు బల్ల యెక్కించేశాము.

అప్పటికే, ఆ ఆరణాలు పెట్టి కూడా బొమ్మ కొనుక్కోలేనివాళ్లు, ముఖ్యం గా బ్రాహ్మణులు (అప్పట్లో బ్రాహ్మణులే ఈ పూజ చేసుకొనేవారు ఇంట్లో--సామూహికం గా వూరికో చోట పందిరిలో చేశేవారు) 'మట్టి బొమ్మే శ్రేష్ఠం' అంటూ కాలవలోని రేగడి మట్టితో తమకు వచ్చిన ఆకారం లో బొమ్మని చేసి, పూజ చేసుకొనేవారు. వాళ్లే, మరునాడు, 'మట్టి మట్టిలో కలవాల్సిందే' అంటూ ఆ బొమ్మల్ని మళ్లీ కాలవలో పారేసేవారు. 

అలా మొదలయ్యాయన్నమాట ఈ నిమజ్జనాలు.

ఇక, మా యేలూరు బిర్లా భవన్ ప్రాంతం లోని వినాయకుణ్ణి, 19-09-2010 న 800 కేజీల కూరగాయలతో, శాకాంబరుణ్ణి చేశారట.

(ఆహార ద్రవ్యోల్బణం ఇప్పట్లో దిగి వస్తుందని ఆశలు పెట్టుకోనఖ్ఖర్లేదన్నమాట)

ఇక, రాష్ట్రం లో సోమవారం 20-09-2010 నాటి నిమజ్జనం స్కోరు 11 మంది మృతీ, నలుగురు గల్లంతూ!

ప్రకాశం జిల్లా, కొత్తపట్నం వద్ద 25 మంది, మునిగి కొట్టుకుపోతే, మత్స్యకారులు రక్షించారు.

యేర్పాట్లని బట్టి చూస్తే, ఈ సారి హైదరాబాదు డకౌట్ అవుతుందని ఆశిద్దాం.

20-09-2010 నే రైల్వేల స్కోరు--మధ్య ప్రదేశ్ లో 23 మంది మృతీ, 51 మందికి తీవ్రగాయలూ.

6 comments:

సుజాత వేల్పూరి said...

లడ్డుల వేలం గురించి రాసారనుకుని వచ్చా! దాన్ని వదిలేసారెంటండి మీరూ! వీధి చివరి పందిరిలో కుడా లడ్డూ వేలమే! ఎన్ని డబ్బులో ఈ ఉత్సవ కమిటీల వాళ్లకి!

Anonymous said...

బాగా చెప్పారు. వినాయక చవితి అంటేనే చందాలు, రికార్డ్ డాన్సులు, అరుపులు, రొదలుగా మారిపోయింది. కొండంత దేవుడికి కొండంత బలవంతపు చందా, ఇందులో పోటీలు. వీళ్ళకు ఏమాత్రం భక్తి వున్నా విగ్రహాన్ని ఆ మురికిగుంట హుసేన్సాగర్లో పడేస్తారా? వినాయక చవితి వస్తోందంటేనే చిరాకేస్తోంది. మరాఠాలనుంచి ఈ జాడ్యం హైదరాబాద్, సీమాంధ్ర, ఇలా దేశమంతా పాకిపోయింది.

A K Sastry said...

డియర్ సుజాత!

అమ్మో! 20 రోజులముందే తయారీ మొదలెట్టి, ప్రత్యేక లారీలలో కొన్ని వందల కిలోలు (దూరం) మోసుకెళ్లి, క్రేన్ల సాయం తో వినాయకుడి చేతుల్లో పెట్టి, పదకొండో, పదిహేనో రోజులు వుంచి, చీమలూ, ఈగలూ ముసిరి తిన్నంత తినగా, చివరికి వేలం లో కొన్ని వేలకో లక్షలకో సొంతం చేసుకొనే ఆలడ్డూ రుచీ, మహిమా--వాళ్లే చెపుతారు వింటున్నారుగా--లడ్డూ కొన్నాక క్రితం యేడాది మాకు చాలా శుభం జరిగింది, అందుకనే యెంత ఖరీదైనా, ఈ సారి మళ్లీ కొన్నాము--అంటూ!

మనమేమైనా మాట్లాడితే, ఆ లక్షల్లో కొంత ఖర్చు చేసి, మన అంతు చూసేస్తామంటారేమో అని భయం.

నిజానికి వినాయకుడికి కుడుము పెట్టాలి ఆ చేతిలో. అది పెడితే, రెండో రోజుకే, పాచి పట్టి, మైక్రో స్కోప్ లో చూస్తే కాలనీలు కాలనీలు బాక్టీరియా, దారాలు దారాలుగా సాగుతున్న పాచీ--అబ్బో!

అందుకే మరి లడ్డూలు!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ snkr!

మరాఠా లో బాలగంగాధర తిలక్ ప్రవేశ పెట్టాడంటే, వివిధ కుల, వర్గ, ప్రాంతీయ ప్రజలని, స్వాతంత్ర్యోద్యమానికి సుముఖంగా సంఘటితం చెయ్యడం అనే ఆశయం తో మొదలుపెట్టాడు.

ఈ వేలం వెర్రులని చూస్తూ, ఆయన ఆత్మ యెంత క్షోభిస్తుందో మరి!

కమల్ said...

నాకు తెలిసి ఈ వినాయక చవితి సామూహిక సంబరాలు స్వాతంత్ర్యం కోసం అందరిని సంఘటితంకోసం మ్దొఅలెట్టినదని ఒక మరాఠా మిత్రుడి ద్వార తెలుసుకున్నాను..అది పూణా నుండి...! అదిలా ఒక ఉన్మాదంలా పోటి భక్తీ లా తగలడింది.

A K Sastry said...

డియర్ కమల్!

మీరు విన్నదీ, అన్నదీ, నిఝెంగా నిజం.

పైన, snkr కి అదే జవాబు ఇచ్చాను చూడండి.

ధన్యవాదాలు.