.....గౌరవ వాచకాలూ
శ్రీ, బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ, పార్వతీ సమానురాలు, గంగాభాగీరథీ సమానురాలు--ఇలాంటివి పేరు ముందూ; గారు, అయ్యవారు లాంటివి పేరు తరవాతా వుపయోగించేవారు. వీటిని గౌరవాచకాలు అంటారు.
(ఒకేసారి పేరుముందు వొకటీ, చివర వొకటీ వుపయోగించడం నిషేధం. అలాచేస్తే నిజంగా వారిని అగౌరవపరచినట్టు.)
ఇంగ్లీషులో అయితే, Mr.,Mrs., Sir, His Highness, His Holiness, His Excellency, His/Her Majesty, వగైరాలూ (HH, HE లాంటి Abbreviation లూ), చివర్లో Esquire (Esq.) లాంటివీ వాడేవారు. ఇంగ్లీషులో కూడా పేరుకి ముందూ, తరవాతా ఒకేసారి గౌరవవాచకాలుంచడం నిషేధం.
ఈ మధ్య, Gender Equality వుద్యమకారులు, Mr. అంటే వాడికి పెళ్లి అయిందో లేదో తెలీదుకదా, మరి ఆడవాళ్లకి పెళ్లయితే Mrs. అనీ, అవకపోతే Miss. అనీ యెందుకు వాడాలి? అంటూ Ms. అనేది ఒకటి కనిపెట్టారు. యేభాష అయినా, అతి గౌరవం పనికిరాదు అనే చెప్పారు.
ఇదివరకో కవి ఓ రాజుగారిని "పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు......" ఇలా కొత్త కొత్త విశేషణాలు కనిపెట్టిమరీ పొగిడినట్టు కనిపిస్తూ, బూతులు తిట్టి మరీ కసి తీర్చుకున్నాడట.
ఇంక ఇదివరకు వార్తా పత్రికల్లో అందరిపేర్లముందూ "శ్రీ/శ్రీమతి" తగిలించేవారు. ఓ వార్తలో ఓ పదిహేనుమందిపేర్లు వ్రాయవలసి వస్తే, 15 శ్రీలూ/శ్రీమతులూ కంపల్సరీ. తరవాత, ఇలాకాదు అని, ముందు "సర్వశ్రీ" అని వ్రాసి, తరవాత పేర్లు వరసగా వ్రాసేవారు.
మా బ్యాంకులో 1972లో 63 రోజులపాటు చరిత్రాత్మక సమ్మె జరిగింది. బ్యాంకు స్థంభించింది. అప్పుడు అధికారుల సస్పెన్షన్ పర్వానికి తెరలేపుతూ, ఈ క్రింది అధికారులని సస్పెండు చేస్తున్నాము అంటూ "సర్వశ్రీ ఎ రామచంద్రరావు....."తో మొదలుపెట్టి, లిస్టు పూర్తిచేశారు. అప్పటినుంచీ ఆయన పేరు సర్వశ్రీ రామచంద్రరావు అయిపోయింది!
ఇంగ్లీషు భాషలో ప్రతి సంవత్సరం "టైమ్" మేగజైన్ వారు కొన్ని సంస్కరణలు ప్రవేశ పెడతారు. కొన్ని క్రొత్త మాటలని భాషలో కలుపుతారు, కొన్ని మాటల వర్ణక్రమాన్ని మారుస్తారు--ముఖ్యోద్దేశ్యం మాత్రం, ప్రింటులో యెంత సొమ్ము పొదుపు చెయ్యగలం? అనేదే!
ఇంతకు ముందోసారి రీసెర్చ్ చేసి కనిపెట్టిందేమిటంటే, "An American leaves his apartment by the elevator and enters his automobile to go to see a motion picture." Whereas, "An English, leaves his flat by the lift, climbs his car to go to cinema!" ఇలా ఇంగ్లీషువాళ్లు కొన్ని బిలియన్ డాలర్లు పొదుపుచేస్తున్నారు--ప్రింటులో అని.
అలాగే, Colour లాంటి మాటల్లో, 'ఓ' తరవాత వచ్చే 'యూ' ని తొలగించడం లాంటివి. కానీ యెందుకో 'క్యూ' తరవాత కంపల్సరీగా వచ్చే 'యూ' ని తొలగించడానికి మాత్రం జనాలు వొప్పుకోవడంలేదట! అదిమాత్రం ఇంతవరకూ చెయ్యలేకపోయారు.
గమనించారోలేదూ, మన వార్తా పత్రికల్లో కూడా శ్రీలనీ, Mr. వగైరాలనీ వాడడం యెప్పుడో మానేశారు. తద్వారా బోళ్లంత పొదుపు చెయ్యడమేకాకుండా, మరిన్ని వార్తలనీ (ప్రకటనలనీ) ఇవ్వగలుగుతున్నారు!
చెప్పొచ్చేదేమిటంటే, మనం వ్రాసేటప్పుడూ, మాట్లాడేటప్పుడూ యెవరిమీదైనా గౌరవం (అదంటూ వుంటే) ధ్వనిస్తే చాలు. అంతేగానీ, యెన్ని గౌరవవాచకాలు వుపయోగిస్తే, అంతగౌరవం అని వినేవాళ్లూ, చదివేవాళ్లూ అనుకుంటారనుకోవడం మూర్ఖత్వం!
అదీ సంగతి.
No comments:
Post a Comment