Saturday, November 10, 2012

ఇదో రకం...........పరాకాష్ఠ

ఈ మధ్య జనాలకి భక్తి యెక్కువైపోతూంటే, అర్చకులూ వాళ్లకీ కూడా “సెట్టింగుల” వ్యసనం యెక్కువైపోయింది. గుడి మొత్తం ప్రహరీలతో సహా విద్యుద్దీపాలంకరణ, లోపల కరెన్సీ నోట్ల అలంకరణ లాంటివి సరే. కానీ వుత్సవ విగ్రహాలకీ, కొండొకచో మూల విగ్రహాలకీ, కృత్రిమ చేతులూ, కాళ్లూ కూడా తగిలించేస్తున్నారు. ఆఖరికి తిరుమలేశుడికీ, చిన్న వెంకన్నకీ కూడా తప్పడంలేదీపాట్లు. 

కంచిలో వరదరాజస్వామిని--అరచేతులు పైకిపెట్టి, చేతులు ముందుకు చాపిన గరుడుని విగ్రహం పై వూరేగిస్తారు. స్వామిని ఆయన భుజాలపై కూర్చోబెట్టి కాళ్లు రెండూ గరుడుని చేతుల్లో వుంచుతారు. (నిజంగా అలాంటి ఉత్సవ విగ్రహం వుందేమో నాకు తెలీదు).

మలయప్ప స్వామిని మాత్రం గరుడినిపై కూర్చొన్నట్టు నిలబెట్టి, రెండు కృత్రిమ కాళ్లు గరుడుని చేతుల్లో వుంచుతున్నారు. (ఈ విషయంలో నేను వ్రాసినది  తప్పయితే నాకు తెలియబరచండి—సంతోషిస్తాను.)  

ఇంక చినవెంకన్న (ద్వారకా తిరుమల)అయితే, ఓ రోజు అదేదో 'వుట్టి కొట్టుడు' అనో వెన్న దొంగ అవతారం అనో—పైన వుట్టిలో ఓ కుండ వ్రేలాడదీసి, క్రింద అటకలా పేర్చి, దానికి ఓ నిచ్చెన వేసి, స్వామి  రెండు కృత్రిమ కాళ్లలో యెడం కాలుని నిచ్చెన మీద పెట్టి, కుడికాలుని వ్రేలాడేశారు. ఆ కాళ్లకి రేకుతో చేసిన పాదాల ఆకారంలో సాక్సులాంటివి కూడా తొడిగారు. 

ఇంకోరోజు “బక సంహార” అవతారం అని ఓ ఇత్తడి కొంగ బొమ్మని నిలబెట్టి, ఓ చేత్తో దాని ముక్కును చీలుస్తున్నట్టూ, రెండో చేత్తో దాన్ని పట్టుకున్నట్టూ, కాళ్లు మామూలుగా వ్రేలాడేసి అలంకరించారు.

అమ్మవార్లకైతే, సరస్వతీ అవతారం కోసం, అప్పటికే ఆవిడకి వున్న నాలుగు చేతులలో రెంటిని కప్పేసి, కృత్రిమ చేతుల్లో వీణని నిలబెట్టేస్తున్నారు. 

అసలు ఇలాంటి వాటికోసం వేరు వేరు వుత్సవ విగ్రహాలని తయారు చేయించచ్చు కదా? అలా చేయించి ఇచ్చే దాతలకీ, భత్తులకీ కొదవ లేదు కదా?

యేమిటో!

అన్నట్టు, అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒరిజినల్ గా రెండు చేతులు పైకీ, రెండు చేతులు క్రిందుగా ప్రక్కకీ వుంటాయి. వాటిలో వుండవలసిన శంఖు చక్రాలు, గదా కమలాలూ వుంటాయి. కానీ తరవాత వీరశైవులైన రాజులకి భయపడి, ఓ కృత్రిమ చేయిని తగిలించి, అది క్రిందకి వ్రేలాడేసి, ఆ చేత్తో ఓ పుష్పాన్ని క్రింద వున్న ఓ చిన్న శివలింగం మీద వుంచబోతున్నట్టు మలిచారట. నిజంగా కూడా, ఆ గుళ్లో ప్రస్ఫుటంగా కనపడేది  ఆ చెయ్యి ఒకటే. మిగతా విగ్రహాన్ని చూడడానికి మూడు గదుల్లోకీ కళ్లు చించుకోవాలి!

ఇప్పుడుగనక ఆ వీరశైవులు వుంటే, ఇప్పటి వాళ్లని దశావతారం సినిమాలో కమలహాసన్ ని వీపులో హుక్కులు గుచ్చి వ్రేలాడదీసినట్టు చేసి సముద్రంలో ముంచేసేవారేమో!

ఈ మధ్య కొన్ని సినిమాల్లో బ్రాహ్మణులని అవమానించారు అని ఆందోళన చెయ్యడానికి భ్రాహ్మణ సంఘాలు అన్నీ సంఘటితం అవుతున్నాయి. మంచిదే. ఓ పెద్దాయన్ని మోహన బాబు ఫోనులో “మీ బుర్ర పగల కొడతాం” అన్నాడు అనీ, “పగలకొడతాం” అనడానికి ఓ బూతు మాట వాడారనీ ఆయన స్వయంగా ఓ టీవీ ఛానెల్లో చెప్పారు! హౌ డేర్ హి? (అంటే ఆ చెప్పినాయన కాదు).

అయినా మనబంగారం మంచిదైతే…..అన్నట్టు, మొదటినుంచీ ఈ చైతన్యం వుంటే ఈరోజు ఈ స్థితికి వచ్చేదికాదు కాదా?

ఇప్పటికైనా వెర్రిమొర్రి “బండిపూజలూ, కారుపూజలూ, సినిమా కెమేరాలకీ, మెగాఫోన్లకీ పూజలూ, తిరుమలలో ప్రతిసినిమాకీ మొదటి రీలు పూజలూ, శంఖుస్థాపనలకి తాపీకీ, ఉలికీ పూజలూ" వగైరాలు మానేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కడుపు కక్కుర్తికోసం వేలం వెర్రులని ప్రోత్సహించకుండా, ఒకరిని మించి ఒకరు ఒకరి పొట్ట వొకరు కొట్టుకోవడం మానేస్తే ఇంకా మంచిది.

బ్రాహ్మణులూ—ఆలోచించండి.

4 comments:

Narasimha Rao Maddigunta said...

చాలా చక్కగా చెప్పారు! అసలు డబ్బులు తీసుకుని దైవ పూజలు చెయ్యడం, మహ పాపం అని "మను ధర్మం" చెప్పింది. కాని కాల మహిమ వల్ల మడులూ,మాన్యాలు కోల్పోయి భ్రాహ్మణులు, నెల జీతగాఅళ్లు అయ్యారు. అది గాక అడ్డమైన వాడిని దేఏవెనల పేరుతో పొగుడుతూ కుల బ్రష్టులవుతున్నారు.ఇది తెలిసుకుంటే చాలు.

Ammanamanchi Krishna Sastry said...

డియర్ Narasimha Rao Maddigunta!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

Chiranjeevi Y said...

అసలు ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాల్లో రాలేదు? మరి ఈ సినిమా మీదే ఎందుకు అందరూ కలిసి దాడి చెసారు?

ఒక హిందు అమ్మాయి ముస్లిం అబ్బాయి ని ప్రేమించడం వుంది కాబట్టి..
ఇక్కడ లాజిక్ ఎంటంటే ఒక బ్రాహ్మణుడు ఎవరితో నైనా తిరగొచ్చు కాని బ్రాహ్మణ అమ్మయి మాత్రం వాల్ల వాల్లతోనే తిరగాలి

Ammanamanchi Krishna Sastry said...

డియర్ Chiranjeevi Y!

వాళ్లు తప్పు పట్టింది యెవరు యెవరితో తిరిగారు అనే విషయం గురించి కాదనుకుంటా. హాస్యం పేరుతో హలీమ్‌ తినడం లాంటి దరిద్రపు సీన్ల గురించి.

అసలు సినిమాయే యేమాత్రమైనా వాస్తవానికి దగ్గరగా వుందా? మతసామరస్యం కార్డు మీద అవార్డులు కొట్టేయచ్చు అని ప్లాను. పనిలోపనిగా కోట్లు దండుకోవచ్చు అనే దురాశ! అంతే.

ధన్యవాదాలు.