Friday, December 28, 2012

తెలుగుని........! - 2తెలుగులోనే మాట్లాడదాం....

ప్ర తె మ లు మొదలయ్యాయి. 

కార్య నిర్వాహకుల కష్టం యేమిటో తెలిసింది. అదెంత వృధా అయిందో కూడా తెలిసింది. 

మధ్యాహ్నం 12.00 గంటలకి మొదలవుతాయన్నారు. టీవీలో యెక్కడా అలికిడిలేదు.  విసుగొచ్చి కట్టేసి, మళ్లీ నాలుగింటికి పెడితే, మన దూర దర్శన్--సప్తగిరిలో కి కు రె రాసుకొచ్చిన ఉపన్యాసం చదువుతున్నాడు. ఆయన మాటలకీ, పెదాల కదలికకి సంబంధం లేదేమిటా అనుకుంటుంటే, అది ఇంకెవరి గొంతో అని తెలిసింది! 

అప్పటికే తెలుగుతల్లి విగ్రహానికి దండవేసి, నివాళులు అర్పించేసి, అదేదో యాత్రని జెండావూపి ప్రారంభించేశారనీ, వార్తల్లో దృశ్యాలు చూపించారు తరవాత.

ఇంక దేశాధ్యక్షులవారి ఉపన్యాసం--బెంగాలీ లోనో, ఇంగ్లీషులోనో వ్రాసిస్తే, చాలా కష్టం మీద సహస్రాబ్దాల, శతాబ్దాల తెలుగు చరిత్రని వల్లెవేయించారు.

తరవాత గవర్నరుగారు. పూర్తిగా తెలుగులోనే, తడువుకుంటూ సాగింది......చాంగుబళా అంటూ.

రాష్ట్రపతిగారు అదేదో కట్టబోయే సమావేశమందిరానికి మీటనొక్కి శంఖుస్థాపన చేశారు. (తీరా ఆ ఫలకం ఇంగ్లీషులోనే వుంది!)

తరవాత ప్రముఖులకి "సత్కారాలు"--అధ్యక్షులవారి చేతులమీదుగా--"అకారాదిగా పిలుస్తాను" అంటూ అక్కినేనిని పిలిచారు. తరవాత మాత్రం అకారాది పాటించలేదు!

అప్పటిదాకా వేలాదిమంది భోజనాలు చెయ్యకుండా వుండిపోయినట్టున్నారు. నిర్వాహకులేమో, అయ్యో......చెప్పినట్టు తెలుగురుచులన్నీ వండేశాముకాదు....వృధా అయిపోయేవి.....అని ఆనందిస్తున్నట్టున్నారు. తీరా ఒక్కసారి అందరూ భోజనాలకి వెళితే, రకరకాల వంటకాలు కాదుకదా, అసలు అన్నమే లేదట చాలా మందికి!

మళ్లీ సాయంత్రం యెప్పుడో సప్తగిరివారు ప్రత్యక్ష ప్రసారం పెట్టారు. స్త్రీవాద రచయిత్రి అనూరాధ కవిత దగ్గరనుంచి చూశాను. 

తరవాత ఇంకో ఛానెల్లో అనుకుంటా, గజల్ శ్రీనివాస్, తనకి 7 నిమిషాలే సమయం ఇచ్చారు అంటూ రెండో మూడో గజల్స్ పాడాడు--సహజంగానే అతనికి యెవరూ సాటిలేరు అనిపించుకున్నాడు. 

తరవాత, సాహితీ వేదికపై, "త్రిభువ విజయం"--మహామహుడు బేతవోలు రామబ్రహ్మం "ఇంద్రుడు"గా, ప్రముఖులందరూ "కవులు"గా--"ఇంద్రుణ్ని పొగడద్దు. 3 నిమిషాల్లో ఒక్కొక్కరూ ముగించండి" అనడంతో అలరించింది. ఓక్క శ్రీనాధుడు--"నాకు సీసాలంటే ఇష్టమని, ఇంద్రుడు అందరికీ కాళ్లదగ్గర సీసాలు పెట్టించారు" అనడం, అక్కణ్నించీ సరసోక్తులన్నీ "సురాపానాన్ని" తలపిస్తూ సాగడం కాస్త వెగటు పుట్టించింది. 

.........ఇంకొంత ఇంకోసారి.

No comments: