Monday, December 31, 2012

తెలుగుని........! - 3



తెలుగులోనే మాట్లాడదాం....

రెండోరోజు పొద్దున్న "నష్ట నివారణ" చర్యగాననుకుంటా--ఓలేటి పార్వతీశం గారిచేత ఒకళ్లిద్దరిని అడిగించి, యేర్పాట్లు చాలా బాగున్నాయి, మాకు యే కష్టం తోచకుండా "పిల్లలు" (స్వయం సేవకులు) మంచినీళ్లూ భోజనాల దగ్గరనుంచీ చక్కగా చూసుకుంటున్నారు--అంటూ చెప్పించారు. (మర్నాడు పేపర్లలో వచ్చింది--గట్టి బందోబస్తు యేర్పాటు చేసి, టోకెన్లు జారీ చేసి, అవి వున్నవాళ్లకే భోజనాలూ వగైరా అందించారని! మరి ముందే ఆ తెలివి యెందుకు లేకపోయిందో?)

ఇంకా "ప్రథాన వేదిక" కీ, దానిమీద రా నా ల తొంబకీ ఇచ్చిన ప్రాథాన్యం మిగిలిన వేదికలకి ఇవ్వలేదు అని తెలుస్తూనే వుంది. (వారు కొన్ని ప్రసారం చేశారేమో గానీ కరెంటు కోత పుణ్యమా అని కొన్ని నేను చూడలేకపోయీ వుండొచ్చు అనుకున్నాను).

సంతోషం కలిగించిన విషయం యేమిటంటే, మహామహుడు నేరెళ్ల వేణుమాధవ్, మొత్తం సమయం తానే తినెయ్యకుండా, ఆయన శిష్యులచేత ప్రదర్శన ఇప్పించడం!

అవధాన వేదిక మీద యేమి జరిగిందో, తెలీదు. సినీకళాకారుల ప్రదర్శనా, వాళ్లకి సన్మానాలూ బాగానే జరిగాయి అని పేపర్లో వచ్చింది. 

అనేకమంది "ఇవి గందరగోళ మహాసభలు" అనీ, ఆహ్వానితులకి ఆదరణలేదు అనీ, యెందుకు పిలిచారో, యెక్కడికి వెళ్లాలో, యెవరిని కలవాలో, పత్రాల సమర్పణ యెవరు యెక్కడ యెప్పుడు చెయ్యాలో తెలీదనీ, బోళ్లు దూరాల్లో వున్న ఇతర చోట్లకికూడా రవాణా సౌకర్యం యేర్పాటు చెయ్యలేదు అనీ, వసతి గురించి అంతా వట్టి మాటేననీ వాపోయారట--అనేకమంది ముఖ్యులు కూడా.

ఇంక మంత్రి పార్థసారథి, వంటకాలు వాసన వస్తున్నాయి అని ఫిర్యాదు వస్తే, రుచి చూసి, "సంబంధిత గుత్తేదారు మీద చర్య తీసుకుంటాం, తప్పులు తేలితే నగదు చెల్లింపులో కోత విధిస్తాము" అన్నారట. శాసన సభ్యుడు మల్లాది విష్ణు అయితే, తినలేక, పళ్లాన్ని విసిరేసి వూరుకున్నారట. కొంతమంది ప్రముఖులు, రాత్రి మిగిలిన చద్దన్నాన్ని పులిహోర చేసి పెట్టేస్తున్నారు అని బాధపడ్డారట! 

.........ఇంకొంత ఇంకోసారి.

No comments: