Wednesday, February 26, 2014

ఆత్మలూ..............--2


.....సాక్షాత్కారం

తరువాత...........

తూర్పు వైపుగా తిరిగి, బాసింపట్టు వేసుకొని కూర్చోవాలి. ఇదేదో చాదస్తం కాదు. యే వరండాలోనో కూర్చున్నా, పడగ్గదిలోనే, మంచం మీదే కూర్చున్నా, చాపమీద కూర్చున్నా, తలుపులు తెరిచి వుంటే, సూర్యోదయం తో వచ్చే వెలుగు కనిపిస్తుందని. పద్మాసనం కోసం కూడా కష్టపడఖ్ఖర్లేదు. ప్రాణాయామం ప్రారంభించాలి. భయపడకండి. ఇక్కడ హిప్నాటిజం, శ్వాసమీద ధ్యాస ఉపయోగిస్తాయి. 

దీర్ఘంగా శ్వాస తీసుకొంటూ, పూర్తయ్యాక వీలైనంతసేపు ఊపిరి బిగబట్టి (కుంభకం అంటారు), తీసుకొనే సమయానికి రెట్టింపు సమయం లో ఊపిరి వదలాలి (రేచకం అంటారు). ఈ లెఖ్ఖలు పెద్ద ముఖ్యం కాదు. క్రమంగా రెట్టింపు కన్నా యెక్కువ సమయం పట్టడం మీరే గమనిస్తారు. ఇలా యేకాగ్రంగా జరుగుతున్నప్పుడు, దృష్టిని భ్రూమధ్యం లో (కనుబొమల మధ్య--బొట్టుపెట్టుకొనే చోట) కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. ఇది సాధించడానికి కూడా పెద్ద కష్టపడఖ్ఖర్లేదు. ముందుగానే యే దృశ్యం కనబడినా భయపడను అని నిశ్చయం చేసుకోండి. (యెందుకో తరువాత తెలుస్తుంది). 

ఈ ప్రయత్నం కొంత ఫలించేటప్పటికి, కళ్లముందు ఓ పెద్ద సర్పం (అనకొండ సైజులో వుండొచ్చు, వివిధ సైజుల్లో తోచవచ్చు సాధించేవాళ్లని బట్టి) చుట్టలు విప్పుకోవడం కనిపిస్తుంది. కొన్ని ముందుకీ, కొన్ని వెనక్కీ తిరుగుతూ, తలా తోకా కనాపడకుండా, నల్లటి చుట్టలు, తెల్లటి మచ్చలూ, గీతలతో అలా వదులవుతూనే వుంటాయి. ఇంకా యేకాగ్రతతో కొనసాగించండి--భ్రూమధ్యం నుంచి దృష్టి మరల్చకుండా.   

హటాత్తుగా ఓ పెద్ద పడగ సాక్షాత్కరిస్తుంది--యెర్రటి కళ్లు మీ కళ్ళలోకి ఫోకస్ అవుతూ, బుసలు కొడుతూ, ద్విజిహ్వ మీ భ్రూమధ్యాన్ని స్పృశిస్తూ, చెలరేగిపోతుంది. అదే కుండలిని. (భయపడకూడదు అని ముందే నిశ్చయించుకోకపోతే, ఇక్కడ మెలకువ వచ్చేస్తుంది. అయినా ఫర్వాలేదు. ఇంకా సూర్యోదయం కాకుండా వుంటే మళ్లీ ప్రయత్నించవచ్చు. లేదా మర్నాడు ప్రయత్నించవచ్చు.)

అది అన్ని చక్రాలనీ మేల్కొల్పిందా, మొదలైన సందేహాలు అనవసరం. ఆవన్నీ పూర్తయ్యాకే ఆ స్టేజి కి వస్తుంది.  ఇంక సహస్రారాన్ని చేరడమే తరువాయి. అప్పటికి చాలా సేపటి నుంచే మీశ్వాస రెగ్యులేట్ అయి వుంటుంది కాబట్టి, అది పెద్ద కష్టం కాదు. కాబట్టి, మొదటిసారే అది సాధ్యం కాకపోయినా, క్రమ సాధనతో అది సుసాధ్యమే. నిర్భయంగా ఆ సర్పం కళ్లలోకి చూస్తూ, ఆ జిహ్వల స్పర్శని ఆస్వాదిస్తూ, భ్రూమధ్యాన్ని దర్శిస్తూ వుండగా............

హటాత్తుగా ఓ పెద్ద వెలుగు--మామూలు కళ్లతో యేమాత్రం చూడలేని వెలుగు--మనకళ్లు యెప్పుడూ చీకటీ, నలుపూ చూడనేలేదన్నట్టు అనిపించే వెలుగు--మధ్యమధ్య లో ఇంద్రధనుస్సు రంగులతో యేర్పడుతున్నట్టనిపించే పలుచని నీడలతో--కనిపిస్తుంది. ఆ అనుభవం వర్ణనాతీతం. అదే "గాయత్రి." యజ్ఞోపవీత ధారులైతే గాయత్రీ మంత్రాన్ని మనసులోనే జపించండి. ఇతరులు ఇష్టదేవతా ప్రార్థన చేసుకోండి. కేవలం తలుచుకున్నా చాలు........అప్పుడు అవుతుంది ఆత్మ సాక్షాత్కారం!

యెలా?

(మరోసారి)

Tuesday, February 25, 2014

ఆత్మలూ.....


............సాక్షాత్కారం

12-08-2010 న వేరెవరిదో బ్లాగ్ లో నేను వ్రాసిన కామెంట్ మీద, TEJA-M అనే ఆయన నన్ను మెయిల్ ద్వారా 31-08-2013 న సంప్రదించారు. ఆయన సందేహాలు ఆయన మాటల్లోనే--".......ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నదే నా లక్ష్యం. నేను ప్రస్తుతం సద్గురువు అన్వేషణలో వున్నాను............1. మీకు ఆత్మ సాక్షాత్కారం కలిగిందా? 2. నాకు ఈ విషయంలో (ఆత్మ సాక్షాత్కారం) ఏమైనా సహాయం చేయగలరా?......." 

అప్పటినుంచీ, అనేక కారణాలవల్ల, సమాధానం వ్రాయాలని వున్నా, వీలుకాలేదు. ఆయనకి వ్యక్తిగతంగా మెయిల్ లో సమాధానం ఇచ్చేకన్నా, ఓ టపా వ్రాస్తే అందరూ చూస్తారు కదా అని అలోచన రావడంతో, ఆగి ఆగి, ఇప్పటికి వీలు చిక్కింది.

ముందుగా కొన్ని విషయాలు స్పష్టం చెయ్య్దలుచుకున్నాను. 

1. ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పే కబుర్లు అన్నీ వఠ్ఠి ట్రాష్. 
2. కుండలిని ని జాగృతం చెయ్యడానికి సాధన అవసరం--అంటే అదేదో ఘోరమైనా తపస్సు అని భయపడవలసిన అవసరం లేదు.
3. యోగ సాధన, యోగం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం, పిరమిడ్ ధ్యానం లాంటి వాటి గురించి గాభరా పడనక్కర్లేదు.
4. సద్గురువులు వేరే యెక్కడో వుండరు. మీ తండ్రో, అన్నదమ్ములో, స్నేహితులో, కొలీగో కావచ్చు. కాషాయ బట్టలూ, గడ్డాలూ, మీసాలూ, దండ కమండలలూ చూసి మోసపోవద్దు.
5. పత్రికలలో వచ్చే కాలక్షేపం ఆధ్యాత్మిక రాతలు అసలు నమ్మద్దు. పట్టించుకోవద్దు.

నేను 1992 లో హైదరాబాదు లోని ప్రఖ్యాత హిప్నాటిస్ట్ డాక్టర్ నగేష్ దగ్గర 'సెల్ఫ్ హిప్నాటిజం' నేర్చుకొన్నాను. అది చాలా దోహదం చేసింది. ఇతరులని కూడా హిప్నటైజ్ చెయ్యగల సామర్ధ్యం స్వయం సాధన ద్వారా నేర్చుకొన్నాను. నా పిల్లలకీ, కొలీగ్స్ కీ కొన్ని చిన్న చిన్న సమస్యలని అధిగమించడానికి సహాయం చేశాను.

మరి ఈ సెల్ఫ్ హిప్నాటిజం అంటే యేమిటి? అంటే, మనని మనం హిప్నాటిక్ ట్రాన్స్   అనే ఓ నిద్ర లాంటి స్థితిలోకి తీసుకెళ్లి, యేకాగ్రతతనీ, టెన్షన్ లకి  దూరంగా మానసిక ప్రశాంతతనీ పొందడానికి వీలవుతుంది. ఆ సమయం లో మనకి మనం ఇచ్చుకొనే సూచనలు, తరువాత మనమే ఆచరణలో పెట్టడానికి దోహదం అవుతుంది. ముఖ్యంగా మంచి నిద్ర పడుతుంది, యేకాగ్రత్త పెరుగుతుంది.

దీనికీ, కుండలినికీ సంబంధం వుందా అంటే వుంది, లేదు అంటే లేదు. 

సరే........మనం చెయ్యవలసింది........ఉదయం సూర్యోదయానికి కనీసం ఓ గంట ముందు నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని, సిధ్ధం కావడం. అంటే సుమారు 4-30 కి లేస్తే, 5-00 కల్లా సిధ్ధం కావచ్చు. ఇదేదో పవిత్రతకోసం కాదు. అవశిష్టాలవల్ల అంతరాయం కలగకుండా. 

ఇలా లేవడం అలవాటైనవాళ్లకి పెద్ద విషయం కాదు. దీనికి సెల్ఫ్ హిప్నాటిజం లో రాత్రి నిద్రపోయే ముందే సూచన ఇచ్చుకోవచ్చు. అలవాటులేనివాళ్లు కొంచెం కష్టపడక తప్పదు మరి. 

తరువాత...........

(మరోసారి)