Wednesday, February 26, 2014

ఆత్మలూ..............--2


.....సాక్షాత్కారం

తరువాత...........

తూర్పు వైపుగా తిరిగి, బాసింపట్టు వేసుకొని కూర్చోవాలి. ఇదేదో చాదస్తం కాదు. యే వరండాలోనో కూర్చున్నా, పడగ్గదిలోనే, మంచం మీదే కూర్చున్నా, చాపమీద కూర్చున్నా, తలుపులు తెరిచి వుంటే, సూర్యోదయం తో వచ్చే వెలుగు కనిపిస్తుందని. పద్మాసనం కోసం కూడా కష్టపడఖ్ఖర్లేదు. ప్రాణాయామం ప్రారంభించాలి. భయపడకండి. ఇక్కడ హిప్నాటిజం, శ్వాసమీద ధ్యాస ఉపయోగిస్తాయి. 

దీర్ఘంగా శ్వాస తీసుకొంటూ, పూర్తయ్యాక వీలైనంతసేపు ఊపిరి బిగబట్టి (కుంభకం అంటారు), తీసుకొనే సమయానికి రెట్టింపు సమయం లో ఊపిరి వదలాలి (రేచకం అంటారు). ఈ లెఖ్ఖలు పెద్ద ముఖ్యం కాదు. క్రమంగా రెట్టింపు కన్నా యెక్కువ సమయం పట్టడం మీరే గమనిస్తారు. ఇలా యేకాగ్రంగా జరుగుతున్నప్పుడు, దృష్టిని భ్రూమధ్యం లో (కనుబొమల మధ్య--బొట్టుపెట్టుకొనే చోట) కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. ఇది సాధించడానికి కూడా పెద్ద కష్టపడఖ్ఖర్లేదు. ముందుగానే యే దృశ్యం కనబడినా భయపడను అని నిశ్చయం చేసుకోండి. (యెందుకో తరువాత తెలుస్తుంది). 

ఈ ప్రయత్నం కొంత ఫలించేటప్పటికి, కళ్లముందు ఓ పెద్ద సర్పం (అనకొండ సైజులో వుండొచ్చు, వివిధ సైజుల్లో తోచవచ్చు సాధించేవాళ్లని బట్టి) చుట్టలు విప్పుకోవడం కనిపిస్తుంది. కొన్ని ముందుకీ, కొన్ని వెనక్కీ తిరుగుతూ, తలా తోకా కనాపడకుండా, నల్లటి చుట్టలు, తెల్లటి మచ్చలూ, గీతలతో అలా వదులవుతూనే వుంటాయి. ఇంకా యేకాగ్రతతో కొనసాగించండి--భ్రూమధ్యం నుంచి దృష్టి మరల్చకుండా.   

హటాత్తుగా ఓ పెద్ద పడగ సాక్షాత్కరిస్తుంది--యెర్రటి కళ్లు మీ కళ్ళలోకి ఫోకస్ అవుతూ, బుసలు కొడుతూ, ద్విజిహ్వ మీ భ్రూమధ్యాన్ని స్పృశిస్తూ, చెలరేగిపోతుంది. అదే కుండలిని. (భయపడకూడదు అని ముందే నిశ్చయించుకోకపోతే, ఇక్కడ మెలకువ వచ్చేస్తుంది. అయినా ఫర్వాలేదు. ఇంకా సూర్యోదయం కాకుండా వుంటే మళ్లీ ప్రయత్నించవచ్చు. లేదా మర్నాడు ప్రయత్నించవచ్చు.)

అది అన్ని చక్రాలనీ మేల్కొల్పిందా, మొదలైన సందేహాలు అనవసరం. ఆవన్నీ పూర్తయ్యాకే ఆ స్టేజి కి వస్తుంది.  ఇంక సహస్రారాన్ని చేరడమే తరువాయి. అప్పటికి చాలా సేపటి నుంచే మీశ్వాస రెగ్యులేట్ అయి వుంటుంది కాబట్టి, అది పెద్ద కష్టం కాదు. కాబట్టి, మొదటిసారే అది సాధ్యం కాకపోయినా, క్రమ సాధనతో అది సుసాధ్యమే. నిర్భయంగా ఆ సర్పం కళ్లలోకి చూస్తూ, ఆ జిహ్వల స్పర్శని ఆస్వాదిస్తూ, భ్రూమధ్యాన్ని దర్శిస్తూ వుండగా............

హటాత్తుగా ఓ పెద్ద వెలుగు--మామూలు కళ్లతో యేమాత్రం చూడలేని వెలుగు--మనకళ్లు యెప్పుడూ చీకటీ, నలుపూ చూడనేలేదన్నట్టు అనిపించే వెలుగు--మధ్యమధ్య లో ఇంద్రధనుస్సు రంగులతో యేర్పడుతున్నట్టనిపించే పలుచని నీడలతో--కనిపిస్తుంది. ఆ అనుభవం వర్ణనాతీతం. అదే "గాయత్రి." యజ్ఞోపవీత ధారులైతే గాయత్రీ మంత్రాన్ని మనసులోనే జపించండి. ఇతరులు ఇష్టదేవతా ప్రార్థన చేసుకోండి. కేవలం తలుచుకున్నా చాలు........అప్పుడు అవుతుంది ఆత్మ సాక్షాత్కారం!

యెలా?

(మరోసారి)

No comments: