Monday, March 3, 2014

ఆత్మలూ.....--3


.............సాక్షాత్కారం

యెలా? అంటే..............

మనం (అంటే నేను అనబడే ఆత్మ) పైన కొంచెం యెత్తులో వుండి, మన (అంటే నేను  అనుకునే) శరీరాన్ని చూసుకోగలుగుతాం! అది కొంత యెత్తు అంటే ఓ పది అడుగులు కావచ్చు, సాధన పెరిగే కొద్దీ 100 అడుగులు కావచ్చు. కాసేపు అంటే కొన్ని క్షణాలు కావచ్చు, అరగంటైనా కావచ్చు, మామూలు వెలుగు మన శరీరాన్ని సోకడం వరకూ కావచ్చు. 

అదే ఆత్మ సాక్షాత్కారం. అంటే మనని మనం చూసుకోవడం. అంతే. యెవరు చెప్పినా, 'నీలో వున్న నిన్ను చూసుకో' అనే చెప్పారు. దాన్ని చాలామంది అపార్థం చేసుకొన్నారు, కొంతమంది విపరీతార్థాలు తీశారు. 

ఒకటి మాత్రం స్పష్టం--శరీరధారులై వుండగా, మన ఆత్మ మన శరీరాన్ని చూడగలదు కానీ, మనం అనబడే శరీరం ఆత్మని చూడలేదు! దాన్ని ఆత్మ సాక్షాత్కారం అని యెలా అనగలం?

సంక్రాంతి పండగకి మా జిల్లాల్లో సిరిబొమ్మ అని--నేలలో ఓ స్థంభం పాతి, దాని మీద అడ్డంగా ఇంకో పెద్ద స్థంభాన్ని యేర్పాటు చేసి, అడ్డంగా పెట్టిన స్థంభాన్ని యేటవాలుగా పైకి లేచేలా చేసి, క్రింది భాగాన్ని పాతిన స్థంభానికి తాళ్లతో కట్టేస్తారు. యేటవాలుగా వున్న స్థంభం చివర కత్తి పట్టుకొని, పెద్ద మీసాలతో, తలపాగా, పంచె చొక్కా తో వున్న వీరుడు బొమ్మని తగిలిస్తారు. యేటవాలు దూలాన్ని క్రింద వైపు పట్టుకొని, పాతిన స్థంభం చుట్టూ తిరిగితే, పైనున్న వీరుడు మరింత పెద్ద వృత్తాకారం లో పైన తిరుగుతూ వుంటాడు. 

విజయనగరం లో పైడితల్లి జాతరకైతే, పై స్థంభం చివర ఓ కుర్చీ యేర్పాటు చేసి, పూజారిని అందులో కూర్చోబెట్టి తిప్పుతారు. దాదాపు 40 అడుగుల యెత్తున అతన్ని (నిద్రాహారాలు లేకుండా అంటారు) త్రిప్పుతారు.

ఈ శతాబ్దం మొదట్లో నేను కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పనిచేస్తూ వున్నప్పుడు, జాతరల్లో మనుషులని, కొన్ని చోట్ల ఆడవాళ్లని కూడా, వీపుకి ఇనుప కొక్కాలు త్రాళ్లతో బిగించి, ఆ త్రాళ్లని పై స్థంభానికి కట్టి--దశావతారం సినిమాలో కమల్ హాసన్‌ లా--తిప్పేవారు. పేపర్లలో ఫోటోలు కూడా వచ్చేవి. తరవాత్తరవాత పోలీసులు గట్టి చర్యలు తీసుకొని, మనుష్యులని వ్రేలాడదీయడం మానేశారు. దాన్ని వాళ్లు 'షిడి' లేదా 'సిడి' అనేవారు. 

యెందుకు వ్రాశానంటే, భూమిలో పాతిన స్థంభం మన శరీరం అనుకుంటే, పైన తిరుగుతున్న వీరుడు మాన ఆత్మ అన్నమాట. 

మరి సిడి యేది?

మన బట్టలు కుట్టే దరాన్ని వ్యతిరేక దిశలో తిప్పి, పురి వదిలించేస్తే, రెండు మూడు పలుచని దారాలుగా విడిపోతుంది. పేనినప్పుడు గట్టిగా వుండే దారం, పురి విప్పేస్తే, ముట్టుకుంటే తెగిపోయేలా వుంటాయి ఆ దారాలు. వూలు దారాలని గమనిస్తే యెలా వుంటాయో అలా వుంటాయి అవి. 

మన ఆత్మ కీ శరీరానికీ మధ్య అలాంటి దారాలు, కనిపించీ కనిపించకుండా బంధాన్ని యేర్పరుస్తూ వుంటాయి. ఆ బంధం వున్నంతకాలం మనం జీవించి వున్నట్టే. సాధనలో యెప్పుడైనా ఆ బంధాన్ని వదిలించుకొని, దూరం గా వెళ్లాలని ఆత్మ ప్రయత్నిస్తే, వెంటనే మెలుకువ వచ్చేస్తుంది. కాబట్టి మనం భయపడఖ్ఖ్రర్లేదు. 

సాధన పెరిగే కొద్దీ, ఆ వృత్తం వ్యాసం పెరిగి పరిధి విస్తృతం అవుతూ వుంటుంది కానీ, అలా ఒకవైపు ఓ నాలుగడుగులు యెక్కువ దూరం ఆత్మని తీసుకెళదాం అనుకున్నా, సాధ్యం కాదు. కాబట్టి, ఆత్మ తలుచుకుంటే యెక్కడికైనా వెళ్లిపోగలదు అనేది ఓ అపోహ మాత్రమే!

(ఇంకొంత మరోసారి)

No comments: