హేతువాదులు-6మరిచిపోయాను—మొన్న ఉగాదికి—పాత సంవత్సరం మధ్యాన్నమెప్పుడో వెళ్ళిపోయింది—చైత్ర శుధ్ధ పాడ్యమి ప్రవేసించి, కొత్తసంవత్సరం ప్రారంభమయ్యింది!
కానీ—వీళ్ళకి ఉగాది ఆ మర్నాడుగానీ ప్రారంభం కాలేదు—పైగా ప్రభుత్వానికి కూడా సలహా ఇచ్చి, ఉగాది వాళ్ళు చెప్పిన రోజే జరిపించారు!
ఇంతకన్నా పరాకాష్ట యేముంటుంది!
జాతకాలు : — వీటిగురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది!
శిశువు పుట్టగానే జాతకం వ్రాయించేవారు ఇదివరకు—జన్మ సమయాన్ని బట్టి—స్థూలం గా ఆ శిశువు భవిష్యత్తు తెలుసుకోవచ్చు అని ఓ నమ్మకం వుండేదిట ఆ రోజుల్లో!
పాత రాజుల సినిమాల్లోనూ, జానపద సినిమాల్లోనూ చాలా చూశాము కదా—రాజుగారి కోడుకో కూతురో పుట్టగానే ఆస్థాన జ్యోతిష్కులు వచ్చి ఫలానా సంవత్సరం లో ఫలానా గండం వుంది అని చెప్పడం, రాజుగారు బెంగపెట్టుకోవడం, ఆఖరికి హీరో వచ్చి ఆ గండం నించి రక్షించడం!
మహా మంత్రి తిమ్మరుసు ఓ జ్యోతిష్కుడు జాతకం చెప్పాక, ‘మీ జాతకం లో మీరు యెప్పుడు చచ్చిపోతారో వ్రాసి వుందా?’ అని అడిగి, ‘నాకు పూర్ణాయుర్దాయం వుంది’ అని చెప్పగానే, ఆ ప్రక్కనించి ఓ సైనికుడు వేసిన బాణానికి గురై చచ్చిపోవడం కూడా చూశాము!
ఇక ఇప్పుడు కంప్యూటర్ జాతకాలు! ఇవెంత గొప్పవంటే, ఒకే వ్యక్తి జాతకం—అదే జన్మ స్థలం, సమయం, తేదీ లతో—ఢిల్లీలోనూ, కలకత్తాలోనూ, ముంబాయిలోనూ, చెన్నైలోనూ, బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ, వేరు వేరు వ్యక్తులు వేరు వేరు కంప్యూటర్లలో వ్రాయిస్తే, 6 రకాల జాతకాలు వచ్చాయి—ఒకదానికీ, ఒకదానికీ పొంతన లేకుండా!
ఇంతకన్నా ఇక చెప్పేదేముంది!
అయినా, ఇప్పటికి కూడా వీటికి ప్రచారం జరుగుతూనే వుంది—ముఖ్యం గా పెళ్ళి సంబంధాలు కుదరాలంటే ఒకలాగా, చెడగొట్టాలంటే ఇంకోలాగా—వుపయోగించుకొని!
మరి గిరీశం కాలం నించీ (జాతకాలు ‘బనాయించడం’ విషయంలో) మనమేమి నేర్చుకున్నట్టు?