Saturday, July 11, 2009

హేతువాదం

హేతువాదులు-3
1971 లో మా డిగ్రీ చదువులు పూర్తయ్యాక, 1972 లో కాన్వొకేషన్ యేర్పాటుచేశారు.
1970 వరకూ, విద్యార్థులకి వైజాగ్ లో యూనివర్సిటీలో కాన్వొకేషన్ నిర్వహించేవారు! ఆ సందర్భం గా నెత్తిమీద నల్లని గుడ్డతో కప్పబడిన స్క్వేర్ అట్టనీ, నల్లని—జడ్జీలు తొడుక్కొనేలాంటి గౌనుల్నీ విద్యార్థులు ధరించవలసివచ్చేది! (ఆ గౌన్లూ అవీ అక్కడే ఆ కాసేపూ అద్దెకి ఇచ్చేవారట!) మా నాన్నగారైతే—‘వీణ్ణి కాన్వొకేషన్ కి యెలా పంపించాలో! అక్కడ గుడ్డల అద్దెలూ అవీ యెలా భరించాలో!’ అని బెంగ పడ్డారు!
ప్రభుత్వం పుణ్యమా అని, మా బ్యాచ్ నించే కాన్వొకేషన్లని ‘వికేంద్రీకరించి’ యెవరి కాలేజీ లో వాళ్ళు నిర్వహించుకోవచ్చు అన్నారు! విద్యార్థులు ధరించడానికి ఒక ‘మెరూన్’ రంగు స్చార్ఫ్—ముక్కోణాకారపు గుడ్డ—దీన్ని వీపు మీద మెడ చుట్టూ ధరించి, ముందుకు లాక్కొని, రెండు కొనలూ ముడివేసుకోవాలన్నమాట—లని కూడా వుచితంగా ఇచ్చే యేర్పాటు చేశారు! దాన్ని యెవరికి వారు ‘ఙ్ఞాపిక’ గా తీసుకెళ్ళిపోవచ్చు! (హమ్మయ్య! అనుకొన్నారు మా నాన్నగారు!)
ఆ రోజున మేమందరం వుత్సాహం గా కాలేజీ కి వెళ్ళాము, స్కార్ఫ్లూ, బేడ్జీలూ ధరించి, ఆడిటోరియం లోకి చేరాము—అంతకు ముందే, బ్యానర్లు ప్రకటించాయి ‘ముఖ్య అతిథి—శ్రీ వేదవ్యాస్—డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, యే యూ’ అంటూ!
ఇంగ్లీషు మీడియం లో డిగ్రీ అయితే చదివాముగానీ, ‘డీన్’; ‘ఫ్యాకల్టీ’ లాంటి మాటలకి మాకర్థం తెలియదు—ఒకర్నొకరు అడుక్కుంటూ, ఆడిటోరియం లోకి వెళ్ళడానికి ముందు తెలుసుకున్నాము—డీన్ అంటే, మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ లాగ, యూనివర్సిటీలో ఒక పదవి అనీ, ఫ్యాకల్టీ అంటే పాఠాలు చెప్పేవాళ్ళని అలా అంటారనీ!
ఇంకా, లోపల ముందువరసలలో ప్రేక్షకుల కుర్చీలలో కూర్చొని, ‘వీడెవడో వేద వ్యాసుడట! భారతం, భాగవతం చెపుతాడో యేమిటో! యెలా భరించాలిరా బాబూ! అనుకొని, ‘ఆన్! అంతకీ అయితే మన గ్యాస్—‘స్స్ స్స్ స్స్ స్’ అనే సౌండ్ వదలడం వుందిగా! వాడే ఆపేస్తాడు’ అని ఆనందిస్తూ కూర్చొన్నాము!
ముందు మా ప్రిన్సిపల్ గారు అతిథుల్ని ‘వెల్ కం’ చేశారు—‘మిష్టర్ డీన్’—అంటూ! తరవాత, డీన్ గారు ‘మిష్టర్ ప్రిన్సిపల్!’ అనగానే—“అహాన్! ఇలా డెజిగ్నేషన్లతో పిలిచేటప్పుడు ‘మిష్టర్’ వాడచ్చన్నమాట”—అనుకొన్నాము!
పేరు పేరునా అందరినీ పిలిచి, డిగ్రీ సర్టిఫికెట్లని—చక్కగా చుట్టి, సన్నటి రంగు రిబ్బన్లు కట్టి—ప్రదానం చేశారు. తరవాత—వేదవ్యాస్ గారి ‘కీనోట్ అడ్డ్రెస్’ (భారతమా, భాగవతమా…….!) ఉత్సుకతతో మా వెయిటింగ్—ఆయన మామూలుగా మొదలు పెట్టగానే, మా ‘స్స్ స్స్…’ లతో స్వాగతం! ఆయన చెక్కు చెదరలేదు—పైగా,
‘స్స్ స్స్….’ అనే శబ్దం పాములదనీ, వాటిని ‘వాయుభుక్కులు’ అంటారనీ…..ఇలా యేవేవో చెప్పి, అనర్గళంగా వేదాల్లోంచీ, పురాణాలలోంచీ, ఉపనిషత్తుల్లోంచీ శ్లోకాలు వుదహరిస్తూ, మాట్లాడుతూంటే—చెపితే నమ్మరు—పిన్ డ్రాప్ సైలెన్స్! అందరూ హిప్నటైజ్ అయిపోయారు!
ఆయన ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజుకీ మా చెవుల్లో మార్మోగుతూ వుంటాయి—‘మనో వేగాన్ని మించినది వేరే లేదు—రాబోయే కాలం లో, యుద్ధాలు ఆయుధాలతో కాదు—మనస్సులతో జరుగుతాయి—అవి మేథోయుద్ధాలు! మనస్సు కన్నా పవర్ ఫుల్ ఆయుధం వేరేదీ లేదు……….’ ఇలా చెప్పుకు పోయారు!
…..ఇంకా వుంది!

2 comments:

జయహొ said...

Been worrying about the diminishing standards in the banking industry in India and the haphazard way in which it is going hi-tech!


It will be good/useful for bloggers if you write articles on what are those diminishing standards in the banking industry.

A K Sastry said...

డియర్ జయహొ!

అడపాదడపా భారతీయ బ్యాంకులగురించీ, వాటి పాత్ర గురించీ వ్రాస్తూనే వున్నాను! ఇంక మెకనైజేషన్ గురించి వ్రాద్దామని అనుకుంటూనే ఆశ్రద్ధ చేస్తున్నాను! త్వరలో వ్రాయడానికి ప్రయత్నిస్తాను!

నా ఇతర బ్లాగుల్లో పాత టపాలు చూడండి!

ఇంక అస్తమానూ అవే వ్రాస్తుంటే, చదివేవాళ్ళుండరు కదా!

ధన్యవాదాలు!