Friday, July 10, 2009

మరో రకం.....

హేతువాదులు-2
(నిన్న వ్రాసిన నా టపా మీద వచ్చిన కామెంట్లు చదివి, ‘ఆహా! ఇంకో నాలుగు టపాలకి మెటీరియల్ దొరికింది!’ అన్న ఆనందం తో మళ్ళీ రెండో టపా వ్రాస్తున్నాను—చదవండి మరి!)
మాకో హిందీ మేష్టారు వుండేవారు. (ఇప్పుడింకా వున్నారనుకోను). శ్రీ ఫ్రాన్సిస్ గారు! ఆయన బై బర్త్ క్రిస్తియన్. అయినా, పురాణాలూ, ఉపనిషత్తులూ, అవీ, ఇవీ చదివేశాడు! పచ్చటి శరీరం, సన్నగా ఓ ఆరడుగులు పొడుగూ, చక్కటి పంచె కట్టూ, పనసతొనరంగు తో ఆ రోజుల్లో వచ్చే సిల్కు షర్టూ (పొడుగు చేతులూ, రోల్డ్ గోల్డ్ కఫ్ లింక్సూ, బొత్తాలూ వుండేవి!) వేసుకొని, వూచలా నడిచేవాడు. చేతిలో ఓ చిన్న గుడ్డ సంచీ! దాంట్లో పుస్తకాలూ!)
ఆయన పరిశోధించి, కనుక్కున్న విషయం గా అందరికీ చెప్పేవాడు—క్రీస్తూ, కృష్ణుడు ఒకడే అని! క్రీస్తు తన శిష్యులచేత ‘యఙ్ఞం’ చేయించాడని! (అన్న ఎన్ టీ ఆర్ లాగ ఆయన కూడా ‘యఙ్ఞం’ అండానికి ‘యగ్నం’ అనేవాడు! అదే పేరు తను వ్రాసిన పుస్తకానికీ పెట్టాడు!)
‘అనన్యస్చింతయం తోమా’ అన్న గీతావాక్యాన్ని వుదహరించి ‘క్రీస్తు తన శిష్యుడు తోమా తో ‘నువ్వూ యేమీ ఆలోచించకు! పరమతాన్ని వదిలెయ్యి! నా మతాన్నే అనుసరించు! పరమతాలు భయావహాలు!’ అని చెప్పాడని బోధించేవాడు!
వుద్యోగాన్ని గాలికొదిలేసి, చేతులో గుడ్డ సంచి తో తన ‘యగ్నం’ పుస్తకాన్ని చెత్తో పట్టుకొని, వీధులు తిరిగేవాడు—కొనండి కొనండి అంటూ!
కానీ ఆయన మేధావి! యెవరైనా యెదైనా వాదనకి దిగితే, వేదాల్లోంచి, పురాణాల్లోంచీ, ఉపనిషత్తుల్లోంచీ శ్లోకాలు వుదహరిస్తూ, అనర్గళం గా వాదించి, ‘ఓహ్!’ అనిపించేవాడు!
మరి హేతువాదులూ, ఆస్థికులూ ఈయన్ని యేమంటారు?

No comments: