Tuesday, September 8, 2009

హేతువాదం…..


హేతువాదులు--13


ప్రదక్షిణలు : --  


ఈనాడు దినపత్రికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారన్నట్టు, దేవుడికి నైవేద్యం తరవాత, చివరగా ఆచరించేవి--ప్రదక్షిణం, నమస్కారం.  


మరి గుళ్ళోకి ప్రవేశించగానే, ధ్వజ స్థంభం దగ్గర మొదలుపెట్టి, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, ఒక్కో ప్రదక్షిణా అవగానే, తల ధ్వజస్థంభ పీఠానికి ఆనించి, అప్పుడు మంటపం లో ప్రవేశించి, గంట మోగించి, అప్పుడు దేవుడి దర్శనం చేసుకొని, అర్చించడం యెవరు ప్రవేశపెట్టారు?  


సాధారణం గా గుడిని నలుచదరం గా నిర్మించి, పైకప్పుని నలుచదరపు శంఖాకారం లో (శంకువు) నిర్మించి, గుడి మధ్యలో మూల విరాట్ ని ప్రతిష్ఠిస్తారు. ఒకవేళ 'స్వయంభువే' అయితే, మూలవిరాట్ చుట్టూ సమాన దూరం లో నలుచదరం గా గోడలు కట్టి, పైన కప్పుని శంఖాకారం లో కడతారు.  


శివాలయాల్లో తప్ప, వైష్ణవాలయాల్లో గర్భగుడి ప్రవేశం భక్తులకి నిషిధ్ధం. అంతేకాదు స్వామివారి ముందు ప్రమిదల్లో ఆముదం దీపాలుతప్ప మిగతా వెలుగులు నిషిధ్ధం.  


అయినా, గుడి ప్రవేశద్వారం కాక మిగిలిన మూడుపక్కలా చిన్న చిన్న రంధ్రాలు పెట్టేవారు--యెంతో కొంత వెలుగు స్వామివారిని చేరాలని--అంతేకానీ ప్రదక్షిణలు చేసేవారు తొంగిచూడడానికి కాదు!  


ఇక శివాలయాల్లో దర్శనమో అభిషేకమో అయ్యాక, బయటికి వస్తూ, నంది కొమ్ముల మధ్యనించి లింగదర్శనం చేస్తే పునర్జన్మ వుండదు అని ఓ నమ్మకం! (శ్రీశైలం లో క్రింద వున్న నంది కొమ్ముల మధ్య నించి శిఖరం చూడగలిగితే, పునర్జన్మ వుండదు--అంటారు.)  


మరి, ప్రదక్షిణాలు పూర్తి చెయ్యగానే, నంది ముఖమ్మీద కుంకం, పృష్ట భాగం మీద అరటిపళ్ళూ మెత్తేసి, స్థూల శరీరాలతో కూర్చొనో, పడుకొనో కొమ్ముల మధ్యనించి లింగాన్ని దర్శించడానికి అపసోపాలు పడడం యెవరు నేర్పించారు?  


మరిప్పుడు, ఆంజనేయస్వామి గుళ్ళోకి గానీ, సాయిబాబా గుళ్ళోకిగానీ ప్రవేశించగానే, ఒకటి నించి నూట యెనిమిది అంకెలు ముద్రించి వున్న చీటీ చేతికిచ్చి, గుడిలోపల విగ్రహం చుట్టు ఒక్కో ప్రదక్షిణా అయిపోగానే, ఒక్కొక్క అంకే కొట్టేసుకొని, మరిచిపోకుండా 108 ప్రదక్షిణాలు పూర్తిచేస్తే, ఆంజనేయస్వామి గుడి అయితే వెంటనే పెళ్ళి అవుతుందనీ, సాయిబాబా అయితే, మంచి మొగుడొస్తాడనీ, ఆడపిల్లలకి చెపుతున్నవారెవరు?  


ఇవన్నీ యెందుకు?



3 comments:

పునర్వసు said...

కృష్ణ శ్రీ గారూ,
మీరు వ్రాసిన విషయాలు చాలా ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.
వాటిగురించి నాకు తోచినవి వ్రాస్తున్నాను.
మాయ బజారు సినిమాలో ఘటోజ్గజుని పాత్ర , "ఎవరూ పుట్టించక పొతే మాటలెలా పుడతాయి" అన్నట్లు, ఎవరో ఎప్పుడో క్రొత్త సాంప్రదాయాలు, ఆచారాలు మెదలేడుతూనే ఉంటారు. ఎవరూ అని వెదకితే ఫలానా అని సమాదానం దొరకక పోవచ్చు.

దొరకని సమాధానాలను వేదికేకంటే, ఉన్న ఆచారాల మంచి చెడ్డలు విశ్లేసిస్తే, ఎవరికీ కావలసినది వారు గ్రహిస్తారు.

ఆచారాలు అంటే నాకొక కథ గుర్తొస్తుంది.
ఒక సాధువు కార్తిక స్నానానికని సముద్రానికి వెళతాడు. దూరంగా కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు.
తన చేతిలోని కమండలాన్ని, ఒడ్డునే ఉంచి స్నానానికి వెళితే పిల్లలు ఎత్తుకపోతరేమోనని, ఆ కమండలం చుట్టూ ఇసుకను శివ లింగం లాగా చేసి, స్నానానికి వెళతాడు. అదంతా దూరం నుంచి కొంతమంది పెద్దవాళ్ళు చూస్తారు.
ఇలా చేయడం ఆచారమేమో నని వాళ్ళంతా తలా ఒక లింగం చేస్తారు. అది చూసి ఇంకొందరూ. ఆ సాధువు స్నానం చేసి వచ్చే సరికి అన్నీలింగాలే. ఆ లింగాల్లో తన లింగం ఏదో తనకు తెలియలా!

పై కథ లోలా ఆచారం పుట్టినప్పటి ఉద్దేశం కాలక్రమేణా మరగున పడిపోవచ్చు. తెలివిగలవారు తమ తమ తరాల్లో కొత్త కొత్త ఆచారాలు మొదలు పెట్టనూవచ్చు. మానవుని పరిణామక్రమంలొ అది సహజమే.
ఆచారాలన్నీ దేశ కాల పరిస్థితులను బట్టి పుడుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. దేవుని పూజించడానికి, భజించడానికి ఒక నిర్దుష్ట పద్దతంటూ ఏమి లేదు. కన్నప్ప భక్తీ భక్తే, రామదాసు భక్తీ భక్తే. ఏదైనా ఒకటే అన్నప్పుడు, ఎవడికి తోచినట్లు వాడు చేసేకంటే, ప్రతిఒక్కడూ ఒక కొత్త పద్దతి మెదలేట్టే బదులు, ఉన్న పద్దతులలోనే తనకు నచ్చిన దానిని ఆచరించడం ఉత్తమం.
మాయాబజారులో కృష్ణ పాత్రధారి " రసపట్టులో తర్కం కూడదు " అన్నట్లు, భక్తిలో తాదాత్య్మం చెందడం ముఖ్యం. పద్దతి ముఖ్యం కాదు. అలాని అందరికి ఇబ్బంది కలిగించేటట్లు, ప్రవర్తించడం సరికాదు.

A K Sastry said...

డియర్ పునర్వసు!

చాలా సంతోషం!

నేను వ్రాస్తున్నది కూడా మూలాలు వెదకమని కాదు--ఆలోచించమనే! నిజానికి అవన్నీ ఆచారాలు, సాంప్రదాయాలు కాదు--వేలం వెఱ్ఱులే అని!

కొంతమందైనా ఆలోచించి, ఇలాంటివి మానేస్తే, మిగిలినవాళ్ళుకూడా క్రమం గా మానేస్తారేమో అని నా ఆశ!

ధన్యవాదాలు!

పరశు రామ్ said...

ilanti chetha hindu aacharaalu,nammakalu enduku raastharu sir....waati gurinchi alochinchalchina avasaram ledu...."HINUISM IS THE SOUL OF INEQUALITY"