Sunday, March 14, 2010

నా ఇంకో కొండె.....

వెంకట 'మరణ'

మేము వుద్యోగాల్లో చేరిన కొత్తల్లో, విజయవాడ లో వుండే రోజుల్లో, మా స్నేహితుల్లో వెంకట రమణ అని వుండే వాడు. (చనువు పెరిగాక వాడినే 'మరణా' అని యేడిపించేవాళ్ళం).

వాళ్ళ తండ్రిగారు అప్పటికే రిటైర్ అయ్యారు. పెద్ద కుటుంబం--వాడితో పాటు యేడుగురు అన్నదమ్ములూ, ఇద్దరో ముగ్గురో అక్క చెల్లెళ్ళూ. వీడు రెండో వాడనుకుంటా. వాళ్ళన్నయ్యకో చిన్న వుద్యోగం.

మంచి సరదాగా వుండేవాడు. యెవరేమన్నా యేడిచేవాడు కాదు. తనమీద తనే జోక్స్ వేసుకొని నవ్వించి, నవ్వేవాడు.

వీడు ఆంధ్రా బ్యాంకులో పని చేసేవాడు. కొత్తల్లో వాణ్ణేడిపించడానికి 'యెలావుంది మీ 'అంధేరా' బ్యాంకు?" అనడిగితే, "అంధేరా అనకండి సార్! 'ఆంధ్రా బంకు' అనండి కావాలంటే!" అనేవాడు.

"సరే, మీ బంకు యెలావుంది" అంటే, "మాది బంకు అయితే, మీది కూడా బంకే కదా? మీ బంకు యెలా వుందో మా బంకూ అలాగే వుంది!" అని చంకలు గుద్దుకొనేవాడు!

కులానికి శూద్రులైనా, చక్కటి సంస్కారం వుండేది వాళ్ళ కుటుంబం లో అందరికీ. మా స్నేహితుల్లో యెవరైనా 'వెధవా' లాంటి తిట్లు తిట్టినా, బూతులు మాట్లాడినా, నవ్వుతూ 'బూతులు మాట్లాడకండిరా--తప్పు!' అనేవాడు. 

వాళ్ళ కుటుంబంలో యెవరికైనా ఇంకెవరిమీదైనా కోపం వస్తే, 'నీకివాళ బాగా ఆకలెయ్యా!' అనో, 'అమ్మ నిన్ను బాగా తిట్టా!' అనో, 'దారిలో నిన్ను చీమ కుట్టా!' అనో, 'సాయంత్రం దోమ నిన్ను బాగా కుట్టా!' అనో, ఇంకా బాగా కోపం వస్తే, 'దారిలో నీ కాలికి యెదురుదెబ్బ తగలా!' అనో తిట్టుకొనేవారట!

మొదట్లో, ఓ ఇంట్లో వీధి కొట్టుగది (7 X 5 అడుగులు) లో అద్దెకు చేరాడు--అద్దె నెలకి ఇరవై రూపాయలు! 

(ఆ యింటివాళ్ళు వెన్న వ్యాపారం చేసేవారు--అంతకు ముందు ఆ గదిని వెన్న డబ్బాలు వుంచడానికే వాడుకొనే వారు). 

దానికి కిటికీలుగానీ, వెంటిలేటర్లు గానీ వుండేవి కాదు. యేడడుగులు వెడల్పులోనే గోడ మధ్యలో ఆ గదికి ద్వారం. 

ద్వారానికి యెడం పక్క (దక్షిణం వేపు) ఓ ట్రంకు పెట్టె, దానిమిద ఓ గాలి దిండు, దుప్పటి వుండేవి. ఓ మూల చాప వుండేది. దానికి వ్యతిరేక దిశలో, వుత్తరం వైపు తన పుస్తకాల అట్ట పెట్టె! 

(వాడో పుస్తకాల పురుగు! ఇంకేమీ చదవడానికి లేకపోతే, డిక్షనరీ చదివేవాడు! అలాగే బ్యాంకు పరీక్షలు ప్యాసు అయ్యాడు మా అందరికన్నా ముందుగా!)

పగలైతే, గదిలో నిలువుగా చాప వేసుకొని,  అడ్డంగా పడమరవైపు తలపెట్టుకొని, గుమ్మం లోంచి కాళ్ళు బయట పెట్టుకొని పడుకొనేవాడు. రాత్రి, నిలువుగా దక్షిణ వుత్తరాలుగా పడుకొనేవాడు.

భోజనం తప్ప, టిఫిన్, టీ, కాఫీ, వక్కపొడి--ఇలాంటివన్నీ నిషిధ్ధం. మేము స్వేచ్చగా మా జీతాలు ఖర్చుపెట్టుకొని, పైవాటితో పాటు సిగరెట్లు, సినిమాలు కూడా అలవాటు చేసుకొని ఆనందిస్తుంటే, వాడు 'యెందుకురా చెడిపోతారు?' అని బాధపడేవాడు.

ఓ పదినెలలు వుద్యోగం చేసి, జీతం లో కొంత నిలువచేసుకోగలగ గానే, కొత్త 'రూమ్' (ఓ ఫర్నిచరు వర్క్ షాపు వాళ్ళ రేకుల షెడ్) లోకి మారి పోయాడు--నెలకి 50 రూపాయల అద్దెకి. ఆ షెడ్ లో ఒకగది, వసారా వుండేవి. 

ఆ గదికి వుండే అడ్వాంటేజ్ యేమిటంటే, ప్రఖ్యాత ఫంక్షన్ హాల్స్ రెండుమూడు వుండేవి చుట్టుపక్కల. (ఆ అడ్వాంటేజ్ యేమిటో తరవాత చెపుతాను.)

అప్పటికి అకడమిక్ ఇయర్ అయిపోయి, మళ్ళీ కొత్త ఇయర్ మొదలవగానే, వాళ్ళ తమ్ముళ్ళనందరినీ తనదగ్గరకి రప్పించేసుకొని, స్కూళ్ళలో చేర్పించేశాడు. (వాళ్ళ పెద్దతమ్ముడు అప్పటికే డిగ్రీ అయిపోయి, వుద్యోగ ప్రయత్నాల్లో వుండేవాడు.  తరవాత రైల్వే లో మంచి వుద్యోగం వచ్చింది--ఈ పాటికి యే జనరల్ మేనేజరో అయిపోయి వుంటాడు)

............తరువాయి మరోటపాలో!

   

2 comments:

నాగప్రసాద్ said...

బాగుంది.

A K Sastry said...

డియర్ నాగప్రసాద్!

సంతోషం.

ధన్యవాదాలు.