Thursday, February 24, 2011

ఆంగ్ల సంవత్సరాది - 6



......వచ్చిన 2011

5. కార్లూ, బైకులూ ఇంకెన్ని లక్షలు అమ్ముడుపోతాయి? వాటిని "ఆంఫిబియన్లో" అవేవోగా మార్చడానికి రీసెర్చ్ మొదలవుతుందా? కాస్త బాగా కనిపిస్తున్న కొన్ని "రోడ్లని" ఫోటోలూ, వీడియోలూ తీసుకొని, భద్రపరచుకుంటున్నారా--మీ వారసులకి "రోడ్లు అనీ....ఇదివరకు....ఇలా వుండేవన్నమాట...." అని చెప్పడానికి?

జ : గత యేడాదిగా, మారుతీయే లక్ష కార్లు అమ్మిందట. టాటా, హ్యుండై, షెవర్లే, ఫియెట్ వగైరాలు యెన్ని లక్షలు అమ్మారో! ఇక బైక్లు కూడా కొన్ని వందల లక్షలైనా అమ్ముడయ్యి వుంటాయికదా? అమెరికాలోలా కొత్తకారు కొన్నవాళ్లు పాతకార్లని "కన్‌డెమ్న్" చేయించరు. అవికూడా రోడ్లమీద తిరుగుతూనే వున్నాయి......నలభై యేళ్ల క్రితపు "ప్రీమియర్ పద్మినీ" లతో సహా!

వాటిని ప్రస్తుతానికి ఆంఫిబియన్లలా చెయ్యడం అనేది కుదరని పని. అందుకని, "ట్యూబ్ లెస్ టైర్లూ" "సెల్ఫ్ హీలింగ్ ట్యూబులూ" వగైరాలని మాత్రమే ప్రవేశ పెట్టారిప్పటివరకూ!

మన రోడ్ల స్థితిగురించి ఈ క్రింది టపా చదవండి.
  

నిన్న (23-02-2011) ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ లోకూడా రోడ్లకి ప్రత్యేక కేటాయింపులేమీ లేవు. 

అందుచేత, ఫోటోలూ, వీడియోలూ ఇంకా తీయించి పెట్టుకోకపోతే, ఇప్పటికైనా ఆ పని చెయ్యండి. లేకపోతే మీ వారసులు చాలా ఙ్ఞానాన్ని కోల్పోతారు!

అన్నట్టు, "బాగా లోతుగా" పడ్డ గోతులని, దీర్ఘచతుస్రాకారంగా కొంచెం వెడల్పు చేసి, వాటిలో పెద్ద నల్లకంకర రాళ్లని నింపి, దానిమీద తారుపోసేసి, వాటిపై యెండు వరిగడ్డి పరిచేస్తారు! ఆ ఫిల్లింగులు రోడ్డుకి కనీసం అంగుళమున్నర యెత్తులో వుంటాయి. ఆ గడ్డి పూర్తిగా తారునించి విడివడేసరికి, ఫిల్లింగులు రోడ్డు యెత్తుకి అణిగిపోతాయి అని థీరీ! (అప్పటివరకూ భారీ వాహనాలు కొంచెం సునాయాసంగానూ, చిన్న వాహనాలు బడాబడామంటూ యెగిరిపడుతూనూ ప్రయాణించవలసిందే!)

నల్లటి తారురోడ్డుమీద గడ్డితోకూడిన ఫిల్లింగుల ఫోటోలు కూడా తీసి జాగ్రత్తపెట్టుకోండి--మన రిపేరు విఙ్ఞానానికి తార్కాణంగా!

మరిచిపోవద్దు మరి. 

Wednesday, February 23, 2011

ఆంగ్ల సంవత్సరాది - 5 (తరువాయి-2)



ఇన్సులేటెడ్ వ్యాన్లు

టాటావాళ్లూ, ప్యాజ్జియో వగైరాలూ లారీలకన్నా చిన్నవైన పెద్ద వ్యాన్లూ, ఇంకా చిన్న పికప్ ట్రక్కులూ--టన్నులకొద్దీ బరువుని 100 కి మీ మించిన వేగంతో చక్కగా చేరవేయగలిగేవీ, మనరోడ్లని తట్టుకోగలిగేవీ--తయారు చేస్తున్నాయి.

నరసాపురం లాంటి చోటినుంచి సరుకుని హైదరాబాదులో దించేసి, అక్కడ మళ్లీ సరుకు యెక్కించుకొని, సాయంత్రానికల్లా బయలుదేరిన వూరు చేరగలుగుతున్నారు!

అలాంటి వ్యాన్లని "ఇన్సులేటెడ్ వ్యాన్లుగా" మారిస్తే? అద్భుతంగా వుండదూ?

ఇప్పటికే, చేపలూ వగైరా ఇలా రవాణా చేస్తున్నారు. 

అసలు, వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, రహదారి, నీటిమార్గ రవాణాదారులు, హోల్సేల్ వ్యాపారస్థులు, రిటెయిల్ వ్యాపారస్తులు, గ్రామీణ వృత్తి పనివారు--ఇవీ నిర్వచించబడ్డ ప్రాథాన్యతా రంగం అంటే.

మొన్నీమధ్య రిజర్వ్ బ్యాంక్ మొత్తుకున్నట్టు, బ్యాంకులు తమ ఋణ రంగాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. తమ ప్రాథాన్యతా రంగ ఋణ కోటాలని మించే ఇస్తున్నామని ప్రజల మొహాన వెల్ల వేస్తున్నాయి. ముఖ్యంగా గత ఇరవై యేళ్లుగా యే బ్యాంకూ ప్రథాన్యతా రంగంలోని యెవరికీ ఒక్కటంటే ఒక్క క్రొత్త ఋణం మంజూరు చేసింది లేదు! వ్యవసాయం తో సహా, అన్నీ "రెన్యువల్సే" (అంటే సాలువారీ పునరుధ్ధరణలు!). నిజంగా అవి ఋణాలు మంజూరు చేసి వుంటే, ఈనాటి గ్రామీణ భారతం అమెరికాని తలదన్నేది!

ప్రభుత్వం, "గోదాములు నిర్మింపచెయ్యడం కంటే", ఈ చిన్న వ్యానులకి "ఇన్సులేటెడ్ బాడీ" కట్టించుకోడానికి బ్యాంకు ఋణాలు యేర్పాటు చెయ్యచ్చు. అది ప్రాథాన్యతా రంగంలోకి వస్తుంది. ఇంకా, బాడీ బిల్డింగ్ కి 100% ఫైనాన్స్ చెయ్యచ్చు బ్యాంకులు. నిజానికి మార్కెట్లలో సరుకులు కొని, వాటిని రవాణాచేసి, కొంచెం లాభానికి అమ్ముకునేవాళ్లెవరూ కోటీశ్వరులు కారు. అసలు దోచుకొనే "దళారులు" వేరు! వీళ్లు కాదు. వీళ్లకి వలసిన సహాయాలు అందిస్తే, ద్రవ్యోల్బణం వగైరా అనేక రుగ్మతలని అరికట్టవచ్చు!

వుదాహరణకి, గడ్డి అన్నారం లోనో యెక్కడో, టమాటాలు కేజీ పది పైసలకి కూడా కొనకపోతే, వాటిని పశువులకి మేపీ, రోడ్లప్రక్కన పారబోసీ వెనుదిరుగుతారు రైతులు. జిల్లాలలో, గ్రామాల్లో, అదేరోజుని కేజీ 4 రూపాయలకి తక్కువకి కొనలేరు! ఇలాంటి వ్యానులు వుంటే, ఆ వ్యాపారులు కేజీ పదిపైసలకే కొనేసి, వ్యానులు నింపుకొని, మధ్య్హ్నానికల్లా జిల్లా కేంద్రాలకీ, సాయంత్రానికల్లా గ్రామాలకీ చేరితే? అక్కడ కేజీ రూపాయికి అమ్మినా, వాళ్లకి ఇబ్బడి ముబ్బడి లాభాలూ, ప్రజలకి బోళ్లు వూరటా! ఇంకోరోజో, రెండురోజులో సరుకంతా అమ్ముడుకాకపోయినా, చెడిపోతుందన్న బాధలేదు!

గ్రామీణ భారతం అభివృధ్ధి చెందుతోంది--కానీ సరైన గణాంకాలు లేవు! మొన్నటిదాకా పూటకి ఠికాణాలేనివాళ్లు ఇప్పుడు మూడేసి, నాలుగేసి ట్రాక్టర్లకి యజమానులై (అవి థర్డ్ హేండ్ వో, ఫోర్థ్ హేండ్ వో అయినా సరే) మట్టీ, ఇసుకా, ఇతరాలూ రవాణా చేసి, బాగానే సంపాదించుకొంటున్నారు! ఇలాంటివాళ్లకి ఆర్థిక సహాయం చెయ్యడమే బ్యాంకుల కర్తవ్యం!
  
.......మరోసారి.

Sunday, February 20, 2011

ఆంగ్ల సంవత్సరాది - 5 (తరువాయి)



ఇన్సులేటెడ్ వ్యాన్లు

సింగపూర్ లాంటి దేశాల్లో, భవన నిర్మాణానికి ఇసుకా, కంకర, సిమెంటు కూడా ఇన్సులేటెడ్ (ఏ సీ-క్లోజ్డ్) వ్యానుల్లో మాత్రమే తరలిస్తారట--రోడ్డుమీద దుమ్ము యెక్కడా పడకుండా! పడితే తెలుసుగా, కొన్ని వందల డాలర్లలో జరిమానాలు.

మరిన్ని గోదాములు నిర్మించబడి, వుపయోగం లోకి వచ్చేవరకూ "ఆహార భద్రత" విషయంలో యేమీ చెయ్యలేమని కుండ బద్దలుకొట్టారట మన కేంద్ర మంత్రి.

వెనకటికి మన రాష్ట్ర ప్రభుత్వం వుల్లిపాయలు నిలువ చేయడానికి గోదాములు లేవంటే, అఘమేఘాలమీద బోళ్లన్ని కట్టించేసిందట. కానీ, వాటిల్లో "వుల్లిపాయలు పట్టేంత" అరలు మాత్రమే నిర్మించడంవల్లా, మరేమీ నిలువ చేయడానికి సదుపాయాలు లేకపోవడం వల్లా, ఇప్పుడు వుల్లిపాయల స్టాక్ లేకపోవడంవల్లా, అవన్ని ఖాళీగా శిధిలమైపోతున్నాయట!

మన ప్రభుత్వాల జబ్బేమిటో అందరికీ తెలుసు--మన రానాలూ, వాళ్లకి తందానా అనే బుర్రోవాదులూ!

నాలాంటివాళ్లు, మనకన్నా చిన్న చిన్న దేశాలవాళ్లు పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తున్నారు, జపాన్, చైనా లాంటి దేశాలు వందల్లో సాధిస్తున్నాయి, ఇన్ని కోట్ల జనాభా వున్న మనదేశానిదేమి దౌర్భాగ్యం? అని విమర్శిస్తూంటే, కొన్నేళ్ల క్రిందట, "ప్రతీ జిల్లా కేంద్రం లోనూ ఓ స్టేడియం నిర్మిస్తాం" అని నిర్మింపచేసేశారు! 

నిర్మించాక, ఇన్నేళ్లలో, యేవో ఒకటో రెండో దేశవాళీ క్రీడా పోటీలు నిర్వహించారేమో. అవికూడా టిక్కెట్టు కొని చూసినవాళ్లు ఓ వెయ్యిమంది లోపు వుంటారేమో! ఓ టైములో బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు దానితోసహా అన్ని స్టేడియాలూ శిధిలమై, ఇటుకలూ, కాంక్రీటు అచ్చులూ దొంగిలించబడుతున్నాయి! వాటివల్ల క్రీడాభివృధ్ధి యేమి జరిగిందోగానీ, వాటి మేనేజర్లూ, కోచ్ లూ కొంత బాగుపడ్డారు. (రానాలూ, గుత్తేదారులూ మొ.వాళ్ల తరవాతే లెండి).

ఇప్పుడు, మళ్లీ, ప్రతీ మండల కేంద్రంలో "క్రీడా భవనాలు" నిర్మిస్తారట. ఇంక వాటివల్ల యేమి వొరుగుతుందో మరి!

మొన్నీమధ్యనే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్లు గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలవడం, కోటీశ్వరులు మాత్రమే ఆ నిబంధనలని ఆచరించగలరు కాబట్టి, వాళ్లే టెండర్లు వెయ్యడం జరిగింది. తరవాత, బుర్రోవాదులు--గోదాము నించీ "మీ స్వంత భూముల్లో", దగ్గరి "రైల్వే పాయింటు" వరకూ, "స్వంత ఖర్చుతో" రైల్వే లైను నిర్మించుకొనే సామర్ధ్యం వున్నవాళ్లే అర్హులు--అనడంతో, కాంగీ పార్టీ గుత్తేదార్లతోసహా అందరూ, "మమతాదీ తో మేము పెట్టుకోలేము" అని విరమించుకున్నారు! (అంటే, "ఆ మధ్యలో" సొంత భూముల్లేవుకాబట్టి అవి కొనుక్కున్నా, స్వంత ఖర్చుతో లైను వేయించుకున్నా, 'ఆవిడ ' అనుమతి ఇస్తుందని నమ్మకాల్లేవన్నమాట!)

ఎఫ్ సీ ఐ వాళ్ల నాటకాల గురించి చెప్పనే అఖ్ఖర్లేదు. వాళ్లు ధాన్యం కొనాలంటే, గోదాములు ఖాళీ వుండవు. మిల్లర్లు "బియ్యం యెగుమతికి అనుమతి ఇస్తేనే కొంటాం" అంటారు. జేపీ తో సహా కొంతమంది, "అమెరికాలో బియ్యం బోళ్లు రేటు పలుకుతోంది. మనం ఇప్పుడు యెగుమతి చేస్తే, అక్కడివాళ్లకి తక్కువరేటుకి దొరుకుతాయి, మనకి విదేశీ మారకద్రవ్యం, మిల్లర్లకి లాభాలూ, రైతులకి గిట్టుబాటు ధరా, ఎఫ్ సీ ఐ సమస్య తీరడం--ఇన్ని లాభాలు" అంటున్నారు. కానీ, ఈ అనుమతి ఇస్తే, "తనకు మాలిన ధర్మం" లాగా మనందరం మళ్లీ కిలో 50 రూపాయలకి కొనుక్కోవాలి అన్న మాట చెప్పడంలేదు!

అవీ మన "నిర్మాణాల" సంగతులు. 

సరే, పిడకలవేట మానేసి, ఇన్సులేటెడ్ వ్యాన్ల దగ్గరకి వద్దాం.

.......మరోసారి.

Wednesday, February 16, 2011

ఆంగ్ల సంవత్సరాది - 5



......వచ్చిన 2011

4. కూరగాయలు కొనాలంటే మీరు యెంత దూరం వెళ్తారు? యెంత పట్టుకెళ్తారు? బ్యాంకులు వీటికోసం అప్పులు ఇస్తాయా? వుల్లిదోశ మానేసి ప్లెయిన్ దోశ తింటే, మీరు ఆదా చెయ్యగలిగేదెంత?

జ : మళ్లీ మే, జూన్ ల వరకూ యెంతో దూరం వెళ్లవలసిన అవసరం రాదు--మీదగ్గరకే వస్తాయి, ప్రతీ రోడ్డు ప్రక్కనీ రాశులు పోసి అమ్ముతారు! తక్కువరేట్లకే కావలసినన్ని కొనేసుకోవచ్చు. బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఆ అవసరం రాదు. వుల్లి దోశలూ, కూరగాయల సలాడ్లూ, పిండివంటలూ అన్నీ తినొచ్చు.

యెందుకంటే, మనదేశం లో జనాల మనస్తత్వం ప్రకారం, ప్రక్కవాడు పదిరూపాయలు యెలా సంపాదిస్తే, అందరూ అదేపని చేస్తారు--యెవరికీ గిట్టుబాటు కాకుండా పోయే వరకూ! అందరూ అన్నిరకాల కూరలూ పండిస్తారు.....వాతావరణం కూడా అనుకూలంగా వుంటుంది; విపత్తులు వుండవు; దిగుబడులు బాగుంటాయి!

మన ప్రభుత్వాలు కూడా, ప్రజలు దాహం వేస్తోంది అంటూంటే, అప్పుడు తవ్వడం మొదలుపెట్టిన నూతులు, ఇప్పటికి పూర్తవుతాయి--దిగుమతులు కూడా ప్రారంభం అవుతాయి!

యెటొచ్చీ మార్కెట్ల పరిస్థితే దిగజారుతూ వుంటుంది. అమ్ముకోలేక, పశువులకి పెట్టెయ్యడం, రోడ్ల ప్రక్కన పారబొయ్యడం వరకూ వస్తుంది.   

ఆ రెండునెలలూ, ఆ తరవాత నవంబరు, డిశెంబరులూ కథ మళ్లీ మామూలే! అప్పటి సంగతి ఇప్పుడే ఆలోచించే వాళ్లెవరైనా వున్నారంటారా? వీటికి పరిష్కారం లేదా?

ఖచ్చితంగా వుంది. 

మొదటిది--దొరికినప్పుడే కొనేసుకొని, వొరుగులు పెట్టేసుకోవడం ఓ పధ్ధతి. పత్రికల్లో ఆ విధానాలు వ్రాస్తున్నారు. చదివి ఆచరించండి. పచ్చళ్లూ, వూరగాయలూ పెట్టేసుకోండి.

రెండోది--తక్కువ ఖర్చుతో, కూరగాయల్ని ముఖ్య మార్కెట్లనుంచి వినియోగదారులకి తరలించగలగడం. దానికి కావలసింది పక్కా ప్రణాళికతోపాటు, నిజాయితీగల బుర్ర వున్న అధికారులు. 

రవాణా చెయ్యవలసింది--"ఇన్సులేటెడ్ వ్యాన్ల" ద్వారా. 

అదెలా అంటే.......

.......మరోసారి.