Sunday, February 20, 2011

ఆంగ్ల సంవత్సరాది - 5 (తరువాయి)ఇన్సులేటెడ్ వ్యాన్లు

సింగపూర్ లాంటి దేశాల్లో, భవన నిర్మాణానికి ఇసుకా, కంకర, సిమెంటు కూడా ఇన్సులేటెడ్ (ఏ సీ-క్లోజ్డ్) వ్యానుల్లో మాత్రమే తరలిస్తారట--రోడ్డుమీద దుమ్ము యెక్కడా పడకుండా! పడితే తెలుసుగా, కొన్ని వందల డాలర్లలో జరిమానాలు.

మరిన్ని గోదాములు నిర్మించబడి, వుపయోగం లోకి వచ్చేవరకూ "ఆహార భద్రత" విషయంలో యేమీ చెయ్యలేమని కుండ బద్దలుకొట్టారట మన కేంద్ర మంత్రి.

వెనకటికి మన రాష్ట్ర ప్రభుత్వం వుల్లిపాయలు నిలువ చేయడానికి గోదాములు లేవంటే, అఘమేఘాలమీద బోళ్లన్ని కట్టించేసిందట. కానీ, వాటిల్లో "వుల్లిపాయలు పట్టేంత" అరలు మాత్రమే నిర్మించడంవల్లా, మరేమీ నిలువ చేయడానికి సదుపాయాలు లేకపోవడం వల్లా, ఇప్పుడు వుల్లిపాయల స్టాక్ లేకపోవడంవల్లా, అవన్ని ఖాళీగా శిధిలమైపోతున్నాయట!

మన ప్రభుత్వాల జబ్బేమిటో అందరికీ తెలుసు--మన రానాలూ, వాళ్లకి తందానా అనే బుర్రోవాదులూ!

నాలాంటివాళ్లు, మనకన్నా చిన్న చిన్న దేశాలవాళ్లు పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తున్నారు, జపాన్, చైనా లాంటి దేశాలు వందల్లో సాధిస్తున్నాయి, ఇన్ని కోట్ల జనాభా వున్న మనదేశానిదేమి దౌర్భాగ్యం? అని విమర్శిస్తూంటే, కొన్నేళ్ల క్రిందట, "ప్రతీ జిల్లా కేంద్రం లోనూ ఓ స్టేడియం నిర్మిస్తాం" అని నిర్మింపచేసేశారు! 

నిర్మించాక, ఇన్నేళ్లలో, యేవో ఒకటో రెండో దేశవాళీ క్రీడా పోటీలు నిర్వహించారేమో. అవికూడా టిక్కెట్టు కొని చూసినవాళ్లు ఓ వెయ్యిమంది లోపు వుంటారేమో! ఓ టైములో బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు దానితోసహా అన్ని స్టేడియాలూ శిధిలమై, ఇటుకలూ, కాంక్రీటు అచ్చులూ దొంగిలించబడుతున్నాయి! వాటివల్ల క్రీడాభివృధ్ధి యేమి జరిగిందోగానీ, వాటి మేనేజర్లూ, కోచ్ లూ కొంత బాగుపడ్డారు. (రానాలూ, గుత్తేదారులూ మొ.వాళ్ల తరవాతే లెండి).

ఇప్పుడు, మళ్లీ, ప్రతీ మండల కేంద్రంలో "క్రీడా భవనాలు" నిర్మిస్తారట. ఇంక వాటివల్ల యేమి వొరుగుతుందో మరి!

మొన్నీమధ్యనే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్లు గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలవడం, కోటీశ్వరులు మాత్రమే ఆ నిబంధనలని ఆచరించగలరు కాబట్టి, వాళ్లే టెండర్లు వెయ్యడం జరిగింది. తరవాత, బుర్రోవాదులు--గోదాము నించీ "మీ స్వంత భూముల్లో", దగ్గరి "రైల్వే పాయింటు" వరకూ, "స్వంత ఖర్చుతో" రైల్వే లైను నిర్మించుకొనే సామర్ధ్యం వున్నవాళ్లే అర్హులు--అనడంతో, కాంగీ పార్టీ గుత్తేదార్లతోసహా అందరూ, "మమతాదీ తో మేము పెట్టుకోలేము" అని విరమించుకున్నారు! (అంటే, "ఆ మధ్యలో" సొంత భూముల్లేవుకాబట్టి అవి కొనుక్కున్నా, స్వంత ఖర్చుతో లైను వేయించుకున్నా, 'ఆవిడ ' అనుమతి ఇస్తుందని నమ్మకాల్లేవన్నమాట!)

ఎఫ్ సీ ఐ వాళ్ల నాటకాల గురించి చెప్పనే అఖ్ఖర్లేదు. వాళ్లు ధాన్యం కొనాలంటే, గోదాములు ఖాళీ వుండవు. మిల్లర్లు "బియ్యం యెగుమతికి అనుమతి ఇస్తేనే కొంటాం" అంటారు. జేపీ తో సహా కొంతమంది, "అమెరికాలో బియ్యం బోళ్లు రేటు పలుకుతోంది. మనం ఇప్పుడు యెగుమతి చేస్తే, అక్కడివాళ్లకి తక్కువరేటుకి దొరుకుతాయి, మనకి విదేశీ మారకద్రవ్యం, మిల్లర్లకి లాభాలూ, రైతులకి గిట్టుబాటు ధరా, ఎఫ్ సీ ఐ సమస్య తీరడం--ఇన్ని లాభాలు" అంటున్నారు. కానీ, ఈ అనుమతి ఇస్తే, "తనకు మాలిన ధర్మం" లాగా మనందరం మళ్లీ కిలో 50 రూపాయలకి కొనుక్కోవాలి అన్న మాట చెప్పడంలేదు!

అవీ మన "నిర్మాణాల" సంగతులు. 

సరే, పిడకలవేట మానేసి, ఇన్సులేటెడ్ వ్యాన్ల దగ్గరకి వద్దాం.

.......మరోసారి.

No comments: