ఇన్సులేటెడ్ వ్యాన్లు
టాటావాళ్లూ, ప్యాజ్జియో వగైరాలూ లారీలకన్నా చిన్నవైన పెద్ద వ్యాన్లూ, ఇంకా చిన్న పికప్ ట్రక్కులూ--టన్నులకొద్దీ బరువుని 100 కి మీ మించిన వేగంతో చక్కగా చేరవేయగలిగేవీ, మనరోడ్లని తట్టుకోగలిగేవీ--తయారు చేస్తున్నాయి.
నరసాపురం లాంటి చోటినుంచి సరుకుని హైదరాబాదులో దించేసి, అక్కడ మళ్లీ సరుకు యెక్కించుకొని, సాయంత్రానికల్లా బయలుదేరిన వూరు చేరగలుగుతున్నారు!
అలాంటి వ్యాన్లని "ఇన్సులేటెడ్ వ్యాన్లుగా" మారిస్తే? అద్భుతంగా వుండదూ?
ఇప్పటికే, చేపలూ వగైరా ఇలా రవాణా చేస్తున్నారు.
అసలు, వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, రహదారి, నీటిమార్గ రవాణాదారులు, హోల్సేల్ వ్యాపారస్థులు, రిటెయిల్ వ్యాపారస్తులు, గ్రామీణ వృత్తి పనివారు--ఇవీ నిర్వచించబడ్డ ప్రాథాన్యతా రంగం అంటే.
మొన్నీమధ్య రిజర్వ్ బ్యాంక్ మొత్తుకున్నట్టు, బ్యాంకులు తమ ఋణ రంగాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. తమ ప్రాథాన్యతా రంగ ఋణ కోటాలని మించే ఇస్తున్నామని ప్రజల మొహాన వెల్ల వేస్తున్నాయి. ముఖ్యంగా గత ఇరవై యేళ్లుగా యే బ్యాంకూ ప్రథాన్యతా రంగంలోని యెవరికీ ఒక్కటంటే ఒక్క క్రొత్త ఋణం మంజూరు చేసింది లేదు! వ్యవసాయం తో సహా, అన్నీ "రెన్యువల్సే" (అంటే సాలువారీ పునరుధ్ధరణలు!). నిజంగా అవి ఋణాలు మంజూరు చేసి వుంటే, ఈనాటి గ్రామీణ భారతం అమెరికాని తలదన్నేది!
ప్రభుత్వం, "గోదాములు నిర్మింపచెయ్యడం కంటే", ఈ చిన్న వ్యానులకి "ఇన్సులేటెడ్ బాడీ" కట్టించుకోడానికి బ్యాంకు ఋణాలు యేర్పాటు చెయ్యచ్చు. అది ప్రాథాన్యతా రంగంలోకి వస్తుంది. ఇంకా, బాడీ బిల్డింగ్ కి 100% ఫైనాన్స్ చెయ్యచ్చు బ్యాంకులు. నిజానికి మార్కెట్లలో సరుకులు కొని, వాటిని రవాణాచేసి, కొంచెం లాభానికి అమ్ముకునేవాళ్లెవరూ కోటీశ్వరులు కారు. అసలు దోచుకొనే "దళారులు" వేరు! వీళ్లు కాదు. వీళ్లకి వలసిన సహాయాలు అందిస్తే, ద్రవ్యోల్బణం వగైరా అనేక రుగ్మతలని అరికట్టవచ్చు!
వుదాహరణకి, గడ్డి అన్నారం లోనో యెక్కడో, టమాటాలు కేజీ పది పైసలకి కూడా కొనకపోతే, వాటిని పశువులకి మేపీ, రోడ్లప్రక్కన పారబోసీ వెనుదిరుగుతారు రైతులు. జిల్లాలలో, గ్రామాల్లో, అదేరోజుని కేజీ 4 రూపాయలకి తక్కువకి కొనలేరు! ఇలాంటి వ్యానులు వుంటే, ఆ వ్యాపారులు కేజీ పదిపైసలకే కొనేసి, వ్యానులు నింపుకొని, మధ్య్హ్నానికల్లా జిల్లా కేంద్రాలకీ, సాయంత్రానికల్లా గ్రామాలకీ చేరితే? అక్కడ కేజీ రూపాయికి అమ్మినా, వాళ్లకి ఇబ్బడి ముబ్బడి లాభాలూ, ప్రజలకి బోళ్లు వూరటా! ఇంకోరోజో, రెండురోజులో సరుకంతా అమ్ముడుకాకపోయినా, చెడిపోతుందన్న బాధలేదు!
గ్రామీణ భారతం అభివృధ్ధి చెందుతోంది--కానీ సరైన గణాంకాలు లేవు! మొన్నటిదాకా పూటకి ఠికాణాలేనివాళ్లు ఇప్పుడు మూడేసి, నాలుగేసి ట్రాక్టర్లకి యజమానులై (అవి థర్డ్ హేండ్ వో, ఫోర్థ్ హేండ్ వో అయినా సరే) మట్టీ, ఇసుకా, ఇతరాలూ రవాణా చేసి, బాగానే సంపాదించుకొంటున్నారు! ఇలాంటివాళ్లకి ఆర్థిక సహాయం చెయ్యడమే బ్యాంకుల కర్తవ్యం!
.......మరోసారి.
2 comments:
మంచి ఆలోచన. ప్రభుత్వముకన్నా, స్థానికులకి ఈ ఆలోచన చేర్చితే కొంచెం పెట్టుబడితో వారే మార్చుకోగలరేమో.
డియర్ జేబి - JB!
చాలా రోజుల తరవాత.....మీ వ్యాఖ్యకి సంతోషం.
ఆ టెక్నాలజీ కొంచెం కష్టతరమైనది. స్థానికులదాకా రావాలంటే ఇంకో 5-10 యేళ్లు పట్టచ్చు! అందుకనే ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తే బాగుంటుందన్నది.
ఓ ఇరవై యేళ్లక్రితం కార్లూ, ఆటోల పెట్రోలు ఇంజన్లని వంటగ్యాస్ తో కూడా నడిచే విధంగా మార్పు చేసే పరిఙ్ఞానం వచ్చింది. అది ఇప్పటికి (ఓ పదేళ్ల క్రితానికి) కంపెనీల రేటుకన్నా తక్కువకి, ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడా పర్ఫెక్ట్ గా పని చేసేలా చెయ్యగలిగారు. అలాగే ఇదీను. చూద్దాం.
ధన్యవాదాలు.
Post a Comment