Thursday, February 24, 2011

ఆంగ్ల సంవత్సరాది - 6



......వచ్చిన 2011

5. కార్లూ, బైకులూ ఇంకెన్ని లక్షలు అమ్ముడుపోతాయి? వాటిని "ఆంఫిబియన్లో" అవేవోగా మార్చడానికి రీసెర్చ్ మొదలవుతుందా? కాస్త బాగా కనిపిస్తున్న కొన్ని "రోడ్లని" ఫోటోలూ, వీడియోలూ తీసుకొని, భద్రపరచుకుంటున్నారా--మీ వారసులకి "రోడ్లు అనీ....ఇదివరకు....ఇలా వుండేవన్నమాట...." అని చెప్పడానికి?

జ : గత యేడాదిగా, మారుతీయే లక్ష కార్లు అమ్మిందట. టాటా, హ్యుండై, షెవర్లే, ఫియెట్ వగైరాలు యెన్ని లక్షలు అమ్మారో! ఇక బైక్లు కూడా కొన్ని వందల లక్షలైనా అమ్ముడయ్యి వుంటాయికదా? అమెరికాలోలా కొత్తకారు కొన్నవాళ్లు పాతకార్లని "కన్‌డెమ్న్" చేయించరు. అవికూడా రోడ్లమీద తిరుగుతూనే వున్నాయి......నలభై యేళ్ల క్రితపు "ప్రీమియర్ పద్మినీ" లతో సహా!

వాటిని ప్రస్తుతానికి ఆంఫిబియన్లలా చెయ్యడం అనేది కుదరని పని. అందుకని, "ట్యూబ్ లెస్ టైర్లూ" "సెల్ఫ్ హీలింగ్ ట్యూబులూ" వగైరాలని మాత్రమే ప్రవేశ పెట్టారిప్పటివరకూ!

మన రోడ్ల స్థితిగురించి ఈ క్రింది టపా చదవండి.
  

నిన్న (23-02-2011) ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ లోకూడా రోడ్లకి ప్రత్యేక కేటాయింపులేమీ లేవు. 

అందుచేత, ఫోటోలూ, వీడియోలూ ఇంకా తీయించి పెట్టుకోకపోతే, ఇప్పటికైనా ఆ పని చెయ్యండి. లేకపోతే మీ వారసులు చాలా ఙ్ఞానాన్ని కోల్పోతారు!

అన్నట్టు, "బాగా లోతుగా" పడ్డ గోతులని, దీర్ఘచతుస్రాకారంగా కొంచెం వెడల్పు చేసి, వాటిలో పెద్ద నల్లకంకర రాళ్లని నింపి, దానిమీద తారుపోసేసి, వాటిపై యెండు వరిగడ్డి పరిచేస్తారు! ఆ ఫిల్లింగులు రోడ్డుకి కనీసం అంగుళమున్నర యెత్తులో వుంటాయి. ఆ గడ్డి పూర్తిగా తారునించి విడివడేసరికి, ఫిల్లింగులు రోడ్డు యెత్తుకి అణిగిపోతాయి అని థీరీ! (అప్పటివరకూ భారీ వాహనాలు కొంచెం సునాయాసంగానూ, చిన్న వాహనాలు బడాబడామంటూ యెగిరిపడుతూనూ ప్రయాణించవలసిందే!)

నల్లటి తారురోడ్డుమీద గడ్డితోకూడిన ఫిల్లింగుల ఫోటోలు కూడా తీసి జాగ్రత్తపెట్టుకోండి--మన రిపేరు విఙ్ఞానానికి తార్కాణంగా!

మరిచిపోవద్దు మరి. 

No comments: