……పక్షవా(పా)తం
దాదాపు ఓ దశాబ్దంగా “పిల్” లూ, “జ్యుడిషియల్ ఏక్టివిజం” లాంటి మాటలు తరచూ వినబడుతున్నాయి. మీడియాలోకూడా చర్చలు జరుగుతున్నాయి. కొంతవరకూ బాగానే వుంది.
రానురానూ, పిల్ దాఖలు అవగానే, లేదా, మీడియాలోనో యెక్కడో ఒకవిషయం రేగగానే, న్యాయమూర్తులు వాటిని, కొండొకచో, సువో మోటో గా స్వీకరించడం, తరవాత ప్రథాన న్యాయమూర్తి అనుమతి లేకుండా స్వీకరించారని వారు ఆగ్రహించడం లాంటివి కూడా జరుగుతున్నాయి.
కానీ, కొందరు న్యాయమూర్తులు, తమ “ప్రిజుడిస్” అనే జాడ్యాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. అందుకే అన్నా జనలోక్ పాల్ పరిధిలోకి జ్యుడీషియరీని కూడా తీసుకురావాలంటున్నది.
ఇప్పుడు, “తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి” అన్నట్టు, ఓ జోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేశాం, ఇంక ఆ విషయంలో మహాఘనతవహించిన పార్లమెంటు సభ్యులు యే నిర్ణయం తీసుకొంటే అదే అమలు జరగాలి, ఇంకెవరైనా, యేదైనా మాట్లాడితే…..ఖబడ్దార్! అంటున్నారు.
ఆయనే వుంటే మంగలాడెందుకన్నట్టు, మన ఎంపీలు సరైనవాళ్లయితే ఈ తిప్పలన్నీ యెందుకు? ములుగర్రతో పొడుస్తేగానీ వాళ్ల మందమైన చర్మాలు స్పందించడం లేదాయే!
మహాఘనతవహించిన లల్లూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, వీరప్పమొయిలీ, పిచ్చిదంబరం, కపిల్సిబల్, లాంటివాళ్లు ఆ బిల్లుని గట్టెక్కకుండా తమ మోకాళ్లూ, మెదళ్లూ శాయశక్తులా వొడ్డుతున్నారు. పైగా, దానికి అష్టావకృడి రూపం ఇవ్వడానికి, సభ్యుల్లో రిజర్వేషన్లూ, అపాయింట్మెంట్ కమిటీల్లో రిజర్వేషన్లూ, మాజీ ఎంపీల మీద చర్యలూ అంటూ వూదరగొడుతున్నారు.
ఇదీ బాగానే వుంది.
కానీ, ముంబాయిలో నిరాహారదీక్ష చేపట్టడానికి అనుమతికోరితే, ఓ పదో పాతికో లక్షలు చెల్లిస్తేగానీ అనుమతి ఇవ్వం అనడమేమిటీ, దానికోసం కోర్టుకి వెళితే, ఆ న్యాయ కొక్కులు, రాజకీయ కొక్కులకి మద్దతు ఇస్తున్నట్టుగా వేళాకోళం మాటలు మాట్లాడడం యేమిటి? అనుమతి ఇస్తారా లేదా అన్నది ప్రక్కనపెట్టి (ఇంతకీ అనుమతిచ్చేది ఆ కోర్టు కాదు!), అనుమతి ఇస్తే, పార్లమెంటు హక్కులకి భంగం కాదా? చేసుకొంటే మీ ఇళ్లలో, పెరళ్లలో ఆందోళన చేసుకోండి. గాంధీగారు కూడా ఇలాంటి ఆందోళనలు చేశారో లేదో మాకు తెలియదు! అంటూ తమ పక్షవా(పా)తాన్ని (దాంతో కూడిన అజ్ఙానాన్ని) ప్రకటించుకోవడం యేమిటి?
రాజకీయ కొక్కులకి న్యాయ కొక్కులు మద్దతు ప్రకటిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం యేమి కావాలి?
ఆలోచించండి మరి!
No comments:
Post a Comment