Wednesday, January 11, 2012

భక్తిలో కూడా కొత్తదనం కోసం.......



......వెంపర్లాడుతున్న వీ పీ లు

భక్తిలోనూ, దేవుళ్లలోనూ, పూజల్లోనూ పాత వాటితో విసుగొస్తోందనుకుంటా--యెప్పుడూ విననివి పుట్టుకొస్తున్నాయి. పేపర్లపుణ్యమా అని వ్యాపిస్తున్నాయి.

తలుపులమ్మ గుళ్లలో కూడా "తిరుప్పావై" పఠనాలేమిటి అని, మనకి "అరవ దాస్యం" యెందుకు అని ఇదివరకో టపా వ్రాశాను.

అదేదో సినిమాలో, బ్రహ్మానందానికి వీ పీ (వెరయిటీ పిచ్చోడు) అంటూ వెరయిటీ గా సన్మానం చేయిస్తాడు ఎల్ బీ శ్రీరామ్--చాపమీద కూచోపెట్టి, చిటికెలతో! అలా తయారవుతున్నారేమో మన "తెలుగు" భక్తులు అనిపిస్తూంది. 

ధనుర్మాసంలో, 27వ రోజు అదేదో "కూడారై" వుత్సవంట! అన్ని గుళ్లలోనూ చేసేస్తున్నారు. ఒకచోట 108 "గంగాళాల్లో" "కూడారై" వండి నైవేద్యం పెట్టారట. ఇంకో చోట కొన్ని వందల గంగాళాల్లో వండి, వాడిని "కూడారై" అనే తెలుగు అక్షరాల ఆకారంలో పేర్చి, ఇంకా కొన్ని వందల గంగాళాల్లో వివిధ ఆకృతుల్లో పేర్చి, నైవేద్యం పెట్టారట. (స్థానిక ఎమ్మెల్యే అక్కడ "తగిన" యేర్పాట్లు చేశాడట. రా నా లని ఇలాంటి చోట్లకి  రానివ్వకుండా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, "పంచెలూడేలా" తంతే బాగుండును!) 

కూడారై అంటే, భక్తుడు పరమాత్మలో లీనమవడానికి చేసే ప్రయత్నం అంటాడొకడు. ఆ ప్రసాదాన్ని "అక్కార్ వడిశెల్" అన్నాడింకోడు! 

ఈ వుత్సవాల్లో "అవకతవకలు" జరిగాయని, ఏలూరులో ఓ గుళ్లో అర్చకులకి "ఛార్జ్ మెమో" లు ఇవ్వాలని నిర్ణయించారుటకూడా--ఆ కమిటీ వారు!

ఇంకా, అయ్యప్ప భక్తుల్లో, ఇదివరకెప్పుడూ వినని "వేట తుళ్లు" కార్యక్రమం; "మాలికా"నో, "మల్లికా"నో "పురోత్తమ" ప్రతిష్టాపనలు కూడా చేస్తున్నారట! ఆవిడెవరో, యెవరికి భార్యో, యెవరికి తల్లో తెలీదు! (యెర్ర బట్టల "అమ్మవారి దీక్ష" గురించి ఇంకో బ్లాగులో వ్రాశాను--చదివారా?)

కానివ్వండి! వెరయిటీకెప్పుడు ఆహ్వానమేగా మనం!

No comments: