.......తెలుగు
మన తెలుగు భాష గురించి మాట్లాడితే, అనేక తెలుగు పదాలని చాలా మంది మరిచిపోయారు అనీ, ఇప్పటివాళ్లకి అవేవో గ్రీక్ & లాటిన్ లా ధ్వనిస్తున్నాయనీ చెప్పాలి.
“కుర్సీ” అనేది హిందీలోంచి వచ్చింది. (కిస్సా కుర్సీ కా అనే సినిమా ఇందిరాగాంధీ ని మూడు చెరువుల నీళ్లుతాగిస్తే, ఆ నిర్మాతని ఆవిడ ఆరు చెరువుల నీళ్లు తాగించింది!). ఆ పదాన్ని మన తెలుగులో “కుర్చీ పీట” గా ప్రవేశపెట్టారు! క్రింద కూర్చోడానికి వేసుకునేవి పీటలు. ఇవి కుర్చీ పీటలు. ఇప్పుడందరూ వాటిని కుర్చీలు అనే అనేస్తున్నారనుకోండి.
ఇంకా, “ముక్కాలి పీటలు” వుండేవి. తలంట్లు పోసుకోడానికీ, చదువుకొనేటప్పుడు లాంతర్లు పెట్టుకోడానికీ వగైరాలకోసం వాడే వారు. గుండ్రని చెక్కకి మూడు కోళ్లు బిగించేవారు. అందుకనే అవి “ముక్కాలి” పీటలు.
కూర్చునే “బెంచీ” లు వుంటాయి కదా? బెంచ్ అనేది ఆంగ్ల పదం. దానికి తెలుగులో “కవాచీ బల్ల” అని ఓ పదం వుండేది. దానిమీద “రెడ్డికం” వేసుకొని కూచోడం, ఇంకెవరైనా వస్తే వాళ్లని ప్రక్కన కూర్చోమంటూ “రెడ్డికం తో సహా” ప్రక్కకి జరగడం—శ్రీపాదవారి పుస్తకాల్లో చదువుతాం.
పెద్దలు—“ముందు నాలుగువేళ్లూ నోట్లోకి పోయే విధానం చూసుకోరా!” అనేవారు. తృప్తిగా భోజనం చేస్తే, కుడిచేతి బొటనవేలు మినహా, మిగిలిన నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి! బయట హోటళ్లలోనూ అక్కడా సరే. బొటనవేలూ, చూపుడు, మధ్య వేళ్లతో కలుపుకొని, కెక్కిరిస్తూ తినేస్తారు—స్పూన్లూ అవీ వాడకుండా తినేవాళ్లు. అక్కడ “ఎటికెట్”లూ, “టేబుల్ మేనర్సూ” వుంటాయి. మరి, ఇంట్లో శుభ్భరంగా తినేప్పుడు ఈ నాజూకులెందుకు? యెవరైనా అలా తింటే వెంటనే కూకలేస్తాను నేను. మన తెలుగు పధ్ధతులు మరిచి పోవద్దని!
మన తెలుగు వాళ్లింకా “మార్జాలం” అంటే “బిడాలం” అనే అనువాదాల్లోంచి బయట పడడం లేదు. మా చదువుల్లో గణిత శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలూ వగైరాలు చదువుకున్నాం. అవన్నీ తెలుగులోనే చక్కగా అందరికీ అర్థమయ్యేలా “పైథాగరస్ సిధ్ధాంతం” (ఆయన్ని “పిథోగోరాస్” అనాలట!), “ప్లవన సూత్రాలూ”, “ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయుట” లాటి పాఠాలు వుండేవి. ఇప్పుడు చూద్దుమా—తెలుగు మీడియం విద్యార్థుల సౌకర్యం కోసం పండితులు సూచిస్తున్న పాఠాల్లో ప్రశ్నలు—అర్థం అవడం సంగతి తరవాత—అసలు కొరుకుడు పడడమే లేదు! మరింకేమి చదువులో!
మన తెలుగు వాళ్లకో పెద్ద జబ్బుంది. యెవరినైనా పేరు అడగండి—పీ ఎస్ రావ్ అనో, కే టీ శర్మ అనో, డీ వీ ఎస్ వర్మ అనో--ఇలా చెపుతారు! పూర్తి పేరు చెప్పాలంటే నామోషీ కాదుగానీ, “అంత అవసరమా?” అనే ఫీలింగు! ఇంక చిరునామా చెప్పమంటే నూటికి 99 మంది యేమాత్రమూ సరిగ్గా చెప్పరు! అదేం దౌర్భాగ్యమో! దానికి తగ్గట్టు మనవాళ్ల ఇంటిపేర్లు చాలా చిత్రంగా వుంటాయి. అందుకని అసలు చెప్పరు.
మా ట్రెయినింగ్ కాలేజీలో వచ్చే ఉపాధ్యాయులని నేను వాళ్ల పూర్తి పేర్లు అడిగేవాణ్ని. నాకదో హాబీ. ప్రముఖుల ఇంటిపేర్లతోసహా పూర్తి పేర్లు సేకరిస్తూ వుంటాను. ఏ పీ జే అబ్దుల్ కలాం పూర్తి పేరు చాలామందికి తెలియక మునుపే నేను “అవుళ్ పకీర్ జైనుల్లా ఉద్దీన్ అబ్దుల్ కలాం” అని సేకరించాను. వ్రాశాను. (ఆయన ప్రమాణస్వీకారం చేస్తూ, “….జైనుల్లా అబ్దీన్…..” అని చేశాడు! సరే పోనీ అనుకున్నాను.
అలా, ఒక ఉపాధ్యాయుడిని క్లాసు అయిపోయి, యెవరికైనా యేమైనా “డౌట్స్” వున్నాయా అనడిగితే, నేను “మీ పూర్తి పేరు చెప్పండి సార్!” అని అడగడం, ఆయన చేతి మూడువేళ్లతో నుదుటిమీద పైనుంచి ముక్కుమీదకి వ్రాస్తున్నట్టు అభినయించి, “పంగనామాల గోవర్ధన రావు. నీకేమైనా అభ్యంతరమా?” అనడం, క్లాసులోవాళ్లంతా ఘొల్లుమనడం జరిగాయి. నాకేం అభ్యంతరం వుంటుంది మరి?
యేతావాతా చెప్పొచ్చేదేమిటంటే, తెలుగువాళ్లు తమ తెలుగు పేర్లనీ, ఇంటిపేర్లనీ, చిరునామానీ చెప్పుకోడానికి సిగ్గు పడఖ్ఖర్లేదు అని.
మీరేమంటారు?
2 comments:
ప్ర తె మ "Home" pageలో ప్రధాన సంఘాల సభ్యుల పట్టీ చూస్తే, సగానికిసగంమంది పేర్లు, ఒకటి-రెండు-మూడక్షరాల కుదింపులవే! ఈరోగమేవిటో మరి!!
--ఏ.వీ. రావు
డియర్ ఏ వీ రావుగారూ!
మన రెవెన్యూ బుర్రోవాదుల నుంచి వచ్చింది ఈ జాడ్యం. గొప్పగా "మహాత్మా గాంధీ రోడ్", "సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ రోడ్".....ఇలా పేర్లు పెట్టి, వాటిని "ఎం జీ రోడ్", "ఎస్ వీ పీ రోడ్" అనెయ్యడమే కాకుండా, వూళ్ల పేర్లని కూడా కత్తిరించేసి, "వై వీ లంక", "కేపీ పాలెం", "ఎల్బీ చర్ల"......ఇలా నాశనం చేసేశారు.
ఓ యాభై కోట్లు ఖర్చుపెడుతున్నాము కదా, దీంట్లోనైనా పొదుపు చేద్దాం అనే అలోచన కూడా వుండొచ్చు ఆ బుర్రల్లో!
ధన్యవాదాలు.
Post a Comment