Wednesday, August 12, 2015

దాన ధర్మాలు....

"అన్ని దానములలోకెల్ల....అన్నదానము గొప్ప"!

అవునండీ.....ఇది పెద్దలు చెప్పిన మాట. 

మరి ఓ తెల్లవాడన్నాట్ట....."చేపలు వండి వడ్డించడం కాదు--చేపలు పట్టుకోవడం నేర్పించు"....అని!

మరి యేది కరెక్టు? అంటే రెండూ కరెక్టే!

ఆకలితో వున్నవాడికి "అన్నదానం" చెయ్యాలి. అంతేగాని భూమి దున్నడం దగ్గర్నించీ నేర్పించడం మొదలెడితే, యెప్పటికి వాడి ఆకలి తీరేట్టు?

మరి, మూడుపూటలా వండి వడ్డించేసి, వాడికి ఆకలే తెలియకుండా ఛేస్తామంటే? అది అపాత్ర దానం. వాళ్లకి వళ్లు వంగేలాగ చెయ్యాలి.

అన్నదానం అంటే.....రంతిదేవుడూ, శిబి చక్రవర్తీ లాంటివాళ్లు చేసినవి! అంతేగానీ, ఇవాళ జరుగుతున్న నిత్యాన్నదానాలూ, నిరతాన్నదానాలూ వగైరాలు కాదు.

ఇదివరకు యేదైనా ఉత్సవాలో యేవో జరిగినప్పుడు, చివర్లో ఓరోజు పేదలకి అన్నదానం లేదా సంతర్పణ అని నిర్వహించేవారు. వచ్చినవాళ్లకి లేదనకుండా వడ్డించేవారు. 

ఇప్పుడో? ఆఖర్లో అన్నసమారాధన! భక్తుల అన్నప్రసాద స్వీకరణ!

ముందుగా ఆ చుట్టుప్రక్కలవాళ్లందరి దగ్గరా చందాలు దండడం, కిరాణా వాళ్ల దగ్గరా, బియ్యం కొట్ల వాళ్లదగ్గరా సరుకులూ, బియ్యం, కూరగాయల కొట్ల దగ్గర కూరలూ అన్నీ దండుకోవడం. ఆ రోజున ఇలా చందాలూ అవీ ఇచ్చినవాళ్లందరూ కుటుంబాలతో సహా వచ్చి మేసేసి వెళ్లడం!

ఇవీ ప్రస్తుత అన్నదానాలు. 

మొన్న ఒకాయన "అసలు ఊళ్లో కూలీలు దొరకడం లేదండీ" అని వాపోతుంటే, ఇంకొకాయన, "వారం లో యేడు రోజులూ ఫలానా వారం ఫలానా గుళ్లో, ఇంకో రోజు ఇంకో గుళ్లో.....ఇలా అన్నదానాలు చేస్తుంటే, కూలి డబ్బుల అవసరం యెవరికుందండీ"? అన్నాడు.

నిజంగా అంత ఆశ్చర్యకరంగానే వున్నట్టుంది పరిస్థితి!

యేంచేద్దాం?! పోనీయండి.

Wednesday, August 5, 2015

పత్రికలూ....కధనాలూ...

"జనం కంట...ఉల్లి మంట"

మొన్ననే నా "శాకాంబరాలూ....." టపాలో వ్రాశాను పేపర్లో కథనాల గురించి. 

ఇదిగో.....నిన్న (04-08-15) మా జిల్లా ఈనాడులో పై శీర్షికతో కథనం ప్రత్యక్షం!

దీంట్లో విచిత్రాలు గమనించండి.....!

".....కారణం మహారాష్ట్రలో కురిసిన వడగళ్ల వాన కారణంగా పంట చాలావరకూ దెబ్బతినడమే....." (వడగళ్ల వల్ల భూమిలో వుండే ఉల్లికి నష్టం వస్తుందా? వరదలైతే, నీళ్లు నిలబడిపోయి, పాయలు కుళ్లిపోతాయనుకోవచ్చు! పోనీ కోశాక అయినా విపరీత వర్షాలు వస్తే, సరుకు తడిసిపోయి పాడయిందనొచ్చు!)

"....ఈ వారం లో మరింత పెరిగే అవకాశాలున్నాయి అని వ్యాపార వర్గాలు అంటున్నాయి....."

"....హుబ్లీ, బెంగళూరు ప్రాంత ఉల్లి....తయారు కాలేదు....ఇంకా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది...."

(బెంగుళూరు "నగరం" ఉల్లిపంటకి ప్రసిధ్ధి అని వీరి కథనం. ఇప్పటికే ప్రతి రోజూ వర్షాలు కురుస్తున్నాయి కర్ణాటక అంతా. వచ్చే రెండు నెలలూ విపరీత వర్షాలు కురుస్తాయి! మరి అప్పటికి ఉల్లి పంట పూర్తిగా యెలా తయారు అవుతుందో?)

ఇంకా విచిత్రం--వీడెవడో కాంగ్రెస్ అభిమాని అయ్యుంటాడు-- 

"......ఏడేళ్ల కాలంగా ఉల్లి ధరను పరిశీలిస్తే, కిలో రూ. 6 ల నుంచి రూ. 7 ల మధ్యే వుండేది. అనంతరం ఏడాది కాలం లో ఇంతవరకు రూ. 12 లు తగ్గిన సందర్భం లేదు."

(వీడి "పరిశీలన" కి ఆధారాలేమిటో? గత యేడేళ్లుగా ఉల్లిపాయల మీద వచ్చిన కార్టూన్లు పరిశీలించినా, ఓ నాలుగేళ్ల క్రితం కిలో 120 దాకా యెగబడిందనీ, కేజ్రీవాల్ నెగ్గే ముందు కూడా 70 నుంచి 80 ఢిల్లీలోనే అమ్మిందనీ, గత సంవత్సరం, ముందు చూపుతో గవర్నమెంట్ దిగుమతులు చేసుకోబట్టి, కిలో 10 నుంచి 12 కే కట్టుబడి వుంది అనీ, పాత పేపర్లు తిరగేసినా స్పష్టం అయ్యేది వాడికి!)

ఇలాంటివండీ మన పేపర్ల పరిశీలనాత్మక కథనాలు!

Saturday, August 1, 2015

జాతీయ దుబారా....

"శాకాంబరాలు....."

జూన్ లో కాస్త వర్షాలు పడగానే, ఆకు కూరలూ, కాయగూరలూ కాస్త విరివిగా వచ్చి, రేట్లు తగ్గడం మొదలెడతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతోంది అని సంతోషిస్తారు ప్రజలూ, ప్రభుత్వాలూ. 

వాటితోపాటే, అంచనాలు మొదలెడతారు పత్రికలవాళ్లు.....ఫలానాచోట ఉల్లిపంట తగ్గిపోయింది, ఇంకోచోట టమాటా పంట నాశనం అయ్యింది, వాటికి కొరత యేర్పడే అవకాశం, ధరలు పెరిగే అవకాశం......అంటూ రోజుకో కథనం వ్రాసేస్తారు. 

దాంతో, మళ్లీ కూరగాయల ధరలు పెరిగిపోతాయి. 

అలా జూలై గడిచేసరికి మొదలవుతాయి దేవుళ్లకీ, అమ్మవార్లకీ "శాకాంబర" అలంకారాలు! కనక దుర్గతో మొదలెట్టి, పుంతలోముసలమ్మలవరకూ ....... ఒక్కోళ్లకీ 200 కేజీలనుంచి 5 టన్నులవరకూ! పేపరు తెరిస్తే, అన్ని గుళ్లలోనూ ఆ అలంకారాల ఫోటోలే! ఇన్ని కేజీలూ, అన్ని టన్నులూ అని కథనాలే!

భీమవరం లో మావుళ్లమ్మకి మొన్న 5 టన్నులతో అలంకరించారు! ఇంకో విశేషం......వాటిలో కొన్ని వందలకేజీలు ఉల్లిపాయలు వుండడం!

ఓ ప్రక్క బజార్లో ఉల్లిపాయలు కేజీ 60 రూపాయలకి తక్కువ కాకుండా అమ్ముతుంటే, పేపర్లు కేజీ 40 అని వ్రాస్తే, ప్రభుత్వం 20 కే రైతుబజార్లలో అందిస్తాం అంటూ, ఫలానా జిల్లాకి 200 టన్నులు పంపించాం, ఇంకో జిల్లాకి 100 టన్నులు పంపించాం, యెక్కడా కొరత రానివ్వం--ధరలు పెరగనివ్వం--అంటూ మంత్రుల ప్రకటనలూ!

ఇంకో విచిత్రం యేమిటంటే......ఆ అలంకారాలకి ఆధ్వర్యం వహించేది...... కూరగాయల వర్తక సంఘాలే! (బజార్లో కేజీ కి ఒక్క రూపాయి కూడా తగ్గించరు గానీ, భక్తిపేరుతో టన్నులు "ఉచితంగా" తగలేస్తారు! దీంట్లో యేమైనా కుట్ర కోణం వుందేమో యెవరైనా పరిశోధిస్తే బాగుండును!)

ఇంక దీన్ని అరికట్టే మార్గం......? 

సామాన్య జనం తరఫున ఆ గుడుల ధర్మకర్తలూ, పూజార్లూ, అర్చకులకి నా విజ్ఞప్తి...... "సోదరులారా! అలా అలంకరించడం మా వల్లకాదు అని ప్రకటించండి. ఇంకా, అడ్డమైనవాళ్లూ, ఈ అలంకారం పేరుతో, కొన్ని గంటలపాటు, ఆ విగ్రహాల పీఠాలనీ, గర్భ గుడినీ ఇష్టం వచ్చినట్టు తొక్కడం ఆ దేవీ దేవతలని అపవిత్రం చెయ్యడమే" అని ప్రకటించండి. 

అప్పుడైనా ఈ వేలం వెర్రి కాస్త తగ్గి, సామాన్యులకి మేలు జరుగుతుందేమో......!

ఆలోచించండి.....