"శాకాంబరాలు....."
జూన్ లో కాస్త వర్షాలు పడగానే, ఆకు కూరలూ, కాయగూరలూ కాస్త విరివిగా వచ్చి, రేట్లు తగ్గడం మొదలెడతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతోంది అని సంతోషిస్తారు ప్రజలూ, ప్రభుత్వాలూ.
వాటితోపాటే, అంచనాలు మొదలెడతారు పత్రికలవాళ్లు.....ఫలానాచోట ఉల్లిపంట తగ్గిపోయింది, ఇంకోచోట టమాటా పంట నాశనం అయ్యింది, వాటికి కొరత యేర్పడే అవకాశం, ధరలు పెరిగే అవకాశం......అంటూ రోజుకో కథనం వ్రాసేస్తారు.
దాంతో, మళ్లీ కూరగాయల ధరలు పెరిగిపోతాయి.
అలా జూలై గడిచేసరికి మొదలవుతాయి దేవుళ్లకీ, అమ్మవార్లకీ "శాకాంబర" అలంకారాలు! కనక దుర్గతో మొదలెట్టి, పుంతలోముసలమ్మలవరకూ ....... ఒక్కోళ్లకీ 200 కేజీలనుంచి 5 టన్నులవరకూ! పేపరు తెరిస్తే, అన్ని గుళ్లలోనూ ఆ అలంకారాల ఫోటోలే! ఇన్ని కేజీలూ, అన్ని టన్నులూ అని కథనాలే!
భీమవరం లో మావుళ్లమ్మకి మొన్న 5 టన్నులతో అలంకరించారు! ఇంకో విశేషం......వాటిలో కొన్ని వందలకేజీలు ఉల్లిపాయలు వుండడం!
ఓ ప్రక్క బజార్లో ఉల్లిపాయలు కేజీ 60 రూపాయలకి తక్కువ కాకుండా అమ్ముతుంటే, పేపర్లు కేజీ 40 అని వ్రాస్తే, ప్రభుత్వం 20 కే రైతుబజార్లలో అందిస్తాం అంటూ, ఫలానా జిల్లాకి 200 టన్నులు పంపించాం, ఇంకో జిల్లాకి 100 టన్నులు పంపించాం, యెక్కడా కొరత రానివ్వం--ధరలు పెరగనివ్వం--అంటూ మంత్రుల ప్రకటనలూ!
ఇంకో విచిత్రం యేమిటంటే......ఆ అలంకారాలకి ఆధ్వర్యం వహించేది...... కూరగాయల వర్తక సంఘాలే! (బజార్లో కేజీ కి ఒక్క రూపాయి కూడా తగ్గించరు గానీ, భక్తిపేరుతో టన్నులు "ఉచితంగా" తగలేస్తారు! దీంట్లో యేమైనా కుట్ర కోణం వుందేమో యెవరైనా పరిశోధిస్తే బాగుండును!)
ఇంక దీన్ని అరికట్టే మార్గం......?
సామాన్య జనం తరఫున ఆ గుడుల ధర్మకర్తలూ, పూజార్లూ, అర్చకులకి నా విజ్ఞప్తి...... "సోదరులారా! అలా అలంకరించడం మా వల్లకాదు అని ప్రకటించండి. ఇంకా, అడ్డమైనవాళ్లూ, ఈ అలంకారం పేరుతో, కొన్ని గంటలపాటు, ఆ విగ్రహాల పీఠాలనీ, గర్భ గుడినీ ఇష్టం వచ్చినట్టు తొక్కడం ఆ దేవీ దేవతలని అపవిత్రం చెయ్యడమే" అని ప్రకటించండి.
అప్పుడైనా ఈ వేలం వెర్రి కాస్త తగ్గి, సామాన్యులకి మేలు జరుగుతుందేమో......!
ఆలోచించండి.....
2 comments:
"SAAKAADAMBARAALU"
"జాతీయ దుబారా" అని మీరు పెట్టిన టైటిల్ అతికినట్టు సరిపోయింది. "క్రిమినల్ దుబారా" అని కూడా అంటాను నేను. "షో" ఎక్కువయిపోయి వెర్రితలలు వేస్తున్న కాలంలో ఉన్నాం మనం.
Post a Comment