Wednesday, August 12, 2015

దాన ధర్మాలు....

"అన్ని దానములలోకెల్ల....అన్నదానము గొప్ప"!

అవునండీ.....ఇది పెద్దలు చెప్పిన మాట. 

మరి ఓ తెల్లవాడన్నాట్ట....."చేపలు వండి వడ్డించడం కాదు--చేపలు పట్టుకోవడం నేర్పించు"....అని!

మరి యేది కరెక్టు? అంటే రెండూ కరెక్టే!

ఆకలితో వున్నవాడికి "అన్నదానం" చెయ్యాలి. అంతేగాని భూమి దున్నడం దగ్గర్నించీ నేర్పించడం మొదలెడితే, యెప్పటికి వాడి ఆకలి తీరేట్టు?

మరి, మూడుపూటలా వండి వడ్డించేసి, వాడికి ఆకలే తెలియకుండా ఛేస్తామంటే? అది అపాత్ర దానం. వాళ్లకి వళ్లు వంగేలాగ చెయ్యాలి.

అన్నదానం అంటే.....రంతిదేవుడూ, శిబి చక్రవర్తీ లాంటివాళ్లు చేసినవి! అంతేగానీ, ఇవాళ జరుగుతున్న నిత్యాన్నదానాలూ, నిరతాన్నదానాలూ వగైరాలు కాదు.

ఇదివరకు యేదైనా ఉత్సవాలో యేవో జరిగినప్పుడు, చివర్లో ఓరోజు పేదలకి అన్నదానం లేదా సంతర్పణ అని నిర్వహించేవారు. వచ్చినవాళ్లకి లేదనకుండా వడ్డించేవారు. 

ఇప్పుడో? ఆఖర్లో అన్నసమారాధన! భక్తుల అన్నప్రసాద స్వీకరణ!

ముందుగా ఆ చుట్టుప్రక్కలవాళ్లందరి దగ్గరా చందాలు దండడం, కిరాణా వాళ్ల దగ్గరా, బియ్యం కొట్ల వాళ్లదగ్గరా సరుకులూ, బియ్యం, కూరగాయల కొట్ల దగ్గర కూరలూ అన్నీ దండుకోవడం. ఆ రోజున ఇలా చందాలూ అవీ ఇచ్చినవాళ్లందరూ కుటుంబాలతో సహా వచ్చి మేసేసి వెళ్లడం!

ఇవీ ప్రస్తుత అన్నదానాలు. 

మొన్న ఒకాయన "అసలు ఊళ్లో కూలీలు దొరకడం లేదండీ" అని వాపోతుంటే, ఇంకొకాయన, "వారం లో యేడు రోజులూ ఫలానా వారం ఫలానా గుళ్లో, ఇంకో రోజు ఇంకో గుళ్లో.....ఇలా అన్నదానాలు చేస్తుంటే, కూలి డబ్బుల అవసరం యెవరికుందండీ"? అన్నాడు.

నిజంగా అంత ఆశ్చర్యకరంగానే వున్నట్టుంది పరిస్థితి!

యేంచేద్దాం?! పోనీయండి.

No comments: