బ్యాంకులకి మన రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం కొన్ని నిర్దేశాలు చేస్తూ వుంటుంది—బ్యాంకులిచ్చే ఋణాల్లో ఖచ్చితంగా ఇంత శాతం వ్యవసాయానికీ, ఇంత శాతం యెగుమతులకీ, చిన్నతరహా పరిశ్రమలూ, రవాణా, చిల్లర వ్యాపారాలకీ, గృహ , విద్యా, స్వయం ఉపాధి లాంటి ప్రాధాన్యతా రంగాలకీ—ఇలా ఇవ్వాలి!
మిగిలినదే తన ఇష్టం వచ్చినట్లు—వ్యక్తిగత ఋణాలూ, వాహన కొనుగోలు ఋణాలూ ఇలాంటి ఋణాలు ఇచ్చుకోవచ్చు!
ప్రతీ బ్యాంకూ, లెఖ్ఖల ప్రకారం నిర్దేశిత శాతం (ప్రస్తుతం తమ మొత్తం డిపాజిట్లలో ఒక శాతం) వ్యవసాయ, వ్యవసాయాధారిత ఋణాలు మంజూరు చేస్తూనే వుంటాయి.
మరి నగరాల్లో తప్ప ఒక్క గ్రామం లోనూ ఒక్క శాఖా లేని ఐ సీ ఐ సీ ఐ బ్యాంకు లాంటి బ్యాంకులు తమ వ్యవసాయ ఋణాల్లో నిర్దేశిత లక్ష్యాలని యెలా చేరుకొంటున్నాయి? అని మన జాతీయ బ్యాంకుల యాజమాన్యాలు తలలు బద్దలు కొట్టుకున్న రోజులు వున్నాయి!
నిజంగా ఇదొక చిన్న ఠస్సా! (ట్రిక్!)
నగరాల్లో పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజీలు కట్టించడం—కూరగాయల దగ్గర నించీ, మాంసం, చేపలూ, ఆకు కూరలూ, పువ్వుల వరకూ నిలవ చెయ్యడానికి—వాటికి ఋణాలు ఇవ్వడం! (కొన్ని వందల కోట్లు వీటికి ఇచ్చెయ్యవచ్చు)
ఇవి కాకుండా, గ్రామాల్లో ఒక యేజంటునో, యేజన్సీనో నియమించి, ఒక సభ జరిపించి, ఋణ పత్రాలమీద రైతుల సంతకాలు తీసుకొని, అక్కడికక్కడే పంట ఋణాలు పంపిణీ చేసెయ్యడం! (ఒక్క రోజులోనే కొన్ని వందల గ్రామాల్లో ఇంకొన్ని వందల కోట్లు ఇలా ఇచ్చెయ్యవచ్చు!)
మామూలుగా బ్యాంకులు గానీ, సహకార బ్యాంకులు గానీ, వ్యవసాయ పరపతి సంఘాలుగానీ, ఇప్పుడు—అంటే ఈ పంటకి ఇచ్చిన ఋణాలని పంట రాగానే తిరిగి చెల్లించమంటాయి.
మళ్ళీ రెండో పంటకి అప్పు ఇవ్వాలిగా? అందుకని మీరు ఇవాళ కట్టెయ్యండి, మళ్ళీ రేపు తీసుకోండి! అంటాయి. ఇలా నూరు శాతం వసూళ్ళు చూపించుకొని, నూరు శాతం మళ్ళీ అప్పులిచ్చినట్టు చూపిస్తూ వుంటాయి!
ఇక కొత్త ఋణాలంటారా! వ్యవసాయ యోగ్యం కాని భూమి వ్యవసాయ యోగ్యం అయితేనేకదా—కొత్త ఋణాల ప్రసక్తి? (ఇలాంటి కేసులు చాలా తక్కువ.) లేక పోతే భూమి అదే—యజమాని మాత్రమే మారతాడు! అంతే!
ఇలాంటి పరిస్థితుల్లోనే ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పంట ఋణాల ‘స్కాము’ల్లాంటివి జరుగుతున్నాయి!
(మిగతా మరోసారి)
No comments:
Post a Comment