Sunday, February 22, 2009

తెలుగులోనే మాట్లాడదాం!

క్రితం సంవత్సరం ఆగష్టు 15న బెంగుళూరులో (అప్పుడే అది బెంగళూరు గా మారింది) జెండావందన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూస్తూ వుంటే, అది అయిపోయాక పోలీసు క్రీడలు, సాహాసాలూ ప్రదర్శిస్తూంటే, మోటారు సైకిల్ మీద ఓ పోలీసు ఓ గోడని చేదించుకుంటూ రెండో వైపుకి వస్తే, వ్యాఖ్యాత దాన్ని వాళ్ళ భాషలో ‘గోడె గుద్దాట’ అని వర్ణిస్తూంటే, నాకు బల్బు వెలిగింది! మనం తెలుగే యెందుకు మాట్లాడలేక పోతున్నాం? ఆని! మనం తెలుగు మాట్లాడాలంటే, ముందు ‘మన సంస్కృతం’ వచ్చేస్తుంది—యెంతటివాడికైనా! నాకు తెలిసిన సంస్కృతం చాలా కొంచెం! మా అన్నయ్య హై స్కూల్ లో చదివేటప్పుడు, తన రెండవ భాషగా ‘స్కోరింగ్ సబ్జెక్ట్' సంస్కృతం తీసుకొని, శబ్దాలూ అవీ బట్టీ పడుతుంటే, వాళ్ళ స్వబోధినిలో చదివాను— “కాకః కృష్ణః; పికః కృష్ణః—కో భేదః పిక కాకయోః? వసంతకాలే సంప్రాప్తే, కాకః కాకః; పికః పికః!” అని! అదొక్కటే తెలుసు నాకు సంస్కృతంలో! మరి ‘మన సంస్కృతం’ యేమిటి అంటారా? అదేనండీ—‘నీయమ్మ’ ‘నీయక్క’ ‘నీయబ్బ’ ఇలాంటి మాటలు లేకుండా యెవరైనా తెలుగు మాట్లాడగలరా? కన్నడ వాడిలా ‘గుద్దాట’ అన గలమా? అవసరంలేనిచోట, మాటల్ని ‘బూతులుగా’ అవసరం అయినచోట ‘బూతుల్ని’ మాటలుగా ఉపయోగించడం తెలుగువాడి స్పెషాలిటీ! మా తెలుగు మేష్టారు చెప్పినట్టు, ‘ఆ బస్సు ఆగుద్దా? యేగుద్దా?’ అని అడిగే వాళ్ళకి, మనం ‘అలా కాదురా! ఆగుతుందా, యేగుతుందా అని అడగాలి’ అని నేర్పించడానికి ప్రయత్నిస్తాము! అంతేగానీ, వాడు వాడింది ‘బూతు’ కాదు అని సరిపెట్టుకోలేం! అయినా ఈ బూతులూ, ఊతపదాలూ మన భాషలోనే వున్నాయా, ఇతర భాషల్లో లేవా? మరి వాళ్ళు మాతృభాష నిర్భయంగా మాట్లాడుతుంటే, మనకీ ఖర్మ యేమిటీ? అలోచించండి!

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

కృష్ణశ్రీ గారు, మీ టపా చదివేదాకా నాకు అసలు ఆ అలోచనే రాలేదు , నేను కండక్టర్ ని చాలాసార్లు "ఈ బస్సు ఆగుద్దా " అని అడిగిన సందర్భాలు ఎన్నో!!!... ఏమైనా టపా బాగుంది.

A K Sastry said...

డియర్ భాస్కర రామి రెడ్డీ!

అంటే మీరూ ఆ కర్ణాటక వ్యాఖ్యాత లాగ, సిగ్గుపడకుండా మామూలు మనుషులు మాట్లాడే తెలుగు భాషని మాట్లాడగలరనేగా? అంటే యెప్పుడూ తెలుగులోనే మాట్లాడతారు!

మరి అవరోధం యెక్కడ? సోకాల్డు తెలుగు పండితులూ, మీడియానే కదా?

ధన్యవాదాలు!