Thursday, July 9, 2009

సూడో.....

హేతువాదులు!
మా ఫ్రెండు ఒకతను వుండేవాడు—ఇప్పుడూ వుండే వుంటాడు—అంటే, మాకు బాగా తెలిసిన మా వూరి అమ్మాయిని, (పెద్దలు కుదిర్చిన సంబంధమే) పెళ్ళి చేసుకొని, మాకు ఫ్రెండు అయ్యాడ—‘వటకాళేశ్వరుడు‘ అని!
వాళ్ళ పెళ్ళి యెలా జరిగిందనుకున్నారు?—విజయవాడలో నాస్తిక కేంద్రం లో, డాక్టరు సమరం గారూ, ఇతర నాస్తికుల, హేతువాదుల సమక్షం లో, కూరగాయల దండలు మార్చుకొని!
వాళ్ళది యేలూరు దగ్గర యేదో వూరు—అక్కడ ఓ వట వృక్షం క్రింద ఓ శివలింగం ‘కాళేశ్వరుడు’ పేర వుండేదట! (వట వృక్షం అంటే రావి చెట్టేనా?!) అందుకని అతనికి ‘వటకాళేశ్వరుడు’ అని పేరు పెట్టారట! క్లాసు పిల్లలు, ‘ఒరే వటా!’ అనో, ‘ఒరే వట్టా!’ అనో పిలిచేవారు(ట)! పెద్దవాళ్ళైతే, ‘ఒరే వట్టూ’ అనేవారట! ‘నేను చిన్నప్పటినించీ నాస్తికుణ్ణి, హేతువాదిని! అందుకని నన్నెవరెలా పిలిచినా, నాకేమీ వూడదుగా!’ అనేవాడు!
సరే, పెళ్ళయ్యాక, ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళాక (అతని వుద్యోగం యేలూరు లో కాబట్టి, ఓ బొమ్మరిల్లు లాంటి యిల్లు అద్దెకి తీసుకొని, ‘చిలకపచ్చ కాపురం’ మొదలు పెట్టారు!
ఓ ఆర్నెల్ల తరవాత, ఆ అమ్మాయి యెవరిదో పెళ్ళికో, మరే కారణంతోనో మా వూరు వచ్చినప్పుడు, ‘అదేంటో అన్నయ్యా! ఆయనకి నిలకడ లేదు! చాలా భయం గా వుంటుంది!’ అని వాపోయింది! సంగతేమిటని ఆరా తీస్తే, అంత నాస్తికుడూ, రోజు రెండు పూట్లా సంధ్యావందనం చేస్తాడట! పోనీలే, బ్రాహ్మణ పుటక కదా, ఫర్వాలేదు అనుకొంటే, ఈ యోగా అనీ, ఆ యోగా అనీ, రకరకాల చేష్టలు చేశేవాడట!
ఆ మర్నాడెప్పుడో ఆయన కూడా రాగానే, ‘బావగారూ! యేమిటి—యోగాలేవో చేస్తున్నారట—కాస్త మాక్కూడా నేర్ప కూడదూ?’ అని సరదాగా పలకరించాను.
‘అవీ—గురువు ముఖతహా వుపదేశం పొందాలండి!’ అని చెప్పి, నాకు ఫలానా బాబాగారు వుపదేశం చేశారు—అసలు యేమిటంటే, మనకి ఒక అక్షరం, ‘ఓం’, ‘హ్రీం’, ‘శ్రీం’, ‘క్లీం’—లాంటిదొకటి చెవిలో వుపడేశిస్తారన్నమాట! దాన్ని, మనం మన దృష్టి భౄ మధ్యంలో వుంచి, ఆ అక్షరాన్ని పదే పదే మనసులోనే వుచ్చరించుకుంటూ వుంటే, కాసేపటికి ఓ దివ్యానందం కలుగుతుంది!’ అన్నాడు!
నేను సరదాగా, ‘అసలు మనదారిని మనం హాయిగా వుండక, ఈ బాధంతా యెందుకు?’ అంటే, ‘ఈ యోగా చెయ్యగానే, మనసుకి యెక్కడలేని ప్రశాంతత వస్తుంది! హాయిగా వుంటుంది. యేవిధమైన వత్తిడులూ, టెన్షన్లూ వుండవు!’ అన్నాడు!
‘అయ్యా! మీకేమి టెన్షన్లు వున్నాయి? మీరు చేసేది స్కూల్లో వుపాధ్యాయులుగా! కేర్ ఫ్రీ జాబ్! మరి బ్యాంకులో పదిమందికి ఒకేసారి సమాధానం చెపుతూ, అందరినీ సంతృప్తిపరచడానికి నేను యెంత టెన్షన్ పడాలి? అయినా, అలాంటి పరిస్థితి వస్తే, ఆ చోటు నించి కొంత దూరం వెళ్ళి, ఒక సిగరెట్టు వెలిగించుకొని, ఓ దమ్ములాగి చిటిక వెయ్యగానే, యెంత టెన్షనైనా దూరమయిపోతుంది నాకు! దీని కోసం, గంటలతరబడి యోగాలూ, వుప్పుదేశాలూ యెందుకండీ!’ అని కాస్త గడ్డి పెట్టాను!
‘అబ్బే! మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు! మహేష్ యోగి శిష్యులు గాలిలో యెగురుతున్నారు తెలుసా!’ అన్నాడు.
‘వాడి శిష్యుల గొడవెందుకు—వాడు గాలిలో యెగరగలడా? గలిగితే, పధ్నాలుగో యెన్నో ‘రోల్స్ రాయిస్’ కార్లు యెందుకు? ప్రైవేటు జట్ విమానమెందుకు? జనాలు వెర్రివాళ్ళా? వాడి శిష్యులు వాడిని మించిన వాళ్ళా? అయితే ఒక్కణ్ణైనా యెగురుకుంటూ ఇండియాకి రమ్మనండి!’ అనేసరికి ఇక నోరెత్తలేదు!
మూడేళ్ళు తిరిగేసరికి, పాపం ఆ అమ్మాయి తన బీ యే డిగ్రీతో వేరే వూళ్ళో ఓ కాన్వెంట్ లో టీచరు వుద్యోగం చూసుకొని, వొంటరి జీవితానికి అలవాటు పడింది!
మరి ‘వట్టు’ యేమయ్యాడో—అప్పటినించీ మాకు తెలీదు!

4 comments:

Unknown said...

Nee laanti vaallu unte aa yogula meeda kooda ekki dunna pothula laaga koorchuntaaru. Anduke vaalu egararu eppudante apudu.

Krishna K said...

@esoteric వర్యా, ఎప్పుడంటే అప్పుడు ఎగరరు అన్నారు బాగానే ఉంది. కనీసం ఒక్క సారి అన్నా, ఒక్కసారి అన్నా ఎగరారంటారా?

మహెష్ యోగి గాని, రజనీష్ లు కాని, సత్య సైబాబా లు గాని అంటే నాకు గౌరవభావమే. కాకపొతే వాళ్లను దేముళ్ళు అని నెత్తిన పెట్టుకోవటమే నాకు నచ్చనది.

kodali srinivas said...

మీరు ఉదాహరించిన వ్యక్తి నాస్తికాన్ని,హేతువాదాన్ని వదిలి ఆస్తికత్వాన్ని ఆశ్రయయించి నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఆయన్ని పట్టుకొని సూడో హేతువాది అనటం మీ ఆహేతు లక్షణాన్ని పట్టిస్తుంది.

A K Sastry said...

డియర్ Krishna!

అసలు విషయం వదిలేసి, మనుషులు గాల్లో యెగురుతున్నారని తాను నమ్ముతాను అని చెప్పకుండా చెప్పి, తన మూర్ఖత్వాన్ని చాటుకుంటున్నవాడికి, మనం యెన్ని చెప్పినా, దున్నపోతు మీద వానే! కదా!

మొహమాటానికి మీరు వాళ్ళంటే ‘గౌరవభావమే’ అన్నారేమో—నాకుమాత్రం గౌరవ భావం కూడా లేదు! వాళ్ళు ఇంకోరకం ‘పెర్వర్ట్’ లు—అంతే! మూర్ఖులు శిష్యులుగా చేరతామంటే వాళ్ళు గురువులయ్యారు!

టీవీలో చూడడం లేదా—‘మెంటల్ బిచ్చగత్తె పొలాల దగ్గర తిరుగుతూ, బూడిదా, చెత్తా గుప్పెళ్ళతో పట్టుకొని వూళ్ళోకి పరుగు తీస్తుంటే, ఆమె కాళ్ళమీద పడిపోతున్న భక్తులనీ, ఆవిడ కర్రతో కొట్టేస్తుంటే, ఆ దెబ్బ నాకు తగలాలి అంటే నాకు తగలాలి అని తోసుకుంటున్న భక్తులనీ, క్రితం సంవత్సరం ఆవిడ నా మీద బూడిద చల్లింది, నేను బాగు పడ్డాను—అందుకే ఈ యేడాది మళ్ళీ వచ్చాను అని చెపుతున్న వ్యాపారస్థుల్నీ, డిగ్రీలూ, ఇంజనీరింగులూ చదువుతున్నవాళ్ళనీ?’

ఇక మీ కామెంట్ క్రింద ఇంకొకాయన (దేంట్లో ప్రొఫెసరో తెలియదు) వ్రాసిన దాన్ని వ్రాసినట్టు చదివి, సమన్వయం చేసుకోలేక పోయాడు! ‘వట్టు’ పెళ్ళి టైములో ఊరికే షో చేశాడానీ, అందుకే వాడిని ‘సూడో’ అన్నాననీ గ్రహించకుండా, నాది ‘అహేతు లక్షణం’ అంటాడు చూడు!

హతోస్మి!