నా కొండెగాడు-2
నల్లబల్ల యెదురుగా ఓ తిన్నె మీద కుర్చీ, మేజా వుండేవి—ఉపన్యాసకులు కూర్చోడానికి వీలుగా.
ఆ తిన్నెకు కుడివైపున ఒక వరుసా, ముందు ఒక వరుసా, యెడంవైపు ఒక వరుసా వుండేవి—విద్యార్థులు కూర్చొనే బెంచీలు.
తిన్నె యెదురుగా వున్న వరుసలో, రెండో బెంచీ అన్నమాట మాది. అదృష్టం కొద్దీ ఆ తరగతిగది మారకపోవడం వల్ల, డిగ్రీ 3 సంవత్సరాలూ అదే బెంచీ లో, అవే సీట్లలో కూర్చొనేవాళ్ళం!
వాడు రోజూ పదింటికి కాలేజీ అయితే, తొమ్మిదిన్నరకల్లా తన చోటులో కూర్చొని వుండేవాడు! నేను పది గంటలకి ఓ పది నిమిషాలు ఇటూ అటూ వెళ్ళేవాణ్ణి. మాకు మొదటిరోజే చెప్పేశారు—మీరు స్కూళ్ళు వదిలి పెట్టేశారు. ఇది కాలేజ్. మీరు తరగతి గది లోకి వచ్చినా, బయటకి వెళ్ళినా ‘మే ఐ కమిన్’ ‘మే ఐ గో’ అనడగక్కర్లేదు! మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకుండా యెప్పుడైనా రండి, యెప్పుడైనా వెళ్ళండి—అని.
వాడూ నేనూ యెప్పుడు ‘ఒరే ఒరే’ అనుకున్నది లేదు! ‘గురూ అంటే గురూ’ అనుకునేవాళ్ళం. ఇద్దరం యెప్పుడూ ఒకరి మీద ఒకరం కోపగించుకున్నది లేదు! యెప్పుడైనా వేళాకోళమాడుకోవలసి వస్తే, ‘నా కొండిగా’ అనుకునేవాళ్ళం! అంతే!
వాడి నించి నేను చాలా నేర్చుకున్నాను—ముఖ్యంగా కుల మతాలతో నిమిత్తం లేకుండా అందరితో సమానం గా స్నేహం గా వుండగలగడం!
వాళ్ళింట్లో వాడికి ఓ గది వుండేది—వాళ్ళ నాన్న ఇంటి ముందు వైపు వెరే ఓ గది కట్టించుకుని, అందులోనే వుండేవాడు. ఓ పక్క పోర్షనులో వాళ్ళన్నయ్య కాపరం. వెనుక వసారాలో బట్టలూ, ముందు వరండాలో ఇస్త్రీ బల్లలూ, ఇస్త్రీ అయిన బట్టల మూటలూ. వాడు ఇంట్లో వున్నా, లేక పోయినా, యే సమయం లో అయినా నేను ఆ గదిని నా స్వంతం లా వాడుకొనే వాడిని.
మా కాలేజ్ లో తరగతి గదుల కట్టడాలకి ఓ పక్కగా, ఆట సామానుల గదులున్న ఓ షెడ్డూ, డ్రిల్లు మాష్టారి గది వుండేవి. ఆ షెడ్డు పక్కగా స్థలం లో పేరలల్ బార్లూ, హారిజాంటల్ బారూ వుండేవి!
సాయంత్రం నాలుగింటికి కాలేజ్ అయిపోగానే, తప్పకుండా Foot Ball, hockey, kho-kho, ball badminton లాంటి ఆటలు ఆడుకొనేవాళ్ళం. ఇంటికి వచ్చేసి, మళ్ళీ సాయంత్రం ‘బారు’ దగ్గరికి (పొడవు బారు కాదండోయ్—ఎక్సర్ సైజులు చేసే బారు!) వెళ్ళిపోయేవాళ్ళం! వెయిట్ లిఫ్టింగు కూడా చేసేవాళ్ళం! నేను అదనం గా ‘జిమ్నాస్టిక్స్’ నేర్చుకొని, సాధన బాగా చేసేవాణ్ణి!
నిజంగా నా శరీరం ఇప్పటివరకూ యే ఇబ్బందీలేకుండా నడిపిస్తోందంటే, అప్పుడు చేసిన కసరత్తులే కారణం. నాకు అందులో ఆసక్తి కలగడానికి కారణం నా కొండెగాడే!
ఇంకో ముఖ్య విషయం యేమిటంటే, కాలేజీలకి వచ్చినా, మాకు పాకెట్ మనీలు వుండేవికాదు!
మధ్యాన్నం లంచి బ్రేకు లో ఇంటికి వచ్చి, భోజనం చేసి వెళ్ళదానికి వీలుగా కాలేజ్ దగ్గరలో వున్న ఓ అద్దె సైకిలు షాపులో సైకిలు అద్దెకి తీసుకుని, మళ్ళీ కాలేజి కి వచ్చేటప్పుడు తిరిగి ఇచ్చేసేవాళ్ళం—దూరం ఇళ్ళు వున్నవాళ్ళం!
సైకిలు కి అద్దె అరగంటకి పావలా! అదికూడా, మానాన్నగారు జీతాలు రాగానే, యెన్నిరోజులు వాడుకున్నామో లెఖ్ఖ చూసి, షాపువాడికే ఇచ్చేసేవారు! బయట చిరుతిళ్ళు తినే అలవాట్లు వుండేవి కాదు! యెప్పుదైనా ఇస్తే, మా అమ్మ ఓ పావలా ఇచ్చేది—జేబులో వుంచుకో—అవసరం రావచ్చు—అని!
ఇక చిన్నప్పుడు (టిక్కెట్టు లేని వయసులో) మా అమ్మతో టూరింగు టాకీసులో చూసిన సినిమాలు తప్పితే, మళ్ళీ కాలేజీ కి వచ్చేవరకూ సినిమాలు చూసింది లేదు! అలా మా అమ్మతో చూసిన వాటిలో నాకు ఙ్ఞాపకం వున్నవి—వినాయక చవితి; పాండు రంగ మహత్మ్యం; అప్పుచేసి పప్పుకూడు, ఇల్లరికం, వెలుగు నీడలు, ఇద్దరు మితృలు; ఇలా కొన్ని!
ఇంకో సంగతి యేమిటంటే, మధ్యతరగతి వాళ్ళమనో, టిక్కేట్ల కోసం పెద్ద క్యూలలో వెళ్ళాలనో—పెద్ద క్లాసులకే వెళ్ళాలి అని గానీ, నేల టిక్కెట్ కి వెళ్ళకూడదు అనో ఫీలింగ్ వుండేది నాకు!
గమ్మత్తుగా, నా కొండెగాడు నాకు అనేక సినిమాలు చూపించాడు! చాలా మటుకు సెకండ్ షోలే!
బారు దగ్గరనించి ఇంటికి వస్తూంటే, ఇవాళ కొత్త సినిమా వచ్చింది—వెళదామా? అనేవాడు. (అప్పట్లో మా వూళ్ళో రెండే సినిమాహాళ్ళు కట్టారు.) ‘డబ్బులు లేవు గురూ’ అంటే, నీ జేబులో పావలా వుంటుందిగా, ఓ పదిపైసలు నేనిస్తాలే—మళ్ళీ నాకిచ్చేద్దువుగాని! అనేవాడు! (నేల టిక్కెట్టు ఖరీదు 35 పైసలు మరి).
కొత్త సినిమా—పైగా నేల టిక్కెట్—దొరుకుతాయంటావా? అంటే ‘అవన్నీ నేను చూసుకుంటాగా!’ అనేవాడు!
సరే, భోజనాలు చేసేసి, బయలుదేరి హాలు దగ్గరకి వచ్చేసరికి, అప్పటికే అక్కడ పెద్ద క్యూ!
మనవాడు వెంటనే చొక్కా విప్పేసి, యేవి గురూ డబ్బులివ్వు అంటూంటే, కొంతమంది తెలిసున్నవాళ్ళు కూడా, మాకో టిక్కెట్టు, మాకో టిక్కెట్టు అంటూ వాడి చేతిలో డబ్బులు పెట్టేవాళ్ళు—కనీసం ఓ పది పన్నెండు టిక్కెట్లకి!
‘ఇక మీరువెళ్ళి గేటు దగ్గర నించోండి—టిక్కెట్లు తేగానే దూరేసి, మంచి చోట్లు చూసుకోవాలి’ అనేవాడు! బయట వున్న జనాలని పక్కనించి దాటేసి, ఇనప కంచెలతో వున్న క్యూ లైను మొదటికి వెళ్ళిపోయేవాడు. అక్కడెవరో తనకి తెలిసున్నవాళ్ళో, తన కులం వాళ్ళో ఖచ్చితం గా వుండేవారు—వాళ్ళతో చేరిపోయేవాడు క్యూలో! అవసరం అయితే కండబలం చూపించేవాడు—చెప్పానుగా మంచి కండపుష్టి వుంది అని—బుల్ డోజరులా దూసుకు పోయేవాడు!
పది నిమిషాలలో అందరికీ టిక్కెట్లతో వచ్చేసి, పొలోమంటూ హాల్లోకి జొరబడి, వెనుకగా హాలు మధ్య వుండే చోటులో సెటిలయ్యిపోయి, హాయిగా కాళ్ళు జాపుకొని కూర్చొని, సినిమా చూసేసేవాళ్ళం! అలా లెక్కలేనన్ని పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక సినిమాలు చూపించాడు నాకు! ఇంకా, నాలో వుండే కొన్ని ‘ఇన్ హిబిషన్స్’ దూరం చేశాడు నాకు!
అంత ముఖ్యుడు నాకు నా కొండెగాడు!