Wednesday, August 12, 2009

స్నేహమేరా జీవితం

నా కొండెగాడు
వాడి పేరు భాస్కర్రావు!
కులం—శూద్రులు….వృత్తికి వాళ్ళమ్మ చాకలి; వాళ్ళ నాన్న ఓ భూమితనఖా బ్యాంకిలో మెసెంజర్. వాళ్ళన్నయ్య కూడా భూమితనఖా బ్యాంకులోనే అటెండరు. వాళ్ళ వదిన కూడా చాకలి. వాళ్ళకో చిన్న పిల్ల. అదీ వాడి కుటుంబం.
నేను హైస్కూల్లో 5వ ఫారం (ఇప్పటి 10వ క్లాసు) చదువుతున్నప్పుడు, వాడు ఎస్ ఎస్ ఎల్ సీ లో వుండేవాడు.
ప్రత్యేకం గా అందరూ వాడిని గమనించడానికి కారణం—వాడి రంగు నల్లజీడిగింజ నలుపు. కటి పైభాగం చక్కగా V షేపులో, చేతులు కండలు తిరిగినట్టు, వుండి, క్రింది భాగం మాత్రం సన్నగా—ఓ కార్టూన్ కేరెక్టర్ లా వుండేవాడు—దానికి తగ్గట్టు ఆ రోజుల్లో స్కిన్ టైట్ పేంట్లూ, పట్టేసినట్టుండే సగం చేతుల చొక్కాలూ ఫేషను!
కానీ, వాడి తలకట్టు—సినీ హీరోలే అసూయపడేట్టు వుంగరాలుగా పైకి లేచి, చివర్లు నుదుటిమీద తారాడుతూ—భలే అందంగా వుండేది!
దానికి తగ్గట్టు, తెల్లని చక్కని పలువరుసతో యెప్పుడూ నవ్వుతూన్నట్టే వుండేవాడు!
వాళ్ళిల్లు సరిగ్గా మా స్కూలు బిల్డింగునానుకొని లోపలికి వెళ్ళే సందులో లోపలకి వుండేది—ఆ సందులో సైకిలు కూడా నడిపించుకు వెళ్ళవలసిందే—తొక్కుతూ వెళ్ళాలంటే ఓ పదడుగులైనా ఆ సందు తిన్నగా వుంటే కదా!
వాళ్ళ ఇల్లు మాత్రం విశాలమైన ఆవరణలోనే వుండేది—అది ఆ సందుకి డెడ్ ఎండ్ కాబట్టి!
అప్పట్లో మేము పలకరించుకున్నది కూడా లేదు—మాకు సీనియర్ కదా! పైగా సోషల్ స్టేటస్ ఒకటి—మాది పెద్ద కులం, యెగువ మధ్యతరగతిలో లెఖ్ఖ!
వాడు పీ యూ సీ ఓ సంవత్సరం తప్పడంతో, నేను ఆ సంవత్సరం పీ యూ సీ పూర్తి చేసుకొని, వాడు కూడా అదే సంవత్సరం పేసయి, ఇద్దరం కాల్ళేజీ లో ఒకే క్లాసు—బీకాం లో చేరడం జరిగింది!
మొదటిరోజు క్లాసులో బెంచీకి కుడి చివర కూర్చున్నవాడు, నేను రాగానే కాస్త లోపలికి జరిగి తన సీటు నాకిస్తూ ‘కూర్చోండి’ అన్నాడు!
వెంటనే నేను ఆ సీట్లో కూర్చొని, వాడిని చూసి ఓ ఆత్మీయ నవ్వు నవ్వాను—అప్పటికింకా థాంక్సులు చెప్పడాలు ఫేషన్ కాదు!
(……మిగతా తరవాత!)

No comments: