Thursday, April 14, 2011

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి......2



......కళ్యాణం అనే ఓ ప్రహసనం

ముఖ్యమంత్రి రావడానికి ఓ పావుగంట పైగా పడుతుంది అని ఫోను వచ్చిందేమో, మధ్యలో "నారికేళ సమర్పణ" అని ఒకటి ప్రవేశపెట్టారు. 

ఓ అర్చక స్వామి ఓ ఒలిచిన కొబ్బరికాయని దోసిట్లో పట్టుకొని, బిగిసిపోయినట్టుగా నిలబడి, వూపిరి తీస్తూ వొదులుతూ, ఓ పావుగంట సేపు పట్టుకొనే వున్నాడు. మొదట ఆ కాయ ముచ్చికని కుడివైపు తిరిగి వుండేలా పట్టుకొన్నాడు. తరవాత నెమ్మదిగా వేళ్లతో దాన్ని తనవైపుకు వుండేలా తిప్పుకున్నాడు. అంతసేపూ యేమి మంత్రాలు చదివారో తెలియదు. తరవాత ఆ కాయని స్వామి పాదాలదగ్గరనుకొంటా పెట్టేశారు.

యే వివాహం లోనూ ఇలాంటి తంతు జరగడం నేను చూడలేదు. ముహూర్తానికి ముందు యెక్కువ సమయం వుంటే వీనుల విందుగా "మహా సంకల్పం" చెపుతారు. మరి వీళ్లకి అది రాదో యేమిటో.

సరే, ముహూర్తం పేరుతో జీలకర్రా, బెల్లం ముద్దలు--తిరపతి లడ్డూ సైజులో--ఇద్దరి కిరీటాలమీదా పెట్టేశారు. వ్యాఖ్యాత ఒకరు ఆ పదార్థాన్ని "మాడు" మీద పెట్టడం గురించి వివరిస్తూ, నవరంధ్రాలేకాకుండా దశరంధ్రాలో, ద్వాదశరంధ్రాలో--ప్రసక్తి కూడా తెచ్చాడు. సరే బాగుంది.

ఇంక మాంగల్య ధారణ. యెవరు చెప్పినా, చేయించినా ఆ తంతునెవరూ మార్చలేరు కాబట్టి, బాగానే జరిపించారు. మూడు తాళి బొట్లగురించి వివరించడం కూడా మరిచిపోలేదు.

ఇంక మిగిలిన తంతు అల్లా తలంబ్రాలే. మంటపం చుట్టూ ఫేన్లు ఆపేసి, అర్చకస్వాములిద్దరూ, తెల్లని ముత్యాలని ఇద్దరిమీదా పొయ్యడం మొదలెట్టారు. అలా కొన్నిసార్లు పోశాక, ఓ వ్యాఖ్యాతకి గుర్తొచ్చింది "జానక్యా కమలాంజలి పుటే యా" చెప్పేశాడు. తరవాత "ప్రభుత్వం" ప్రతి యేటా సమర్పించే ముత్యాలు. (అవి గులాబీ రంగులో వున్నాయి. ఓ కేజీ కుంకంపువ్వు లో దొర్లించారో లేక యేదో రంగు కలిపేశారో--ప్రజల డబ్బులేకదా). అవి పోశాక ఓ అర్చక స్వామి ప్రత్యేకంగా శ్రీరాముడి ముఖాన్ని, కళ్లనీ ఆ పౌడరు రాలిపోయేలా తుడవడం కనిపించింది. ఇంకో వ్యాఖ్యాతకి గుర్తొచ్చింది......మళ్లీ ఆయన "జానక్యా....." చదివేశాడు.

ఈ ముత్యాల దగ్గరకి వస్తే, మొట్టమొదట గోల్కొండ నవాబు ఆ ముత్యాలని తానీషా ద్వారా కళ్యాణానికి తలంబ్రాలుగా పొయ్యమని పంపించాడు అని చరిత్ర. అప్పటినుంచీ "అవే ముత్యాలు" ప్రతీయేటా ప్రభుత్వం వారు జాగ్రత్తచేసి, సమర్పిస్తూ వుంటారు అని జనం విశ్వాసం. మరి వాటి మూలాల్లోకి వెళితే, వెంకన్నకి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన వస్తువుల కథే పునరావృతం అవుతుందేమో అని నా అనుమానం.

స్వామికి రామదాసు చేయించాడని చెప్పుకొనే నగలన్నీ, కళ్యాణం అయిపోయాక మళ్లీ బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తారు. వాటి రికార్డుల సంగతి యేమిటో మరి. ఇదివరకు దేవాలయం లోనే ఓ గదిలో, అద్దాల కేసుల్లో వాటిని ప్రదర్శించేవారు. అప్పుడు పెద్ద పెద్ద పచ్చలతో అరచేయి సైజులో ఆ పతకాన్ని చూసిన గుర్తు నాకు. ఇప్పుడు చూపిస్తున్న పతకానికి, క్రింద వ్రేళ్లాడుతూ మాత్రమే కొన్ని చిన్న చిన్న పచ్చలు కనిపిస్తున్నాయి. చింతాకు పతకం ప్రసక్తే రావడం లేదు. దొంగలుపడి వాటిని దోచుకున్నాక, వాళ్లు పట్టుబడి అవి పోలీసులు స్వాధీనం చేసుకున్నాక, వాటిని లాకరులో భద్రపరుస్తున్నారు.   

తలంబ్రాల ముందో, తరవాతో గుర్తులేదు గానీ, ఈ మధ్యే ప్రవేశపెట్టిన--కొబ్బరి కాయతో బంతులాట. ఇద్దరు అర్చకులు, మంటపం ముందువైపు చెరో ప్రక్కనా కూర్చొని, ఓ వొలిచిన కొబ్బరికాయని, ముచ్చికతో సహా, ఒకరికొకరు దొర్లిస్తూ ఆడుకుంటారు. (అలా యెంతసేపు ఆడారో నేను చూడలేదు) 

.........తరువాయి మరోసారి.

No comments: