Saturday, April 2, 2011

"కల్ట్" అనే.....



......వేలం వెఱ్ఱులు

"సృష్టి, స్థితి, లయ" అనేవి అందరికీ తెలుసు. యెటొచ్చీ, సృష్టి, స్థితి మన చేతుల్లో వుంటాయికానీ, లయ మాత్రం వుంటే గింటే ఆ పరమేశ్వరుడి చేతుల్లోనే!

ఒక "కల్ట్" (అంటే స్థూలంగా 'పంథా' అనొచ్చునేమో) సృష్టించడం, దాన్ని పెంచి పోషించడం (Originate; Build & Promote) అనేవి మన చేతుల్లోనే వుంటాయి. 

ప్రపంచంలో వివిధ మతాలు వాటి 'పంథా' లని నిర్దేశించుకున్నాయి. వాటి ప్రకారమే నడవమన్నాయి. (మన హిందూ కే యే పంథా లేదు--ధర్మం అనేది తప్పితే!). అయినా, వివిధ మతాల్లోనూ ఇంకా అనేక పంథాలు ప్రవేశపెట్టబడ్డాయి. అనుసరించబడుతున్నాయి. 

బౌధ్ధుల్లో--అహింసా, పునర్జన్మలమీద నమ్మకం, బుధ్ధుడి అవశేషాలమీద స్థూపాలూ, అవేవో గంటలూ, శబ్దాలు వెలువరించే 'గిరికీలు ' లాంటివీ, దమ్మపథ పఠనం--ఇలాంటివి.

మహమ్మదీయుల్లో--మక్కా వైపే తిరిగి ప్రార్థనలు చెయ్యడం, హజ్ యాత్రల్ని నిర్వహించడం, మహమ్మదు ప్రవక్త శరీర భాగాలకి దర్గాలు కట్టి ఆరాధించడం, మరణించిన మహాత్ముల దర్గాలని దర్శించి కోరికలు తీర్చుకోవడం, భూతప్రేతపిశాచాల నుంచి గురువులు రక్షణ కల్పించడం ఇలాంటివి.

క్రిస్టియన్లలో చెప్పఖ్ఖర్లేదు--ప్రతీవాడూ ఓ చర్చి కట్టేవాడే, బోధలు చేసేవాడే. కొన్ని వందల యేళ్లగా అనేక లక్షల చర్చిలు వెలిశాయి. రోమన్ కాథలిక్కుల దగ్గరనించి, సిరియన్ కేథలిక్కులూ, ప్రొటెస్టెంట్లూ నించి 'మార్మన్ '; 'లేటర్ డే సెయింట్స్ '--ఇలా.

అన్ని మతాల్లో అందరూ చేసింది--ఓ "కల్ట్" నిర్మించడం, పెంచడం, పోషించడం--అంతే!

మన దేశంలో కూడా, శంకరాచార్యుల దగ్గరనించి రామకృష్ణ పరమహంస, వివేకానంద, విప్లవయోగి అరవింద ఘోష్, రమణ మహర్షి, షిర్డీ సాయిబాబా, సత్య సాయి బాబా, ఆచార్య రజనీష్, మహేష్ యోగి, జిడ్డు కృష్ణమూర్తి, మాస్టర్జీలు, ఎక్కిరాలవారూ, నేటి గణపతి సచ్చిదానందలూ, సుందర చైతన్యానందలూ, చివరికి మొన్నటి ప్రేమానందలూ--వీళ్లెవరూ తమ పేరిట ఒక "పంథా" నిర్మించమనీ, ప్రచారం చెయ్యమనీ, ప్రమోట్ (అంటే పదోన్నతి కాదు కదా?) అదే--పెంచి పోషించమనీ యెవ్వరినీ వేడుకోలేదు!

అలాగే, స్వామి అయ్యప్పా, విజయవాడ కనక దుర్గా, అన్నవరం సత్యదేవుడూ, తిరపతి వెంకన్నా, నిర్మలగిరి మరియమ్మా, వీళ్లెవరూ మాలలు ధరించమనీ, భజనలు చెయ్యమనీ, మండల పూజలు చెయ్యమనీ, యాత్రలు చెయ్యమనీ, పూజించమనీ యెవరికీ చెప్పలేదు!

కానీ--జరుగుతున్నదేమిటంటే, వాళ్ల పేర్లు చెప్పుకొని కొంతమంది "ముఖ్య శిష్యులూ, భక్తులూ, అనుచరులూ, పూజారులూ, పరిశయ్యులూ"--ఇలా బయలుదేరి, "కల్ట్" ప్రారంభం, నిర్మాణం, పెంచి పోషించడం--జరుగుతున్నాయి.

ఇవన్నీ అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాల్లో కొన్ని వందల యేళ్లుగా జరిగి, లయం చెందినవే! (ఫలానా గ్రహణం రోజున మన పంథా వాళ్లందరూ ఓ శిఖరాగ్రం మీద చేరి, నేను "ఓకే" అనగానే క్రిందకి దూకెయ్యాలి! అన్న పంథాలూ చూశాము కదా?)

మరి ఇప్పుడు భారత దేశానికి యేమి దౌర్భాగ్యం? ఈ యెంగిలి కూడు "కల్ట్" లని దేశంలో ప్రవేశపెట్టడం యెందుకు? యేమి సాధిస్తున్నారు? అంటే--"స్వ సంపాదన కోసమే" అనే సమాధానం వస్తుంది.

.......మళ్లీ మరోసారి.

No comments: