ఇవోరకం
"పరమహంస పరివ్రాజకాచార్య హంపీ విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ" మొన్నోరోజు ఏలూరులో "అనుగ్రహభాషణం" చేశారట.
"యెక్కడ శుభ్రత వుంటుందో అక్కడ శ్రీమహాలక్ష్మి వుంటుంది" అన్నారట. అంతేకాదు శ్రీవారినీ, అమ్మవారినీ సేవించి, "భక్తులకు మంగళాశాసనాలు" తెలిపారట.
ఇవన్నీ యేమిటో??!! శంకరా! నారాయణా!
అన్నట్టు, ఈ మధ్య గుళ్లలో వేస్తున్న పాటలు క్రొత్త పోకడలు పోతున్నాయి!
"కేశవా! నారాయణా! మాధవా! గోవిందా!" లని తనకి ఇష్టంవచ్చిన రాగాలతో, తబలా విద్వాంసులు సహకరించగా, పాడేసి, రికార్డు చేసేసేవాడొకడు.
"మత్స్య, కూర్మ, వరాహా, నారసిమ్హ, వామన" అంటూ, అలాగే ఓ రాగం లో పాడేసి, రికార్డు చేసేవాడొకడు! (అవేవో తమ సొంత సాహిత్యమైనట్టు!)
వీళ్లకన్నా, కిరస్థానీ పాటలు వ్రాసి పాడేవాళ్లు నయం. యెన్ని కొత్త కొత్త పాటలో! (వాళ్ల సాహిత్యంలోనే అయినా!)
ఎమ్మెల్యేలకు "సొంత కార్యాలయ భవనాలు" నిర్మించేందుకు వీలుగా, "ప్రభుత్వ స్థలాలు" సేకరించాలని ప్రభుత్వం అదేశించడంతో, రెవెన్యూ శాఖ స్థలాలకోసం "దృష్టి" సారించిందట. కొన్ని నియోజకవర్గాల్లో స్థలాలని "గుర్తించా"రట. నరసాపురంలో రెవెన్యూ స్థలాలు "లేవ"ట. అందుకని ఎమ్మెల్యేగారు "ఆర్డీవో కార్యాలయ ఆవరణలోనే" స్థలం కేటాయించాలని కోరారట. ఆస్థలం కేటాయిస్తే, తమ "కార్యకలాపాలకు అన్నివిధాలా అనుకూలంగా వుంటుంది" అని అధికారులు, వున్నతాధికారులకి తెలిపారట!
అసలు వీళ్లకి కార్యాలయాలు యెందుకట? ఇవాళ కార్యాలయం నిర్మాణమూ, దానికి టెండర్లూ.....రేపు తమ భద్రతా సిబ్బందికీ, తైనాతీలకీ క్వార్టర్లూ....మళ్లీ టెండర్లూ.....ఇలా చేసి, చివరికి ఆర్డీవో కార్యాలయాన్ని వూరి చివర "డంపింగ్ యార్డు" లోకి తరలించడానికా?
భూమి యెప్పుడూ ఇక్కడే వుండేది, వుంది, వుంటుంది. "నువ్వే పోయేవాడివి!" అనే విషయం యెవరు చెపుతారు వీళ్లకి?
అలెగ్జాండరు పాపం తను చనిపోయాక, తన శవపేటిక రెండువైపులా తన చేతులు పట్టే రంధ్రాలని చేయించమని శాసిస్తే, అడిగారట....."అలా యెందుకు?" అని. దానికాయన జవాబు--"నేను జగజ్జేతను. దానికోసం కొన్ని లక్షలమందిని బలిపెట్టాను. అయినా, 'వొట్టి చేతులతోనే' ఈ ప్రపంచం వీడి వెళ్లిపోతున్నాను. అందుకని, నా ఖాళీ చేతులు బయటికి కనపడేలా నన్ను సమాధి చెయ్యండి. ఇది చూసైనా అందరికీ బుధ్ధి రావాలి" అన్నాడట.
ఈ విషయం మన రా నా ల తలకెప్పుడు యెక్కుతుందో మరి!?
No comments:
Post a Comment