Sunday, November 13, 2011

వుత్సవాలు.....2




......వైభవంగా

.......జరుగుతున్నాయి-- రాష్ట్రమంతటా. 

కొన్ని కొత్త కొత్త వుత్సవాలూ, పూజలూ, నోములూ వగైరాలగురించి మొదటిసారి వింటున్నాము.

వాటిలో ఒకటి--వివాహమైన మొదటియేడాది వచ్చే కార్తీక పౌర్ణమికి--11అరటిపళ్లున్న హస్తాన్ని, బూడిదగుమ్మడి పువ్వు, పిందె, సూరే గుమ్మడి కాయ, పసుపు మొక్క, కంద మొక్క, చెట్టునుంచి చేతితో (క్రిందపడకుండా) అందుకున్న కొబ్బరికాయల గెల--శివాలయంలో నైవేద్యంగా నివేదిస్తే శుభాలు సమకూరతాయని--"పదకొండు కాయలున్న అరటిపళ్ల హస్తానికి" గిరాకీ పెరిగి, ఒక్కోటీ రూ.150/- కి అమ్మారట!

వేదమంత్రోశ్చ/శ్చారణ అని వ్రాస్తున్నారు! అది వుచ్చారణ అని వ్రాయాలి. పునశ్చరణ అన్నట్టు కాదు. 

మనకి అర్చకులూ, పూజారులూ, పండితులూ తెలుసు. కానీ ఈ మధ్య కొత్తరకం పండితులు పుట్టుకొచ్చారు--వేదపండితులు, దీపాలంకరణ సేవా పండితులు, అభిషేక పండితులు....ఇలా! 

వేదాలు చదవడానికీ, ఆశీర్వచన పనసలు చెప్పడానికీ వేదాల్లో పాండిత్యం అఖ్ఖర్లేదు. అయినా, వాళ్లకి ఇంకో మాటలేక, వేదపండితులు అని వ్యవహారంలోకి వచ్చింది. సరే. మరి అభిషేక పండితులూ, దీపాలంకరణ పండితులూ యెవరు? పేపర్లవాళ్లు ఇస్తున్నారా ఆ బిరుదులు? ఇంకెవరైనా అలా వ్రాయిస్తున్నారా?

దీపాలంకరణ అంటే గుర్తొచ్చింది. ఇదివరకు గృహస్థులు ప్రతీరోజూ దీపారాధన చేశాక మాత్రమే భోజనం చేసేవారు. అలా సంవత్సరంలో యే కొన్ని రోజులైనా, యే అస్వస్థత లేదా ఇతరకారణాలవల్లనో దీపం పెట్టలేకపోయి వుంటే, దానికి ప్రత్యామ్నాయంగా కార్తీక పూర్ణిమరోజున శివాలయంలో "ఒక దీపం" వెలిగిస్తే సరిపోతుందనేవారు. 

ఇప్పుడు యెవరూ ప్రతీరోజూ దీపాలు వెలిగించడంలేదు కాబట్టి, "పండితులు" ఆ రోజున 365 దీపాలు వెలిగించమంటున్నారట! బాగుంది. మరి "సహస్ర" దీపాలమాటేమిటి? అలా అందరూ యెగబడి ఒక్కోళ్లూ 365 చొప్పున పెట్టుకొంటూ పోతే, సహస్ర యేమి ఖర్మ.....లక్షల్లో పెట్టినా చాలవు!

పైగా, ఇది వరకు కిరాణా షాపుల్లో నూనెలు తూచడానికి ఓ పళ్లెం లంటిది కాటాలో పెట్టుకొని, అందులో మన సీసానో, డబ్బానో వుంచి, పడికట్టి, వాళ్ల డొక్కులతో నూనె పోసేవారు. ఆ సమయంలో కొంతనూనె ఆ ట్రేలో పడేది. కొట్టు కట్టేసేప్పుడు ఆ ట్రేలో పడిన అన్నిరకాల నూనెల మిశ్రమాన్ని వేరే డబ్బాలోపోసి, నిల్వ చేసేవారు. దాన్ని దీపావళికి "దీపాల నూనె" పేరుతో చవగ్గా ఇచ్చేవారు. 

ప్రమిదలో దీపం పెట్టాలంటే ఆముదం వుపయోగించాలి. ఆ పొగ, కళ్లకి మంచిది. వాసన కూడా ఆరోగ్యం. మిగిలిన యే నూనె అయినా, కళ్లు మండుతాయి. పొల్యూషన్ పెరుగుతుంది!

ఇంకా, మనదేశం వార్షిక వంటనూనెల దిగుమతి బిల్లు కొన్ని వందలకోట్ల లో వుంటోంది! నూనెలని దుబారా చేస్తే పుణ్యం వచ్చేస్తుందా?

ప్రమాదాల సంగతి సరేసరి. మొన్న మావూళ్లో ఓ గుళ్లో, సహస్ర దీపాలకోసం ప్రమిదల్లో నూనెపోస్తూంటే, అక్కడే ఆడుకొంటున్నపిల్లలు పొరపాటున నూనె వంపేశారు. మైకులో "నూనె వలికింది....జాగ్రత్త" అని హెచ్చరిక చేస్తున్నా, ఒకావిడయెవరో జర్రున జారి, ప్రక్కామెమీద పడడం, పేకమేడలో పేకల్లా ఒకళ్లమీద వొకళ్లు పడిపోయడం జరిగిపోయాయి. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలూ, ఫ్రాక్చర్లూ జరగలేదెవరికీ!

టీవీలో విశాఖపట్నంలో అనుకుంటా ఒకావిడ చీర అంటుకోవడం, ఆవిడ కెవ్వు కెవ్వుమని అరుస్తూ వుండడం, చుట్టుప్రక్కల ఆడవాళ్లు దూరంగా పారిపోతూంటే, కొందరు చీర విప్పెయ్యమనీ, కొందరు క్రిందపడి దొర్లమనీ సలహాలిస్తూండడం చూశాము!

ఇవన్నీ అంత అవసరమా?


No comments: