Wednesday, November 9, 2011

వుత్సవాలు.....



......వైభవంగా

మన పండగల సంఖ్య పెరిగిపోతోంది. 

కార్తీక మాసంలో ప్రతీరోజూ "అతి పవిత్రమైనదే"నట. 

ఇంక "మాసములలో నేను మార్గశిరమును" అన్నాట్టెవడో! అందుకని, మార్గశిరమాసంలో "అన్నీ" పవిత్ర దినాలేనట. 

మరి పుష్య మాసంలో, ధాన్య్హ లక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి, అన్నీ పవిత్ర దినాలే. పశుపూజలతో సహా, ఆయుధ పూజలతో సహా! బాగుంది. 

రాబోయే రోజుల్లో, అన్ని మాసాల్లోనూ, అన్ని రోజులూ, వివిధ కులాలవాళ్లకీ, మతాలవాళ్లకీ "పవిత్రమైనవే" అవుతాయి. యెటొచ్చీ, ఆ పవిత్రతకి అర్థాలు మరిపోతాయి. అంతే. 

నేను పుట్టి బుధ్ధెరిగాక, గత యాభై యేళ్లలోనూ వినని......అంతెందుకూ......గత సంవత్సరం కూడా వినని....కొన్ని క్రొత్త క్రొత్త కథనాలు వింటున్నాము! 

దీపావళీ, నరక చతుర్దశీ మన చిన్నప్పణ్నించీ వింటున్నవే. 

వుత్తరదేశ వ్యాపారుల పుణ్యమాని, "ధన్ తేరాస్" (ధన త్రయోదశి) పుట్టుకొచ్చింది. ఓకే! 

ఓ ప్రబుధ్ధుడు దానికి యెక్కడనుంచి  క్రొత్తగా "లింకు" పెట్టుకొచ్చాడో చూడండి! "ధన్" అంటే  "ధన్వంతరి"ట. ఆయన పుట్టినరోజట అది. సరే. 

ఆయన "వైద్యం"లో యెన్నెన్నో ప్రయోగాలు చేసి, 'కొత్త కొత్త మందులు కనిపెట్టాడట, కట్టాడట '. బాగుంది. 

వాటిల్లో "సువర్ణ భస్మం" ఒకటిట. అందుకని, ఆ రోజున అందరూ యెంతో కొంత "స్వర్ణాన్ని" కొనాలట! 

(ఇంకా నయం.....వెంటనే దాన్ని భస్మం చెయ్యాలని ఇప్పటివరకూ చెప్పలేదు. ముందు ముందు అదీ చెప్తారేమో.....మూఢ జనులు ఆపనీ చేసి, మళ్లీ మళ్లీ బంగారం కొంటూనే వుంటారేమో! వాళ్ల వ్యాపారాలు ఇంకా వృద్ధి చెందుతాయేమో!) 

ఇంతకు ముందు "విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, ఆమెకి 'సూడి కుడుత్త నాచ్చియార్ ' అని పేరు పెట్టుకున్నాడు" అని రాసిన పెద్దమనిషే......ఈ కథనం కూడా వ్రాసింది! బాగానే వుంది. తెలుగు పాఠకులు వీపీలు (వట్టి పిచ్చాళ్లు)! 

ఇంకో క్రొత్త కథనం పుట్టుకొచ్చింది....నరకాసురుడు భూమి పుత్రుడు కాబట్టి, "దళితు"డట. వాణ్ని "ఆర్యులు" ఓ విలన్‌గా చిత్రీకరించి, కృష్ణుడి విజయంగా (ఆయన బీసీ!) ఈ పండగని ప్రవేశపెట్టారట! అందుకని, ద్రవిడుడైన నరకుణ్ని దేవుడిగా పూజిస్తారట! 

(ఇది వ్రాసిన మేతావులు కమ్మీనిస్టులని కొంతమంది చెవులు కొరుక్కొంటున్నారు....నిజానిజాలు పైవాడికే తెలియాలి!). 

ఓ యాభై యేళ్ల క్రితమే, తమిళనాడు (ద్రావిడ ప్రదేశ్ అంటే వొప్పుకొంటారా?) లో "పెరియార్ రామస్వామి నాయకర్" అనే పెద్దాయన, "ఆర్యులకి" వ్యతిరేకంగా పెద్ద వుద్యమాన్ని నిర్వహించాడు. ఆ చెట్టు కొమ్మలే నేటి ద్రావిడ పార్టీలు.....ద్రవిడ కజగం; ద్రవిడ మున్నేట్ర; అన్నా ద్రవిడ....ఇలా! 

ఇంతకీ ఆయన చేసిందేమిటి? అంత గులగావుంటే, రావణుణ్ని పూజించుకోవచ్చుకదా? వూఁహూఁ! రాముణ్ని చెప్పులదండలేసి, పెంట విసురుతూ, చెప్పులతో కొడుతూ, "వూరేగించాడు"! 

చూస్తూంటే ఇలాంటి "వుద్యమాలు" తెలుగునాడు లో కూడా విజృంభిస్తాయేమో! 

నందో రాజా భవిష్యతి కదా?

......మరోసారి.

7 comments:

Indian Minerva said...

ఈ సూడి కుడుత్త "నాంచారి" అని అన్నమయ్య రాసిన పాటల్లో ఎక్కడో విన్నాను. ఇదన్నమాట రిఫరెన్సు. ఇంతకీ ఈ నాచ్చియార్/నాంచారి అసలు కధేమిటి? వివరించగలరు.

ఈ నందో రాజా భవిష్యతి అంటే ఏమిటి? నందరాజులు నాశనమయిపోయారుకదా. మిడిసిపాటు కూడదని చెప్పే జాతీయమా ఇది.

శ్యామలీయం said...

నందో రాజా భవిష్యతి కథ.
ఒకానొక రాజుగారికి నిక్షేపంగా ఇద్దరు భహార్యలుండటం, చిన్నభార్యామణి మోజులో పెద్దావిడ పట్టపురాణీగారిని సదరు రాజావారు నిర్లక్ష్యంచేస్తూ ఉండటం జరుగుతున్నాయట. పాపం పెద్దరాణీవారికి సొమ్ముకు కటకటగా ఉండేదట. ఒక రోజున ఒక వ్యాపారి, బహుశః యీవిడ పరిస్థితి సరగా తెలియని వాడేమో, వచ్చి చాలా వెలగల చీరలు విక్రయించబోయాడట. ఆవిడకు కొనుక్కోవాలని ఉన్నా కొనడానికి గతిలేని పరిస్థితి. ఆలాగని పరాయి వాడికి చెప్పుకోలేదు గదా. ఏంచెయ్యాలా అని గడబిడ పడుతుంటే ఆమెగారి ఆంతరంగిక దాసి అందట యీ మాట, "పుచ్చుకోండమ్మా, రొక్కానికి మరలా రమ్మనండి. నందో రాజా భవిష్యతి, చూద్దాం అని" అంటే రేపుమాపు మీ కొడుకు నందుడు రాజు అవుతాడులెండి మీ కష్టాలు తీరుతాయి అని.
రేపేదైనా జరుగ వచ్చుకదా అని ఆశావహ దృక్పధంతో చెప్పటానికి యిది వాడతారు.

Indian Minerva said...

శ్యామలీయం గారు: Thank you very much.

A K Sastry said...

డియర్ Indian Minerva!

శ్రీరంగపట్టణం లోని రంగనాథ ఆలయంలో పూజారి అయిన విష్ణుచిత్తుడికి పూదోటలో దొరికిన పాపకి, గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకున్నాడట.

ఆమె యౌవనవతి అయ్యాక, స్వామికోసం తయారుచేసిన పూలమాలలని తాను ముందు అలంకరించుకొని, నూతిలో చూసుకొని, నా అందాన్ని చూసి రంగనాథుడు నన్ను ప్రేమిస్తాడు అనుకొని, ఆయననే పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకొందట.

తాను ధరించిన మాలని స్వామికి అర్పిస్తుంది కనుక "ఆముక్తమాల్యద" అయ్యింది. ఆపేరుతోనే శ్రీకృష్ణ దేవరాయలు ప్రబంధం వ్రాశాడు. అదే తమిళంలో "సూడి కుడుత్త నాచ్చియర్" అయ్యింది!

నాచ్చియర్ అంటే తమిళంలో "నాట్యకత్తె" అని అర్థమేమో. యెందుకంటే అలమేలుమంగని కూడా "బీబీ నాంచారి" అంటారు.

"యేమో! రేపు జరిగినా జరగొచ్చు. యెవరు చెప్పగలరు?" అనడానికి వాడుతారు నందోరాజా భవిష్యతి అని.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ శ్యామలీయం!

మీ వివరణకి చాలా సంతోషం.

ధన్యవాదాలు.

Indian Minerva said...

Wow!! ఆముక్తమాల్యద అంటే ఆవిడ టైటిలా! ఈగోదాదేవి గురించి చదివానుగానీ ఆమెకి ఈపేరొకటుందనీ, ఈ బిరుదంగానీ తెలీవండీ. Thank you very much

A K Sastry said...

డియర్ Indian Minerva!

చాలా సంతోషం.

ధన్యవాదాలు మరోసారి.