తెలుగులోనే మాట్లాడదాం....
ప్ర తె మ ల సందర్భంగా అనేకమంది ఒకటే గోల—తెలుగుని వుధ్ధరించండి—అంటూ!
అసలు వుధ్ధరించడం యెందుకు? వున్నచోట వుండనిస్తే నష్టమా?
నిర్వాహకులు “ఇన్నికోట్లడిగాం, ఇన్నే ఇచ్చారు, మరిన్ని ఇస్తే ఇంకా బాగుంటుంది” ఇలా అంటున్నారు.
ఆ పేరుతో గత నెలరోజులుగా మండలాల్లోనూ, జిల్లాల్లోనూ, పట్టణాల్లోనూ, “తెలుగు భాషా—వర్థిల్లాలి, తెలుగు తల్లీ—జిందాబాద్” అంటూ ర్యాలీలూ అవీ చేసేసి, గొంతులు చించుకున్నారు.
తెలుగు సంస్కృతి వుట్టిపడేలా, హరిదాసుల వేషాలు వేయించీ, గంగిరెద్దుల వాళ్లా, కొమ్మదాసరులా, పిట్టలదొరలా వేషాలు వేయించీ, ముగ్గులు వేయించీ, గొబ్బిళ్లు పెట్టించీ, వంటలపోటీలు పెట్టించీ, బహుమతులిచ్చేసీ, యెప్పుడూ పట్టించుకోని రచయితలకీ, కవులకీ, కళాకారులకీ శాలువాలు కప్పేసీ, కేటాయింపులని “మమ” అనిపించేశారు.
ఆయనెవరో అన్నట్టు, “కాళ్ల చుట్టూ నేలని జీరాడే పంచెకట్టే” తెలుగుదనం అంటే, మరి తెలుగు గోచీపాతరాయుళ్లూ, అడ్డపంచెలవాళ్లూ తెలుగు వాళ్లు కాదేమో! కాయకష్టం చేసే వాడినుంచికాకుండా, పనీపాటాలేనివాడి నుంచి “తెలుగుదనాన్ని” నేర్చుకోవలసిరావడం అవమానం కాదా? అని ఆయన అడగడం సబబే అనిపిస్తుంది.
ఇంక తిరపతిలో క్లైమాక్సే మిగిలింది.
ఇంక, ఈనాడు వాడైతే జనాల తలలకి రోకలి చుట్టేస్తున్నాడు.
ఇదివరకు యేమాత్రం కొరుకుడుపడని తెలుగు అనువాదపదాలని ప్రవేశపెట్టి, అధికారికంగా తెలుగు ని వృధ్ధిలోకి రాకుండా శాయశక్తులా పాటుపడ్డారు మన ప్రభుత్వం వారు. ఇప్పుడా కృషిని ఈనాడు నెత్తికెత్తుకున్నట్టుంది.
హోం మంత్రి కి “అంతర్గత భద్రత మంత్రి” (గృహ మంత్రి అంటే నష్టమా?) అనీ, పబ్లిక్ సర్వీస్ కమీషన్—పీ ఎస్ సీ కి “ప్రజా సేవా సంఘం—ప్ర సే సం” (ఇది యేవిధమైన ప్రజాసేవా చేసే సంస్థ కాదు కదా?) అనీ, ఇంకా కొన్ని చిత్ర విచిత్రమైన మాటలని ప్రవేశపెట్టేస్తున్నారు. పోనీ, దాంతో సరిపెడుతున్నారా అంటే…….యెక్కడో జపాన్ లోని పార్టీలపేర్లని—డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్ ని “జపాన్ జనస్వామ్య పక్షం—జ జ ప” అనీ, జపాన్ రెస్టొరేషన్ పార్టీ ని “జపాన్ పునరుధ్ధరణ పక్షం—జ పు ప” అనీ……ఇలా మొదలెట్టారు! ఇవన్నీ అంత అవసరమా?
కోర్టు ని “కోట్రు” అనీ, రోడ్డు ని “రోడ్రు” అని……ఇలా వ్యవహరించే మన తెలుగు సామాన్యులకి, “సర్వోన్నతన్యాయ స్థానం”, “రహదారి” (అసలు రహదారి అంటే, ఇంగ్లీషులో “థరో ఫేర్”. మరీ రోడ్డు అనకూడదు అనుకుంటే, బాట అంటే సరిపోతుంది!) అనీ వ్యవహరించమంటే భాషని వుధ్ధరించినట్టా?
“క్రిస్మస్" ని కూడా “కిసిమిశ్” అని తెలుగులో అనుకోవాలా? (కన్యాశుల్కంలో గురజాడ ఓపాత్ర చేత “కిసిమీశ్శెలవులు” అనిపించాడుమరి!)
………ఇంకొంత మరోసారి.
2 comments:
అవసరమే :)
డియర్ SNKR!
అవును. నిజంగా అ_వసరమే కదా!
ధన్యవాదాలు.
Post a Comment