Saturday, February 28, 2009

స్కామాయణం-2

ప్రతీ సంవత్సరం, వ్యవసాయాధికారులూ, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్), జిల్లాల్లో లీడ్ బ్యాంకులూ కలిసి, యే పంటకి యెంత పెట్టుబడి అవసరం అవుతుంది, మిగిలిన వ్యయాలెంత అవుతాయి, సార్వాకి యెంత, దాళ్వాకి యెంత—ఇలా లెఖ్ఖలు వేసి, యెకరానికి ఇంత అని నిర్ణయిస్తారు. ఆ ప్రకారం బ్యాంకులు ఋణాలు మంజూరు చేస్తాయి. ఇక ఒక పద్ధతిలో, మామూలు జాగ్రత్తలు తీసుకుంటూ, ఋణాలు పంపిణి చేస్తాయి. ఇలా విడివిడిగా కాకుండా, ఒక కార్ఖానా కి అనుబంధంగా, వారి పంట ఆ కార్ఖానాకే ఇస్తామని, వారు చెల్లించే సొమ్ము బ్యాంకులో వారి ఋణ ఖాతాకి జమ కట్టవలసింది అనీ రైతులు ఒప్పందాలు చేసుకుంటారు. చక్కెర పంటకి చక్కెర కార్మాగారాలూ, పొగాకు కి పొగాకు బోర్డూ—ఇలా అన్నమాట. ఇవి తిరిగి వసూలవడం ఖాయం కాబట్టి, ఈ యేర్పాటు తో బ్యాంకులు ‘కళ్ళు మూసుకుని’ ఋణాలు ఇచ్చేస్తాయి! అంటే, నిజంగా కళ్ళు మూసుకుని కాదు—అంత నిశ్చింతగా అని! ఇలా ఇచ్చినా, తమ మామూలు జాగ్రత్తలు—పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదు చెయ్యడం, దస్తావేజు పాస్ బుక్ నకలు తీసుకుని అట్టే పెట్టుకోవడం, తాము యే సర్వే నెంబర్లలో యెంత విస్తీర్ణానికి యే పంటకి అప్పు ఇచ్చారో సంబంధిత తహసీల్దారు కార్యాలయానికీ, వ్యవసాయాధికారులకి తెలియ చెయ్యడం—లాంటివి తీసుకుంటాయి! నెలవారీ జరిగే సమావేశాల్లో, లీడ్ బ్యాంకు అధికారులూ, అన్ని బ్యాంకుల మేనేజర్లూ, అధికారులూ, జిల్లా అధికారులతో, కలెక్టరు సమీక్షిస్తూ వుంటారు! వీటిని బట్టే రాష్ట్రంలో యే పంట దిగుబడి యెంత వుంటుంది లాంటి అంచనాలు తయారు చేస్తారు! మరి ఇంత పకడ్బందీగా వ్యవహారం జరుగుతున్నప్పుడు, స్కాములకి ఆస్కారం యెక్కడ? సాధారణంగా, ఒక రైతుకి పంట ఋణం అందించాలంటే, బ్యాంకు ఉద్యోగికి కాగితాలు అన్నీ వున్నాయా లేదా, అన్ని చోట్లా సంతకాలు పెట్టారా లేదా అని సరి చూసుకొని, కంప్యూటరులో ఋణ ఖాతా తెరిచి, అందులోంచి రైతు పొదుపు ఖాతాలోకి డబ్బు జమ చేసి, తహసీల్దారుకి ఇతరులకీ పంపవలసిన నివేదికల్లో వివరాలు పొందు పరచడానికి కనీసం ఇరవై నిమిషాలు పడుతుందనుకుందాం. ఇంకా రైతులు సంతకాలు పెట్టిన ఋణ పత్రాలని ఖాళీలు పూరించడానికి ఇంకో పావు గంట పడుతుంది కానీ, వాటిని తరవాతెప్పుడో నింపుకుంటారు—సీజన్ అయి పోయాక! ఈ లెఖ్ఖన రోజూ యెంతమంది రైతులకి పంట ఋణాలు మంజూరు చెయ్యగలరు? పంట ఋణాల సీజన్ లో బ్యాంకుల దగ్గర వుండే రైతు సమూహాలని యెప్పుడైనా చూశారా?బ్యాంకు చుట్టూ వున్న అన్నిరకాల వ్యాపారాలూ మహజోరుగా సాగుతాయి! ఒక బ్యాంకు శాఖ అక్షరాలా అయిదువేల యేడువందల తొంభై యెనిమిది మందికి పంట ఋణాలు మంజూరు చేసిందంటే—ఒక్కొక్కడికీ కనీసం ఇరవై నిమిషాల చొప్పున యెన్ని వేల గంటలు పడుతుంది? ఇదసలు సాధ్యమేనా? సాధ్యం చేస్తున్నాయి మన బ్యాంకులు! ‘ఔట్ సోర్సింగు’ ద్వారా! మరి ఇక్కడే లొసుగులు వుంటాయి! (మిగతా మరోసారి)

2 comments:

krishna rao jallipalli said...

డియర్ క్రిష్ణా రావూ!

ఓ నెలక్రితం పుట్టిన నా మూడో మనవడు (కూతురుకి రెండో కొడుకు) కొంచెం నలతగా వుండడం వల్ల ఆంధ్ర జ్యోతి చదవడం తటస్థించ లేదు....
ఈ మీ పై కామెంటుకి నేను ఏదో యదాలాపంగా UCO BANK SIR అని అన్నాను . సారి అండి.. ఈ బ్లాగులు, రాతలు, స్కాములు ఎప్పుడు ఉండేవే, అంతులేనివి. ముందు మీ మనవడి ఆరోగ్యం ముఖ్యం. వీలు అయినప్పుడే తీరిగ్గా రాద్దురు గాని. మరొక్కసారి క్షమాపణలతో...

A K Sastry said...

డియర్ క్రిష్ణా రావూ!

మీ అత్మీయతకి ధన్యవాదాలు!

ఇవన్నీ మామూలే కదా! అయినా నేను వ్రాసేది--అందరూ నిద్రపోయాక, వార్తల్లో ఘోరాలు యేమీ లేవు అని చూశాక, టీవీ కూడా కట్టేసి--అప్పుడూ! ఆ సమయం లో నా బుఱ్ఱ పదునుగా కూడా వుంటుందిగనుక ఇబ్బందేమీ లేదు!