Wednesday, February 25, 2009

తెలుగులోనే మాట్లాడదాం!

ఇక రెండో విషయం యేమిటంటే, అప్పుడెప్పుడో బ్రహ్మానందరెడ్డి హయాం నించీ, వెంగళరావు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిపించడం, అలా అంజయ్య హయాంవరకూ తెలుగు అభివృద్ధికి చా………లా కృషి చేసేశారు! అందులో తెలుగు సాంకేతిక పదకోశం, నిఘంటు నిర్మాణం లాంటివి ఉన్నాయి! అదుగో అక్కడే జనం తెలుగంటే భయపడ్డం మొదలు పెట్టారు! ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్ అనడానికి ‘ధూమ శకట ఆగమన నిర్గమన నిర్దేశక స్వయం చాలిత సూచిక’ అనీ, ఇలాంటి ఘోరమైన అనువాదాలు బోళ్ళు చేసేసి, జనాన్ని తెలుగునించి పారద్రోలారు! ఇక అన్నగారు తెలుగువెలుగుల ప్రాంగణాలూ, లలితకళా తోరణాలు ఇలా కొన్ని శాశ్వత నిర్మాణాలు, చా…….లా కృషీ చేసి, మళ్ళీ తెలుగుకి ప్రాణం పోశారు! తెల్ల యేనుగులైపోయిన అకాడెమీలని రద్దేశారు! ఇంకా కొన్ని చేశారు! కానీ, యేకంగా బుద్ధుడి కాలానికి వెళ్ళిపోయి ‘దమ్మ మహా మాత్ర’ ల వంటివాటిని తీసుకొచ్చేసరికి, మన బ్యూరోక్రాట్ దొరలు తెలుగు వుత్తరాల్ని తెలుగు భాషలో ఇంగ్లీషు టైప్ రైటర్లపై వ్రాయించడం మొదలు పెట్టేసరికి, దీని కన్నా ఇంగ్లీషే నయం అనిపించింది జనాలకి! తరవాత, చెంద్రబాబు హైటెక్ ఆంధ్ర ప్రదేశ్ త్వరగారావాలని, తెలుగు ని నిర్లక్ష్యం చేశారు! మన వై యెస్ గారికి రామచంద్రరావు గానీ, సూరీడుగానీ “‘తెలుగు యజ్ఞం’ చేసి, దానిక్కూడా టెందర్లు పిలవచ్చు” అని సలహా ఇవ్వక పోవడంవల్ల ఆయన తెలుగు కి దూరంగా వున్నా, తమిళ తంబీల తొ ప్రెస్టేజీకి పోయి మరీ ‘ప్రాచీన భాష’ హోదా తెచ్చారు! (మరి వచ్చినె కోట్లని యెవరు నంజుకుంటున్నారో ఇప్పటివరకూ దాఖలాల్లేవు!) అసలు యేమి జరగాలి? మొదట మన తెలుగు పండితులూ, మీడియా ‘అన్య భాషా పదాల’ మీదున్న అపోహల్ని తొలగించుకోవాలి. మన భాష అనేక పదాల్ని పార్సీ, ఉర్దూ, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, డచ్చి, ఇంగ్లీషు, లాంటి స్వ/పరభాషల్లోంచే కాకుండా, ఇతర భారతీయ భాషల్లోంచి కూడా స్వీకరించింది! వాటిని అలాగే వాడచ్చు—అని ప్రచారం చెయ్యాలి. ఉదాహరణకి—రోడ్డు, రైలు, నకలు, అర్జీ, తనఖా, ప్రాంశరీనోటు—ఇలా! రెండవది, ప్రభుత్వ వ్యవహారాలన్నీ, తెలుగులోనే సాగాలి. తెలుగు లో అందిన అర్జీల మీద తెలుగులోనే దస్త్రం నిర్మించాలి. వుత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. కోర్టుల్లో కూడా వాద ప్రతివాదాలూ వచ్చీ రాని ఇంగ్లీషులోనో, సోకాల్డ్ స్పోకెన్ ఇంగ్లీషులోనో కాకుండా తెలుగులోనే జరగాలి. రికార్డులు కూడా తెలుగులోనే నిర్మించాలి. ఈ కంప్యూటరు యుగంలో, తెలుగు సాఫ్ట్ వేర్ వుండగా ఇది యేమాత్రం అసాధ్యం కాదు. కేవలం సంకల్పం వుండాలంతే! మరేదో ఇతర భాషా రాష్ట్రానికి వెళ్ళిన వాడికి ‘పురికొస’ కావలసి వస్తే, “ఈ వుడ్ లైక్ టు పర్చేజ్…’దిస్ థింగ్’…..ఆ…’వాట్ యూ కాల్’…..ఆ…..జ్యూట్ రోప్! ఆర్ జ్యూట్ త్రెడ్! నో నో జ్యూట్ ట్వైన్!” అంటే పరవాలేదు గాని, మన వూళ్ళో, మన వీధిలో కొట్టు దగ్గరకి వెళ్ళి, (బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి) ఇలా అడగడం హాస్యాస్పదం కాదూ? ఆలోచించండి!

13 comments:

krishna rao jallipalli said...

బ్యాంకులో పని చేస్తున్నానని అంటున్నారు కదా. మరి నిన్న నేడు ఆంధ్ర జ్యోతి లో వచ్చిన బ్యాంకు స్కాముల గురించి కొంచం ఎండ కట్టండి మహాశయా??

Unknown said...

మనం తెలుగు సంస్కృతితో జీవించాలనుకొంటున్నంత కాలం తెలుగు బ్రతికే ఉంటుంది. స్థానిక జీవనవిధానాలన్నీ ప్రమాదంలో పడ్డాయి. విజ్ఞాన, సంపద, పెట్టుబడుల వినిమయాలు వేగవంతమైనాయి. ఇది సస్టెయినబుల్ కాదన్న విషయాన్ని గుర్తించి స్థానిక సంస్కృతినే జీవన విధానంగా మలచుకొనే స్పృహ వచ్చిననాడు తెలుగు సహజంగా మనగలుగుతుంది. లేకుంటే అది మన నాయకమ్మణ్యుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి వస్తుంది.

మనలాంటి ఔత్సాహికుల కృషితో కొంత కదలిక వచ్చినా అది జీవనస్రవంతిగా ప్రవహించే వేగాన్ని సంతరించుకోదు.

మాతృభాష పట్ల మన స్పందనలు ఉద్వేగ పూరితస్థాయి నుండి ఎదగాలి. భాషతో పాటుగా జీవనవిధానాలను కూడా సంస్కరించుకోవాలి. కాపాడుకోవాలి.

netizen నెటిజన్ said...

మాస్టారు, వీటిల్లొ బేంకు, బ్యాంకు, బెంకు, బేంకు ఏది సరైనది. దీనికి ప్రత్యాయామ్న తెలుగు పదం ఉందా?

పద్మనాభం దూర్వాసుల said...

భాష,సంస్కృతి - ఇవి రెండూ ఒకదాని పైన ఒకటి ఆధారపడ్డవి.
ఇక పోతే, మనం ఏమి చెయ్యాలి అన్న విషయాలపై కొంత అవగాహన ఉన్నా, ఎలా చెయ్యాలన్న విషయంపై భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి.

A K Sastry said...

డియర్ క్రిష్ణా రావూ!

ఓ నెలక్రితం పుట్టిన నా మూడో మనవడు (కూతురుకి రెండో కొడుకు) కొంచెం నలతగా వుండడం వల్ల ఆంధ్ర జ్యోతి చదవడం తటస్థించ లేదు.

బహుశా మీరన్నది చాగల్లు పంచదార కార్ఖానా/బ్యాంక్ ఆఫ్ ఇండియా ల గురించి అనుకుంటా--అవునా?

తప్పకుండా వ్రాస్తాను.

నేను అనుకున్నది కాక పోతే, కొంచెం వివరాలు అందించండి. విజృంభిస్తాను!

సరేనా?

A K Sastry said...

డియర్ సీతారాం రెడ్డీ!

మీ స్పందనకి ధన్యవాదాలు!

మరి మన లాంటి మరో నలుగురు ఔత్సాహికుల్ని కూడగట్టడానికి ప్రయత్నిద్దామా?

యేమంటారు? సరేనా?

A K Sastry said...

డియర్ నెటిజన్!

మీ కోసం ఓ ప్రత్యేక టపా వ్రాస్తున్నాను!

చదవండి!

A K Sastry said...

డియర్ పద్మనాభం దూర్వాసులా! (అంటే బాగోలేదు) దూర్వాసుల గారూ!

'సంస్కృతి ' అనేది ఓ పడికట్టు మాటయిపోయింది!

మన సంస్కృతి అంటే యేమిటి? ఆడవాళ్ళకి పండగలకి రంగవల్లుల, వంటకాల పోటీలు పెట్టి, అందరికీ బహుమతులు ఇచ్చెయ్యడమా?

ఓ మైదానం లో సభ జరపదలచి, రోజూ అందులో ఆడుకొనే కుర్రాళ్ళు ఉచ్చలు పోసుకొనే చోటునే వాస్తు ప్రకారం వేదిక నిర్మించాలని నిర్ణయించి, వేదికనెక్కే ప్రతీవాడూ ముందు ఆ నేలని చేతితో తాకి, హృదయానికి హత్తుకొని, తరవాత ప్రతీ మెట్టు మెట్టుకీ చేతిని తాకించి, హృదయానికి హత్తుకొంటూ మైక్ దగ్గరకి వెళ్ళడమా? మన సంస్కృతి?

ఇలాంటివి చాలా చూసాము!

పోనీ, 'వేయి ఫడగలు ' నాటి ఆంధ్ర సంస్కృతికి వెళ్ళగలమా?

ఆలోచించండి!

కొత్త పాళీ said...

మిగతా సంగతంతా యేమో గానీ చివరి పేరా సూపరు. :)

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

ధన్యవాదాలు!

నిజంగా అలాంటివాళ్ళు లేరంటారా!

krishna rao jallipalli said...

UCO BANK SIR

A K Sastry said...

డియర్ క్రిష్ణా రావూ!

చాగల్లు పంచదార కార్ఖానాయే కదా? అందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు కూడా వినబడినట్టు గుర్తు! అందుకే అలా అన్నాను. నా స్కామాయణం లో కూడా అదే పేరు ఉపయోగించాను అనుకుంటా!

దయచేసి సవరించుకో వలసింది! పొరపాటుకి క్షంతవ్యుణ్ణి!

Praveen Mandangi said...

తెలుగులో మాట్లాడితే సరిగా అర్థం కాదండీ. మొన మా పని మనిషి కుంచె అనే పదం వాడితే తెలుగు పుస్తకాలు చదివే నాకే అర్థం కాలేదు. తరువాత అర్థమయ్యింది, కుంచె అంటే బ్రష్ అని. ఆమె సాలీడు గూళ్ళు దులిపే బ్రష్ అడిగింది.

ఆ మధ్య నేను తూలిక అంటే ఏమిటి అని మాలతి గారిని అడిగితే ఒక తెలుగు పండితుడు తూలిక అంటే ఏమిటో తెలియదా అని ఆశ్చర్యంగా అడిగాడు. నిజంగా ఆ పదానికి అర్థం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు.

తెలుగులో మాట్లాడితే అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు తెలుగుకి ప్రయారిటీ తగ్గించడంలో తప్పు లేదనే అనుకుంటాను.