Sunday, February 15, 2009

మన తెలుగు

అన్నమయ్యకి తెలుగు రాదా?
నా సమాధానం—ఖచ్చితం గా వచ్చు! ఆయన మాతృ భాషే తెలుగు! ఆయన పదకవితలు వ్రాసింది జాను తెలుగులో! కాని—ఈ జానుతెలుగుని వక్రీకరించారు మన పండితులు. శ్రీగిరి శ్రీపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య పీఠం స్థాపించి ఆయన తాటాకుల మీద వ్రాసిన, వాళ్ళ కొడుకు రాజుగారి సహాయం తో రాగి రేకుల మీద చెక్కించిన పదకవితలని పరిష్కరించమంటే, వాళ్ళు చేసిన నిర్వాకమది! ‘అదివో అల్లదివో….’ పాటనే తీసుకోండి—‘పదివేల శేషులు’ యెక్కడనించి వచ్చారు? వున్నది ఒక్కడే ఆది శేషుడు, వాడికున్నది పదివేల పడగలూ! అసలు ఆయన వ్రాసిన ‘పదివేలు శేషుని’ ని ఇలా పరిష్కరించారన్నమాట! ‘పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్య!’ అట! అన్నమయ్య కాలంలో దోమలు వున్నాయో లేదో తెలియదుగాని, దోమ తెరలు మాత్రం ఖచ్చితం గా లేవు! మగవాళ్ళూ ఆడవాళ్ళూ కూడా మొలచుట్టూ పంచెలూ, చీరలూ ధరించేవాళ్ళు! శ్రీ కృష్ణ దేవరాయలంతటివాడే, మట్టులాగూలు వేసుకునేవాడు లేదా పంచెని ఆ ఆకారం లో కట్టుకునే వాడు. కావాలంటే తన భార్యలతో సహా ఆయన చెక్కించుకున్న విగ్రహాలని హంపీలోనూ, శ్రీపతి లోనూ చూడచ్చు! యెప్పుడో విదేశీయులు వచ్చినప్పుడు మాత్రం, పారశీకం నించి వర్తకులు తెచ్చిన పొడవాటి అంగీనీ, రంగు పంచెనీ ధరించి, తలపాగా మీద తురాయితో కనిపించేవాడట. మరి అలాంటి రోజుల్లో, దోమతెరలెక్కడనించి వచ్చాయి? పైగా పన్నగానికి, దోమతెరకి సంబంధం యేమిటి? ఆయన వ్రాసినది—‘పగడంపుదౌను తెర’ అనీ. ఇలాంటివి చాలా వున్నాయి. విజ్ఞులు మార్పులు చేయిస్తే, తెలుగు భాషకి యెంతో సేవ చేసినవారవుతారు. ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు—ఆ పదకవితలకి విస్తృత ప్రచారం తెచ్చింది మాత్రం వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ వెయ్యో సంవత్సరం ఉత్సవాలో యేవో చేస్తారట! శుభం!

2 comments:

నాగప్రసాద్ said...

good post.
>>"విజ్ఞులు మార్పులు చేయిస్తే, తెలుగు భాషకి యెంతో సేవ చేసినవారవుతారు."

ఎవరో ఎందుకు, వీలు కుదిరినప్పుడు మీరే ఆ మార్పులు చేసి బ్లాగులో పెట్టండి. అన్నిటినీ కలిపి PDF format లోకి మార్చి నేను భద్రపరుస్తాను.

A K Sastry said...

చాలా సంతోషం డియర్ నాగప్రసాద్! ధన్యవాదాలు! కానీ అన్నమాచార్యులు వ్రాసిన దాదాపు 32 వేల కీర్తనల్ని పరిష్కరించడం ఒక్కడి వల్ల అవుతుందా? పైగా ఆ రాగి రేకులూ, తాళ పత్రాలూ మనకందుబాటులో లేవే! ఆయన మీద పరిశోధనలు చేసి పీ హెచ్ డీ లు తెచ్చుకున్న వాళ్ళు లేదా 'వెయ్యేళ్ళ ఉత్సవ ' కమిటీ లాంటివో, ప్రభుత్వమో, శ్రీగిరి శ్రీపతి దేవస్థానమో చెయ్యాల్సిన పని అది!

కానీ ప్రయత్నిస్తాను! ఒక ఆడుగంటూ ముందుకు వేస్తే కదా ముందుకు కదిలేది!