Sunday, January 23, 2011

ఆంగ్ల సంవత్సరాది - 4



.....వచ్చిన 2011

3. మల్టీప్లెక్సులు మామూలు థియేటర్లని మింగేశాయి. ఇంకేమి మింగబోతున్నాయి? ఇంకా సినిమాలు తీస్తూనే వుంటారా? కోట్లలో ములిగి, పైరసీని తిడుతూనే వుంటారా? పాత నటులూ, దర్శకులూ వగైరాల ముని మనవళ్లు వగైరా కూడా నటజీవితాలు ప్రారంభిస్తారా?

జ : దీనికి సమాధానం--ఖచ్చితంగా అవును. 

కొత్త ఓ మోజుగా, మల్టీప్లెక్సులకి కొంతమంది వెళుతున్నారు....కాస్త వినోదం కోసం. పైగా ఆన్ లైన్, ఫోన్ రిజర్వేషన్లు వుండడంతో డబ్బులుపోయినా, శ్రమ తగ్గుతోంది. 

కొత్త మోజు పోయాక, పాతొక రోత అవక మానదు కదా? అప్పుడు ఇదివరకటి వీడియో పార్లర్లలా డీవీడీ పార్లర్లు పెట్టి, పదిరూపాయల టిక్కెట్టుతో సినిమాలు చూపించుకోవాలి వ్యాపారం జరగాలంటే.

కళపేరుతో జరుగుతున్న ఫక్తు వ్యపారం కాబట్టి, తీస్తూనే వుంటారు. ఖర్చు తగ్గి, వచ్చే లాభమంతా తమ 'ఫేమిలీ'లోనే వుండాలి కాబట్టి, ముని మనవళ్లూ, వాళ్ల ముని మనవళ్లూ హీరోలవుతూనే వుంటారు, కోట్లలో ములిగి, పైరసీని తిడుతూనే వుంటారు. మాఫియా పెట్టుబళ్లు పెరుగుతూనే వుంటాయి, కిడ్నాప్ లూ, సుపారీలూ, మర్డర్లూ జరుగుతూనే వుంటాయి.

అదండీ సంగతి.

.......మిగతా మరోసారి.

Wednesday, January 19, 2011

ఆంగ్ల సంవత్సరాది - 3

......వచ్చిన 2011

2. మోర్ లూ, మాగ్నాలూ వగైరా మన వీధి చివరి చిల్లరకొట్లనేకాదు, చిన్న చిన్న 'డిపార్ట్ మెంటల్ స్టోర్లు' అనబడే ఆధునిక చిల్లర కొట్లనీ, ఇంకా పెద్ద స్థాయి "చెర్మాస్", "చందనా బ్రదర్స్" లాంటివాటిని కూడా మింగేస్తాయా?

జ : ఇది కూడా పూర్తిగా అసాధ్యం. 

యెందుకంటే.....

వుత్పాదిత వస్తువులని వినియోగదారుకి చేర్చే "వాణిజ్యం" లో ముఖ్యమైన లింకులు 'హోల్ సేలర్స్', 'రీటెయిలర్స్'. వాణిజ్యం మొదలైనప్పటినుంచీ, కొన్ని వందల సంవత్సరాలుగా వీళ్లు వున్నారు. ఈ రీటెయిలర్స్ లో--డిపార్ట్ మెంటల్ స్టోర్లూ, చైన్ స్టోర్లూ, మెయిల్ ఆర్డర్ బిజినెస్లూ, చిల్లర కొట్లూ, హాకర్లూ, పెడలర్లూ--ఇలాంటివి భాగాలు.

డిపార్ట్ మెంటల్ స్టోర్లు అంటే 'గుండుసూది దగ్గరనించీ, మోటార్ కారు వరకూ' అన్ని వస్తువులూ 'ఒకే కప్పుక్రింద' దొరికే దుకాణం--అని ఓ పెద్ద పేరు. "బ్లూమింగ్ డేల్స్" "టిఫ్ఫనీస్" మొదలైనవి ఇలాంటివి. (మోర్లూ అవీ దాదాపు ఇలాంటివే. రిలయన్స్ లాంటివాళ్లయితే, 'బ్యాక్ వర్డ్ ఇంటెగ్రేషన్' కి కూడా వెళ్తున్నారు.) 

చైన్ స్టోర్స్ అంటే, ఒక కంపెనీ, తన వుత్పాదనలని, తన బ్రాండుతో, అనేక పట్టణాల్లో, తానే దుకాణాలు తెరిచి, యేజంట్ల ద్వారా అమ్ముకోవడం. "బాటా" ఓ చక్కని వుదాహరణ. ఇప్పుడు ఇవీ లేవు. దానికి అనేక కారణాలు.

మెయిల్ ఆర్డర్ అంటే, యెక్కడో ఓ దుకాణం పెట్టుకొని, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, పోస్టు ద్వారా ఆర్డర్లు స్వీకరించి, వస్తువులని వినియోగదారులకి పోస్టులోనే పంపించడం. (ఇప్పుడు "ఆన్ లైన్" షాపింగులు కూడా). వుదాహరణకి, "బర్లింగ్టన్స్" లాంటివి. మనదేశంలో ఓ నలభయ్యేళ్లక్రితమే, "15 రూపాయలకే ట్రాన్సిస్టర్" అని, గడ్డి పంపించడం లాంటివాటితో అప్రతిష్ట పాలయ్యాయి.

హాకర్లూ, పెడలర్లూ అంటే బళ్లమీదా, సైకిళ్లమీదా వీధుల్లో అరుచుకొంటూ అమ్ముకునేవారు. వీళ్లు అప్పటికీ, ఇప్పటికీ తమ వ్యాపారం సాగిస్తూనే వున్నారు. యెటొచ్చీ, మనుషులు మారుతూ వుంటారు--బాగుపడిన వాళ్లు స్థిర దుకాణాలు పెట్టుకొంటే, పడని వాళ్లు వ్యాపారం మానేస్తారు. ఆ స్థానం లో మరొకరు వస్తారు.

ఇక మిగిలినది "చిల్లర కొట్ల" వాళ్లే. వీళ్లకి వున్న అనుకూలత యేమిటంటే, ప్రతీ వీధి చివరా, అందరికీ అన్ని సమయాల్లోనూ, అందుబాటులో వుండడమే. మూడ్డబ్బుల బెల్లం, కానీ కాప్పొడుం కొనుక్కొనే వాళ్ల దగ్గరనించీ, పావుకేజీ పంచదారకోసం బజారుదాకా యేమి పోతాం అనుకునే వాళ్ల వరకూ అక్కడికే వెళతారు!

వీళ్లు యెన్ని తుఫాన్లు వచ్చినా, వొరిగి వుంటూ, మళ్లీ నిలబడే గడ్డి మొక్కల్లాంటివాళ్లు. అందుకే వీళ్లకి ఢోకా లేదు. 

ఇక చర్మాస్, చందనాస్ లాంటివాళ్లు వాళ్ల ప్రత్యేకతల్ని నిలబెట్టుకుంటూ, "యెక్కడికో దూరంగా వెళ్లి యెందుకు మోసపోతారు మీరు? మేం మీకు అతి దగ్గరలోనే వుండగా!" లాంటి ప్రకటనలు ఇవ్వకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నంతకాలం, వాళ్లకీ ఢోకా లేదు.

.....మిగతా మరోసారి.

Tuesday, January 18, 2011

ఆంగ్ల సంవత్సరాది - 2

.....వచ్చిన 2011

ఆ సందర్భంగా నేను సంధించిన ప్రశ్నలకి యెవరూ సమాధానం వ్రాయలేదు. సరే. ఇక నేను వ్రాయక తప్పదు కదా?

1. డీ టీ హెచ్ లూ, టాటా స్కైలూ మన కేబుల్ టీవీలని మింగేస్తాయా?

జ : ఇది పూర్తిగా అసాధ్యం. 1985 లో మొట్టమొదటిసారి మన దేశంలో ముంబాయిలో ప్రెవేశించిన కేబుల్ టీవీ వల్లే, ఈనాటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో సైతం, 90 శాతం ప్రజలు కేవలం నెలకి ఓ 50 రూపాయలతోనే, తమకి ఇష్టమైన ఛానెళ్లు చూస్తున్నారు. చాలామంది 'పెయిడ్' ఛానెళ్లుకూడా ఇస్తున్నారు. (స్కై వాళ్లు అవి ఇవ్వరు.) పైగా, ఓ ఫోను చేస్తే చాలు, సర్వీస్ కోసం కేబుల్ వాళ్లు వాలిపోతారు! (స్కై లకి అది అసాధ్యం!) అందుకే ఇది జరిగేపని కాదు మరి!

......తరువాతవి మరోసారి.

Monday, January 17, 2011

మన ఆర్థికం, ఆధ్యాత్మికం

విశేషాలు, వింతలు

హమ్మయ్య! డిసెంబరు 31 తరవాత జనవరి 1 మాత్రమే వచ్చింది. అంతే కాదు, సంక్రాంతి పండుగ కూడా ప్రశాంతంగా జరిగింది--పిచ్చి రాజకీయ నాయాళ్లు యెవరూ వాళ్ల చేతుల్లోని రాళ్లు విసర లేదు మరి!

ద్రవ్యోల్బణం పెరుగుతూనే వుంది, అయినా పెట్రోలు రేట్లు పెరిగాయి....! 

కూరగాయల ధరలు పెరుగుతూనే వున్నాయి....అప్పుడప్పుడూ కొంచెం తగ్గినా.

డిసెంబరు 31 న, మన రాష్ ట్రంలో రూ.135 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందట.

కనుమురోజున, ప.గో.జిల్లాలో ఒక్కరోజునే కేజీ 90 రూపాయల చొప్పున, రూ.5.50 కోట్ల విలువైన "కోళ్లని" తినేశారట!

(మొన్న కార్తీక మాసం సందర్భంగా, చాలామంది మాంసాహారం మానెయ్యడంతో, కూరగాయల రేట్లు పెరిగినా, పోనీలే--కొన్ని జీవాలు కొన్ని అదనపు రోజులు బతుకుతున్నాయి--అని సంతోషించాం! ఇప్పుడు రెట్టించిన వుత్సాహంతో, సం హారాన్ని సాగిస్తున్నారన్నమాట! అయినా, సంవత్సరం లో ఓ 30 రోజులు కార్తీకం లోనూ, ఓ 52 రోజు లక్ష్మివారమో, శనివారమో అంటూనో మానేసి, మిగిలిన 283 రోజులూ--కోళ్లూ, మేకలూ, చేపలూ, గుడ్లూ, గొడ్లూ, పందులూ తినేస్తూ వుంటే, దక్కే పుణ్యమెంతో మరి!)

ఏలూరు ఆర్ ఆర్ పేటలో, బాలాజీని "నవనీత" అలంకారం చేశారట--సంక్రాంతి సందర్భంగా. యెంతోకాదు ఓ 18 కేజీల వెన్నని పామారట విగ్రహానికి. నెయ్యి ధర ఇప్పుడు కేజీ 350 వుంది. 18 కేజీలకీ ఆరువేల చిల్లర అవుతుంది. వెన్నకూడా కొంచెం అటూ ఇటూ వుండొచ్చు. ఇచ్చినవాళ్లకి అది పెద్ద మొత్తం కాకపోయినా, బొట్టు బొట్టూ కలిసి సముద్రమైనట్టు, యెంత 'నేషనల్ వేస్ట్' జరుగుతోందాని వూహించుకోవచ్చు.

ఇంక, నరసాపురంలో పురాతన ఆలయం "ఆదికేశవ ఎంబెరుమన్నార్ స్వామి" కోవెల. దదాపు 300 యేళ్లక్రితం, వూరు కూడా యేర్పడనప్పుడు ఆ కోవెల నిర్మాణం జరిగిందంటారు. యెంబెరుమన్నార్ అనే ఆయన అప్పటి మద్రాసు రాష్ ట్రం నించి వచ్చి, ఇక్కడ ఆదికేశవ, ఆదిలక్ష్మీ అమ్మవార్ల ప్రతిష్ఠ చేసి, కోవెల కట్టించాడు. తరవాత ఆయన విగ్రహం కూడా అక్కడే ప్రతిష్టించబడింది.

అలాంటి కోవెలే, శ్రీపెరంబుదూరులో వుందని, రాజీవ్ హత్య జరిగినప్పుడు తెలిసింది అందరికీ!

వాళ్ల పథకంలో భాగంగా, తమిళ వైష్ణవుల దాడి సాగుతోంది ఈ కోవెల మీదా, ఆంధ్ర వైష్ణవులమీదా. కోవెలలో రాతిలో చెక్కివున్న "ఎంబెరుమన్నార్" అనే పేరులో "నా"వత్తుని తొలగించేశారు. ఆ వొత్తుని పూడ్చేసి, నల్లరంగు పామేశారు! యెందుకు అంటే, "తమిళ పండితులు అదే సరైనది, వెంటనే మార్చండి" అన్నారట!

మరి మన్నార్ జలసంధినీ, మన్నార్ సింధుశాఖనీ కూడా మార్చేస్తారా? యెందుకు? ఇప్పటికే మీడియావారు మన్నార్ ని మున్నార్ చేసేశారు. ఎంబెరుమన్నార్ ని ఎంబెరుమానార్ చేసేశారు!

ఇంక, ఇన్నేళ్లనించి--వెంకటాచార్యులు, రామాచార్యులు, సూర్యనారాయణాచార్యులు, సుదర్శనాచార్యులు--ఇలాంటి తెలుగు పేర్లే వుంటున్నా, తరవాత తరాలకి 'రంగ రాజన్'; 'శ్రీనివాసన్' ఇలా తమిళ పేర్లు పెడుతున్నారు!

మరి ఆంధ్ర వైష్ణవులకన్నా, తమిళ వైష్ణవులు యేవిధంగా గొప్పో?

ఆ కోవెలలో, సంక్రాంతి సందర్భంగా, యెనిమిదిరకాల 'అన్న ప్రసాదాలు' నైవేద్యం పెట్టి, భక్తులకి పంచిపెట్టారట.

అవీ విశేషాలు.

తాజా కలం : స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచినవి ఓ 70 లక్షల కోట్లు (యెన్ని 2జీ లో! యెన్నిరాష్ట్రాల యెన్ని యేళ్ల బడ్జెట్లో!) అని చెప్పాడట "వికీలీక్స్" వాడు!

Monday, January 10, 2011

ఆంధ్ర భవితవ్యం

కొన్ని నిజాలు

యేమాటకామాటే చెప్పుకోవాలి! పాపం ఇందిరాగాంధీ మనిషి చాలా మంచిదే (గుణమే.....అని నేననలేదండోయ్!).

ఆంధ్ర ప్రదేశ్ గురించి ఆవిడ అభిప్రాయాలు చూడండి......

"వేలాది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విభిన్న సంస్కృతుల కేంద్రంగా విలసిల్లింది. రాష్ట్రంలో నేడున్న అన్ని ప్రాంతాలు చరిత్రలో చాలాకాలంగా ఒకే గొడుగు కింద ఉన్నాయి. తెలుగు ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దశాబ్దాలుగా పోరాడటానికి ఈ సుదీర్ఘచరిత్రే కారణం కావొచ్చు."

"భాషా ప్రయుక్త రాష్ ట్రాల అంశం జాతీయోద్యమంలో ఓ భాగమనేది వాస్తవం. దీన్ని విస్మరించలేం. ప్రస్తుతం మనుగడలో ఉన్న ప్రతి ప్రాంతం ఒకప్పుడు భాషా ప్రాతిపదికన ఏర్పడినదే. వివిధ రాష్ట్రాల ఏర్పాటులో విస్తృతమైన హేతుబధ్ధత ఉంది. క్షణికావేశంలో ఈ పునాదికి బీటలు పడకుండా చాలా జాగ్రత్తగా వుండాలి."

"సమైక్య రాష్ ట్రానికే నేను కట్టుబడి ఉన్నాను. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయన్నది ఇక్కడ అంశం కాదు. మీరు ఎవరో ఒకరికి పొరుగువారిగానే వ్యవహరించాలి. అనేక అంశాల్లో పరస్పరం పరిష్కరించుకోవాలి. విడిపోవడం ద్వారా ఈ ప్రజలను మనం వదిలించుకున్నామనో...లేదా సమస్య నుంచి తప్పించుకున్నామనో అనుకోవడం చాలా తప్పుడు అభిప్రాయం. అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం!"

ఇలా నిష్కర్షగా తన అభిప్రాయాన్ని యెందుకు చెప్పదు కాంగీ (సోనియా) పార్టీ?!

1973 లో ప్రత్యేక ఆంధ్రోద్యమం చివరి రోజుల్లోనో, రాష్ ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాకో ఆవిడ చెప్పిన పై మాటలు సహజంగా యువకులమైన మాకు యేమాత్రం రుచించలేదు....నచ్చలేదు!

ఇప్పుడు వింటే, యెంతబాగా చెప్పిందో! అనిపిస్తుంది.

ఇప్పటి యువత సంగతీ, ఓ పాతికేళ్ల తరవాత ఇంతే అంటే కాదంటారా?

Sunday, January 9, 2011

కాంగీల నిర్వాకం

ద్రవ్యోల్బణం

గత డిసెంబరు నెలాఖరుకల్లా 7 శాతానికీ, ఈ మార్చి కి 6-6.5 శాతానికి "ద్రవ్యోల్బణం" దిగి వస్తుందని రంగరాజన్ ప్రకటన వెలువడి ఇంకా మూడు రోజులు కాలేదు!

నవంబరులో 7.75 శాతం గా నమోదైన ద్రవ్యోల్బణం, ఆయన చెప్పినట్టే దిగి వస్తుందనుకోడానికి--నవంబరు 27 న 8.69 శాతం గా వున్న "ఆహార ద్రవ్యోల్బణమే", డిసెంబరు 18 నాటికి 14.44 శాతానికీ, 25-12-2010 నాటికి 18.32 శాతానికే చేరిందే!!!!

పాత ఆర్థిక మంత్రీ, తమిళ నారదుడూ చిదంబరం (ఆమాటంటే వాడొప్పుకోడు--వాడి దృష్టిలో నారదుడు ఆర్యుడు!) 'ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకొంటోందా?' అని అనుమానం వస్తోంది అంటున్నాడు.

వుల్లిపాయనించీ, కారు వరకూ అన్నిటి ధరలూ పెరిగాయి! (ఇదంతా ఇంకా డీజిల్ ధరలు పెంచకుండానే!)

'రాష్ట్ర ప్రభుత్వాలూ! సరైన చర్యలు తీసుకోండి. స్థానిక పన్నుల్ని రద్దుచెయ్యండి. అక్రమనిల్వదారుల భరతం పట్టండి' అంటూ గర్జిస్తోంది వృధ్ధ సిం హం ప్రణబ్!

మోర్ లూ, మాగ్నాలూ, స్పెన్సర్లూ వగైరాలు--రేట్లు తక్కువగా వున్నప్పుడు కొనేసి, నిలవ చేసుకొని, ఇప్పుడు రేట్లు 'భారీగా' పెరిగాక, 'బారీ' డిస్కవుంట్లతో అమ్మేసుకొంటూ, 'ఫ్యూచర్లూ' వగైరాలలో ఇంకో మూడు నెలల వరకూ రేట్లు పెరుగుతూనే వుండేలా 'ఆప్షన్లు' పెడుతున్న వాళ్లని 'వృధ్ధ సిం హం' యేమైనా చెయ్యగలదా? అని అడగకండి మరి! 

ఇంకో ప్రక్క స్టాక్ మార్కెట్ పడిపోయి, విదేశీ పెట్టుబదులు వెనక్కి వెళ్లిపోతే, రూపాయి బలహీనపడి, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది!

"నీ గుడ్లు అన్నీ ఒకే బుట్టలో పెట్టుకోవద్దు" అని ముసలి ఆంగ్లేయులు చెప్పేవారట! అదికూడా తెలియదు మన కాంగీలకి. పాకిస్థాన్ నుంచి రోజుకి 300 టన్నుల చొప్పున దిగుమతి అవుతున్న 'వుల్లిపాయల ' ని నిషేధించిందట 06-01-2010 న పాకిస్థాన్ హఠాత్తుగా! అందుకనే ధరలు పెరుగుతున్నాయనీ, వాళ్లతో మాట్లాడుతున్నామనీ, వాఘా బోర్డరు దగ్గర ఆగిపోయిన దాదాపు 300 లారీల (యెన్ని టన్నులో?) వుల్లిపాయలూ త్వరలో వస్తాయనీ, ఆశాభావం వ్యక్తం చేశారట--అమాత్యులు ఎస్ ఎం కృష్ణ! (దానికి ప్రత్యామ్నాయంగా కసబ్ నే ఇచ్చేస్తారో, కాశ్మీర్నే ఇచ్చేస్తారో మరి!)

అదివరకు "ప్రభుత్వం దగ్గర నిధులు పేరుకుపోయాయి.....అందుకే ద్రవ్య లభ్యత 'కఠినంగా' మారింది" అన్న ఆర్బీఐ మాటపై, ప్రభుత్వం కొన్ని బ్యాంకులకి 5000 కోట్లకి పైగా 'అదనపు మూలధనం'గా ఇచ్చీ, తన వ్యయాన్ని బాగా పెంచీ, ఈ త్రైమాసికం లో ద్రవ్య లభ్యతని పెంచుతోంది! 

ఇంకో ప్రక్క, బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు అప్పుడో పది పైసలూ, అప్పుడో పావలా పెంచుతూ, అసలు వడ్డీ యేమీ ఇవ్వకుండా ప్రజలని మోసం చేస్తూ, దండుకుంటూనే వున్నాయి. అది కాకుండా, అన్ని బ్యాంకులూ కలిసి, రోజూ 1,50,000 నించీ 1,60,000 కోట్లవరకూ రిజర్వ్ బ్యాంకు నించి రివర్స్ రెపో మీద తీసుకుంటున్నాయి! 

మరి ఈ డబ్బంతా యెక్కడికి పోతూంది?   

ఇంకెక్కడికి--మన మార్కెట్లలోకే! ఆ డబ్బులో వుత్పాదక రంగానికి పోతున్నదెంత? అందుకే ద్రవ్యోల్బణం!

అసలు మన ఆర్బీఐ, నాటకాలాడకుండా, ఒకేసారి ఓ రెండు శాతమో యెంతో అన్ని రేట్లనీ పెంచేసి, వ్యవస్థకి ఓ షాక్ ఇస్తే, పదిహేనురోజుల్లో అన్నీ చక్కబడవూ?

"......ఖుదరదు!" అంటారు మన కాంగీలు!

అయినా, సోనియా దగ్గరనించీ, మన్మోహన్ దగ్గరనించీ, మంత్రుల దగ్గరనించీ, ముఖ్యమంత్రుల దగ్గరనించీ, ఇతర మంత్రులవరకూ, "మా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పాం!" అంటారేమిటో? 

మీకేమైనా అర్థం అవుతోందా?

Friday, January 7, 2011

కాంగీ పార్టీ - 5

.....నా వ్యాఖ్యలు

5. ఇందిరా గాంధీ సైతం, రష్యాతో స్నేహం పాటిస్తూ, అమెరికాని కట్టడి చెయ్యడానికి అవసరమైనప్పుడు వాజపేయీ ని పంపించేది! మన నిర్వాకం యేమిటి మరి?

6. చూపదు మరి! అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలోది కాదనీ, కాశ్మీర్ వాళ్ల వీసాల మీద కాకుండా వేరే కాయితాలపై స్టాంపులు వేస్తున్నా, మన అధికారులకీ వాళ్లకీ వీసాలు నిరాకరించీ, పటాల్లో ఆ ప్రాంతాలన్నీ మినహాయించి తన యిష్టం వచ్చినట్టు ప్రచురించీ--ఇలా చేస్తుంటే, మన నిర్వాకం యేమిటి?

7. అదేదో ఇప్పుడే కళ్లు తెరిచినట్టు! వేణుగోపాలరెడ్డి చేతులు కట్టేసినప్పుడు తెలీదా ఈ సంగతి? (నేను మూడేళ్ల క్రితమే--మాంద్యం, ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెరుగుదల, తెలంగాణా మొదలైన దరిద్రాలు 'కాంగీ' ప్రభుత్వ హయాములోనే యెందుకు వస్తాయి? అంటే, కొంతమంది 'మోకాలికీ, బోడిగుండుకీ ముడేశా'నన్నారు! ఇప్పుడేమంటారు?)

ఇంక అవాకులూ, చెవాకుల విషయానికొస్తే.....

1. లోక్ నాయక్ స్పష్టంగా నిర్వచించాడు తన సంపూర్ణ విప్లవ సిధ్ధాంతాన్ని. ఆయన వుద్యమం రాజ్యాంగ విరుధ్ధం, అప్రజాస్వామికం అనడం వీళ్లకే చెల్లింది. అలా అయితే, ఎమర్జన్సీ విధించవలసినంత అవసరం యెందుకు వచ్చింది? ఆయన మీద లాఠీ ఛార్జ్ చేసే అవసరం యెందుకు వచ్చింది? ఇందిర పతనం యెందుకు అయ్యింది?

2. బీహార్ సంగతి మాట్లాడ లేదెందుకో?

3. ఆ స్థిరత్వమెంతో, అవిశ్వాస తీర్మానాలప్పుడూ, ఇప్పుడు పార్లమెంటు స్థంభించడం లోనూ తెలియడం లేదూ?

4. ఆవిడ త్యాగం యెంతవరకు అంటే, బాధ్యతల్లేకుండా అధికారం అనుభవించడం వరకే అని అందరూ తెలుసుకున్నారిప్పటికి!

5. మద్దతులూ, పొత్తులూ అంటూ చివరిదాకా తేల్చకుండా, కొన్ని పార్టీలని ముంచి, వోట్లు చీలడంతో అన్ని సీట్లు వచ్చాయని వాళ్లకీ తెలుసు. అందుకేనేమో--బాబా రామ్ దేవ్ కూడా పార్టీ పెడతానంటున్నాడు!

చివరిగా--ఈ పుస్తకం సంపాదక బృందంలో నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ డైరెక్టరు కూడా సభ్యుడట! పబ్లిక్ సర్వెంట్ పార్టీ పని చెయ్యచ్చా? అంటే, తప్పులేదంటారేమో వీళ్లు! అధికార దుర్వినియోగం వాళ్లకి వెన్నతో పెట్టిన విద్యే కదా!

Thursday, January 6, 2011

కాంగీ పార్టీ - 4

.....నా వ్యాఖ్యలు

4. పచ్చి నిజమే ఇది....కానీ, 'రాజీవ్......మ్యానిఫెస్టోలో.....' అంటూ మళ్లీ డబ్బా! అది వ్రాయించినవాడు పీవీయే అని వ్రాయరు!

ఆయన హయాం లోనే బాబ్రీ మసీదు కూలిందనే వంకతో, మైనారిటీల బుజ్జగింపులో భాగం గానే, ఢిల్లీలో ఆయన సమాధికీ, ఆయనకివ్వవలసిన గౌరవానికీ చెల్లుపెట్టి, ఆయన్నో 'అస్పృశ్యుడు' గా చూసినవాళ్లే, ఇప్పుడేదో ఓ మూలనించి 'ఆంధ్రుల ఆత్మగౌరవం' అని వినిపిస్తూంటే, రాజీవ్, అంజయ్యా ఙ్ఞాపకం వచ్చి, ఇప్పుడు ఆయన్ని కొంత పొగుడుతున్నారు!

ఆఫ్టరాల్, ఆయన వీళ్ల దృష్టిలో చేసిన తప్పు "రాజ్యాంగ బధ్ధంగా వ్యవహరించి" కళ్యాణ్ సింగుని తొలగించక పోవడమే!

జగజ్జీవనరామ్ నివసించిన 'భారీ బంగళా' ని ఇప్పుడుకూడా ఆయన కూతురు స్పీకర్ మీరాకుమార్ అధీనం లోనే (ఆవిడకి కేటాయించిన సువిశాల భవనానికి అదనం గా!) వుంచారు--దళితులని బుజ్జగించడానికి. అదే, పీవీ మరణించిన వెంటనే, ఆయన నివసించిన భవనం నించి ఆయన కుమారుణ్ణి తన్ని తగిలేసి వెళ్లగొట్టారు!

అదీ.....ఈ కాంగీల సంస్కృతి!

మిగతా మరోసారి.

Wednesday, January 5, 2011

కాంగీ పార్టీ - 3

.....నా వ్యాఖ్యలు

తన అత్తగారు పెద్ద పత్తిత్తు అనీ, నాటి ఘోరాలు--విద్యార్థి రాజన్ హత్య, స్నేహలతారెడ్డి కేసు వగైరాలన్నింటికీ--సంజయ్ నే బాధ్యుడు అని ఇప్పుడు ఈ పుస్తకంలో తేల్చింది సోనియా!

మరి, నవీన్ చావ్లాలూ, ఆర్ కే (వె)ధావన్ లూ, ఆవిడ అండలేకుండానే చెలరేగిపోయారా?

మన దేశం లో ఎమర్జెన్సీ అనే చీకటి యుగానికి బాధ్యురాలు కేవలం ఇందిరా గాంధీ మాత్రమే!

3. "మిస్టర్ క్లీన్" గా అభివర్ణించబడిన రాజీవ్ గాంధీ, 'వ్యవస్థ ప్రక్షాళనకి' వుపక్రమిస్తే, కొంతమంది 'అధికార దళారులు'; కాంగ్రెస్ 'వృధ్ధ నాయకులు' అడ్డు పడ్డారట.

తన చుట్టూ యువ రక్తాన్ని నింపుకొంటున్నాననుకొని, యెవరు యే సలహా ఇస్తే దాన్ని ఆలోచనలేకుండా పాటించి, శిలాన్యాస్ లాంటి వేషాలు వెయ్యడమేకాకుండా, భార్యా బంధం తో, ఖత్రొచీని తన కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగించనిచ్చి, బోఫోర్స్ కుంభకోణం లో పీకలమొయ్యా కూరుకు పోయాడు. సంస్కరణల విషయం లో బొక్క బోర్లా పడ్డాడు! దానికి తోడు, శ్రీలంకలో ఐపీకేయెఫ్ అనే ఓ వెర్రి ప్రయోగం వొకటి! అందుకే బలయి పోయాడు.

మిగతా మరోసారి.

Tuesday, January 4, 2011

కాంగీ పార్టీ - 2

పచ్చి నిజాల గురించి నా వ్యాఖ్యలు :

1. ఇన్నాళ్లకి కాంగీ పార్టీ వొప్పుకున్న పచ్చినిజాలు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యం ముసుగులో పచ్చి నియంత అయ్యారు. తనకి కిట్టని రాజకీయ నాయకులందర్నీ జైళ్లలో మ్రగ్గించారు. వాళ్లని కోర్టులలో హాజరు పరచడం మొదలైనవి దాదాపు లేవు. ప్రాథమిక హక్కులని అధికారికంగా సస్పెండు చేశారు!

పత్రికలకి 'సెన్సార్ షిప్' విధించారు. ఇది అమల్లోకి వచ్చిన కొత్తలో, పత్రికల్లో సంపాదకీయం, ముఖ్య వ్యాసాలూ ప్రచురణ ఆపేస్తే, పత్రికల్లో ఆ స్థానాలు ఖాళీగా తెల్లగా ప్రచురించి, 'సెన్సారు చెయ్యబడింది' అని వ్రాసేవారు. తరవాత, అలా కూడా వ్రాయకూడదు అని నిర్బంధించి, యేదో వొకటి ఆ స్థానం లో వ్రాయాలి అని నిర్బంధించి, నెగ్గించుకొన్నారు!

న్యాయ వ్యవస్థ అధికారగణం చెప్పినట్టు వినాల్సిందే!

(ఇంకా వివరాలు యెవరైనా అడిగితే వ్రాస్తాను.)

2. నిజమే.....తిరుగులేని యువ నేతగా యెదిగాడు సంజయ్ గాంధీ. అప్పటికి ఓ గమ్యం లేకుండా భ్రష్టుపడుతున్న యువతకి--ఓ కార్యక్రమం ఇచ్చి, దిశా నిర్దేశం చేసి, యువ శక్తిని ఓ సరైన మార్గంలోకి ప్రవేశపెట్టాడు. నక్సల్స్ లో చేరాలనుకొంటున్న మా కజిన్ సిస్టర్ తో సహా, నా స్నేహితులనేకమందినీ, అలాంటి యువత చాలా మందినీ, యూత్ కాంగ్రెస్ లో చేరేలా చేశాడు.

(మన రఘురామయ్యలు వాడి చెప్పులు మొయ్యడం, జయసుధ వాడితో 1స్ట్ క్లాస్ లో ప్రయాణించడం లాంటివి ప్రక్కన పెడితే) ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, బీహార్, హర్యాణా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లొ, మూర్ఖ హిందువుల్నీ, నలుగురేసి పెళ్లాల్తో, డజన్లకొద్దీ పిల్లలని కన్నవాళ్లనీ, 'నిర్బంధ కుటుంబ నియంత్రణ శిబిరాలకి' తరలించాడు!

వాడు అర్థాంతరంగా చనిపోకుండా వుంటే, దేశానికి ఇంత దరిద్రం వుండకపోను--శిలా న్యాస్ లూ, బుజ్జగింపులూ, వోట్ బ్యాంకులూ వుండకపోవును! ఇంత జనాభా పెరుగుదలా, ఇన్ని స్కాములూ వుండకపోవును! (వాడి దెబ్బతోనే కుటుంబ నియంత్రణ శాఖని--కుటుంబ సంక్షేమ శాఖ గా మార్చేశారు!)

'నిర్హేతుక, నిరంకుశ' అన్నది తరవాత కాంగీ వాళ్లే--వాళ్లే రాజీవ్ గాంధీ కోటరీ!

మిగతా మరోసారి.

Saturday, January 1, 2011

ఆంగ్ల సంవత్సరాది

.....వచ్చిన 2011

రెండువేల పదో సంవత్సరం వడివడిగా, వురుకులూ పరుగులూ పెడుతూ పారిపోయింది.....కొంతమంది నెత్తిన పాలూ, చాలామంది నెత్తిన నీళ్లూ కుమ్మరించేసి. 

కొత్త సంవత్సరం వ...చ్చిం...ది నెమ్మదిగా పాకుతూ......ముందెలా వుంటుందో మరి.

ఇక కొత్త సంవత్సరానికి కొన్ని ప్రశ్నలు--జవాబులెవరైనా చెప్పచ్చు.

1. డీ టీ హెచ్ లూ, టాటా స్కై లూ మన కేబుల్ టీవీలని మింగేస్తాయా?

2. మోర్ లూ, మాగ్నాలూ వగైరా మన వీధి చివరి చిల్లరకొట్లనేకాదు, చిన్న చిన్న 'డిపార్ట్ మెంటల్ స్టోర్లు ' అనబడే ఆధునిక చిల్లర కొట్లనీ, ఇంకా పెద్ద స్థాయి "చెర్మాస్", "చందనా బ్రదర్స్" లాంటివాటిని కూడా మింగేస్తాయా?

3. మల్టీప్లెక్సులు మామూలు థియేటర్లని మింగేశాయి. ఇంకేమి మింగబోతున్నాయి? ఇంకా సినిమాలు తీస్తూనే వుంటారా? కోట్లలో ములిగి, పైరసీని తిడుతూనే వుంటారా? పాత నటులూ, దర్శకులూ వగైరాల ముని మనవళ్లు వగైరా కూడా నటజీవితాలు ప్రారంభిస్తారా?

4. కూరగాయలు కొనాలంటే మీరు యెంత దూరం వెళ్తారు? యెంత పట్టుకెళ్తారు? బ్యాంకులు వీటికోసం అప్పులు ఇస్తాయా? వుల్లిదోశ మానేసి ప్లెయిన్ దోశ తింటే, మీరు ఆదా చెయ్యగలిగేదెంత?

5. కార్లూ, బైక్లూ ఇంకెన్ని లక్షలు అమ్ముడుపోతాయి? వాటిని "ఆంఫిబియన్లో" అవేవోగా మార్చడానికి రీసెర్చ్ మొదలవుతుందా? కాస్త బాగా కనిపిస్తున్న కొన్ని "రోడ్లని" ఫోటోలూ, వీడియోలూ తీసుకొని, భద్రపరచుకుంటున్నారా--మీ వారసులకి "రోడ్లనీ....ఇదివరకు....ఇలా వుండేవన్నమాట...." అని చెప్పడానికి?

6. అధికారులచే పని చేయించుకోడానికి క్రొత్త మార్గాలేమయినా కనిపెట్టబడతాయా? (ఏసీబీలకీ, సీబీఐ లకీ దొరక్కుండా)

7. న్యాయ వ్యవస్థ భవిష్యత్తు యెలా వుంటుంది? "జ్యుడిషియల్ కమిషన్" వగైరాలు వస్తాయా? మఖలో పుట్టి, పుబ్బలో మాడిపోయిన బెంచీలూ, కుర్చీల గురించి ఆందోళనలు మళ్లీ మొదలవుతాయా?

8. పీడీఎస్ అనే ప్రజా పంపిణీ వ్యవస్థ లో యేమైనా పంపిణీ చేస్తారా? లేక ప్రజలనే పంపిణీ చేస్తారా? ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో వున్న "కార్డుల" రకరకాల సంఖ్య వందలకూ, వేలకూ చేరుతుందా?

9. పెట్రోలు సంగతి సరే, వంట గ్యాసూ, డీజెల్, కిరోసిన్లు యెప్పుడు యెంతమేరకు పెరుగుతాయి? అసలు లభిస్తాయా? రేషన్ పెడతారా? ఆహార ద్రవ్యోల్బణం పై వీటి ప్రభావం యెంత వుంటుంది? ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర వగైరాలు దానిపై తమ ప్రభావాన్నేమయినా తగ్గించుకుంటాయా?

10. అంతర్జాతీయంగా, ఓ 40 యేళ్ల క్రితం యెవరో జోస్యుడు చెప్పినట్టు, అమెరికా, రష్యా, ఇండియాలు కలిసి, పాకిస్థాన్ చైనాలమీద మూడో ప్రపంచ యుధ్ధం ప్రకటిస్తాయా?

ప్రస్తుతానికి ఈ పదీ చాలు. ఇంకా చాలా వున్నాయిగానీ, వీటి తరవాత వాటి సంగతి చూద్దాం!

హేపీ న్యూ యియర్!