Saturday, January 1, 2011

ఆంగ్ల సంవత్సరాది

.....వచ్చిన 2011

రెండువేల పదో సంవత్సరం వడివడిగా, వురుకులూ పరుగులూ పెడుతూ పారిపోయింది.....కొంతమంది నెత్తిన పాలూ, చాలామంది నెత్తిన నీళ్లూ కుమ్మరించేసి. 

కొత్త సంవత్సరం వ...చ్చిం...ది నెమ్మదిగా పాకుతూ......ముందెలా వుంటుందో మరి.

ఇక కొత్త సంవత్సరానికి కొన్ని ప్రశ్నలు--జవాబులెవరైనా చెప్పచ్చు.

1. డీ టీ హెచ్ లూ, టాటా స్కై లూ మన కేబుల్ టీవీలని మింగేస్తాయా?

2. మోర్ లూ, మాగ్నాలూ వగైరా మన వీధి చివరి చిల్లరకొట్లనేకాదు, చిన్న చిన్న 'డిపార్ట్ మెంటల్ స్టోర్లు ' అనబడే ఆధునిక చిల్లర కొట్లనీ, ఇంకా పెద్ద స్థాయి "చెర్మాస్", "చందనా బ్రదర్స్" లాంటివాటిని కూడా మింగేస్తాయా?

3. మల్టీప్లెక్సులు మామూలు థియేటర్లని మింగేశాయి. ఇంకేమి మింగబోతున్నాయి? ఇంకా సినిమాలు తీస్తూనే వుంటారా? కోట్లలో ములిగి, పైరసీని తిడుతూనే వుంటారా? పాత నటులూ, దర్శకులూ వగైరాల ముని మనవళ్లు వగైరా కూడా నటజీవితాలు ప్రారంభిస్తారా?

4. కూరగాయలు కొనాలంటే మీరు యెంత దూరం వెళ్తారు? యెంత పట్టుకెళ్తారు? బ్యాంకులు వీటికోసం అప్పులు ఇస్తాయా? వుల్లిదోశ మానేసి ప్లెయిన్ దోశ తింటే, మీరు ఆదా చెయ్యగలిగేదెంత?

5. కార్లూ, బైక్లూ ఇంకెన్ని లక్షలు అమ్ముడుపోతాయి? వాటిని "ఆంఫిబియన్లో" అవేవోగా మార్చడానికి రీసెర్చ్ మొదలవుతుందా? కాస్త బాగా కనిపిస్తున్న కొన్ని "రోడ్లని" ఫోటోలూ, వీడియోలూ తీసుకొని, భద్రపరచుకుంటున్నారా--మీ వారసులకి "రోడ్లనీ....ఇదివరకు....ఇలా వుండేవన్నమాట...." అని చెప్పడానికి?

6. అధికారులచే పని చేయించుకోడానికి క్రొత్త మార్గాలేమయినా కనిపెట్టబడతాయా? (ఏసీబీలకీ, సీబీఐ లకీ దొరక్కుండా)

7. న్యాయ వ్యవస్థ భవిష్యత్తు యెలా వుంటుంది? "జ్యుడిషియల్ కమిషన్" వగైరాలు వస్తాయా? మఖలో పుట్టి, పుబ్బలో మాడిపోయిన బెంచీలూ, కుర్చీల గురించి ఆందోళనలు మళ్లీ మొదలవుతాయా?

8. పీడీఎస్ అనే ప్రజా పంపిణీ వ్యవస్థ లో యేమైనా పంపిణీ చేస్తారా? లేక ప్రజలనే పంపిణీ చేస్తారా? ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో వున్న "కార్డుల" రకరకాల సంఖ్య వందలకూ, వేలకూ చేరుతుందా?

9. పెట్రోలు సంగతి సరే, వంట గ్యాసూ, డీజెల్, కిరోసిన్లు యెప్పుడు యెంతమేరకు పెరుగుతాయి? అసలు లభిస్తాయా? రేషన్ పెడతారా? ఆహార ద్రవ్యోల్బణం పై వీటి ప్రభావం యెంత వుంటుంది? ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర వగైరాలు దానిపై తమ ప్రభావాన్నేమయినా తగ్గించుకుంటాయా?

10. అంతర్జాతీయంగా, ఓ 40 యేళ్ల క్రితం యెవరో జోస్యుడు చెప్పినట్టు, అమెరికా, రష్యా, ఇండియాలు కలిసి, పాకిస్థాన్ చైనాలమీద మూడో ప్రపంచ యుధ్ధం ప్రకటిస్తాయా?

ప్రస్తుతానికి ఈ పదీ చాలు. ఇంకా చాలా వున్నాయిగానీ, వీటి తరవాత వాటి సంగతి చూద్దాం!

హేపీ న్యూ యియర్!

No comments: