Monday, January 17, 2011

మన ఆర్థికం, ఆధ్యాత్మికం

విశేషాలు, వింతలు

హమ్మయ్య! డిసెంబరు 31 తరవాత జనవరి 1 మాత్రమే వచ్చింది. అంతే కాదు, సంక్రాంతి పండుగ కూడా ప్రశాంతంగా జరిగింది--పిచ్చి రాజకీయ నాయాళ్లు యెవరూ వాళ్ల చేతుల్లోని రాళ్లు విసర లేదు మరి!

ద్రవ్యోల్బణం పెరుగుతూనే వుంది, అయినా పెట్రోలు రేట్లు పెరిగాయి....! 

కూరగాయల ధరలు పెరుగుతూనే వున్నాయి....అప్పుడప్పుడూ కొంచెం తగ్గినా.

డిసెంబరు 31 న, మన రాష్ ట్రంలో రూ.135 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందట.

కనుమురోజున, ప.గో.జిల్లాలో ఒక్కరోజునే కేజీ 90 రూపాయల చొప్పున, రూ.5.50 కోట్ల విలువైన "కోళ్లని" తినేశారట!

(మొన్న కార్తీక మాసం సందర్భంగా, చాలామంది మాంసాహారం మానెయ్యడంతో, కూరగాయల రేట్లు పెరిగినా, పోనీలే--కొన్ని జీవాలు కొన్ని అదనపు రోజులు బతుకుతున్నాయి--అని సంతోషించాం! ఇప్పుడు రెట్టించిన వుత్సాహంతో, సం హారాన్ని సాగిస్తున్నారన్నమాట! అయినా, సంవత్సరం లో ఓ 30 రోజులు కార్తీకం లోనూ, ఓ 52 రోజు లక్ష్మివారమో, శనివారమో అంటూనో మానేసి, మిగిలిన 283 రోజులూ--కోళ్లూ, మేకలూ, చేపలూ, గుడ్లూ, గొడ్లూ, పందులూ తినేస్తూ వుంటే, దక్కే పుణ్యమెంతో మరి!)

ఏలూరు ఆర్ ఆర్ పేటలో, బాలాజీని "నవనీత" అలంకారం చేశారట--సంక్రాంతి సందర్భంగా. యెంతోకాదు ఓ 18 కేజీల వెన్నని పామారట విగ్రహానికి. నెయ్యి ధర ఇప్పుడు కేజీ 350 వుంది. 18 కేజీలకీ ఆరువేల చిల్లర అవుతుంది. వెన్నకూడా కొంచెం అటూ ఇటూ వుండొచ్చు. ఇచ్చినవాళ్లకి అది పెద్ద మొత్తం కాకపోయినా, బొట్టు బొట్టూ కలిసి సముద్రమైనట్టు, యెంత 'నేషనల్ వేస్ట్' జరుగుతోందాని వూహించుకోవచ్చు.

ఇంక, నరసాపురంలో పురాతన ఆలయం "ఆదికేశవ ఎంబెరుమన్నార్ స్వామి" కోవెల. దదాపు 300 యేళ్లక్రితం, వూరు కూడా యేర్పడనప్పుడు ఆ కోవెల నిర్మాణం జరిగిందంటారు. యెంబెరుమన్నార్ అనే ఆయన అప్పటి మద్రాసు రాష్ ట్రం నించి వచ్చి, ఇక్కడ ఆదికేశవ, ఆదిలక్ష్మీ అమ్మవార్ల ప్రతిష్ఠ చేసి, కోవెల కట్టించాడు. తరవాత ఆయన విగ్రహం కూడా అక్కడే ప్రతిష్టించబడింది.

అలాంటి కోవెలే, శ్రీపెరంబుదూరులో వుందని, రాజీవ్ హత్య జరిగినప్పుడు తెలిసింది అందరికీ!

వాళ్ల పథకంలో భాగంగా, తమిళ వైష్ణవుల దాడి సాగుతోంది ఈ కోవెల మీదా, ఆంధ్ర వైష్ణవులమీదా. కోవెలలో రాతిలో చెక్కివున్న "ఎంబెరుమన్నార్" అనే పేరులో "నా"వత్తుని తొలగించేశారు. ఆ వొత్తుని పూడ్చేసి, నల్లరంగు పామేశారు! యెందుకు అంటే, "తమిళ పండితులు అదే సరైనది, వెంటనే మార్చండి" అన్నారట!

మరి మన్నార్ జలసంధినీ, మన్నార్ సింధుశాఖనీ కూడా మార్చేస్తారా? యెందుకు? ఇప్పటికే మీడియావారు మన్నార్ ని మున్నార్ చేసేశారు. ఎంబెరుమన్నార్ ని ఎంబెరుమానార్ చేసేశారు!

ఇంక, ఇన్నేళ్లనించి--వెంకటాచార్యులు, రామాచార్యులు, సూర్యనారాయణాచార్యులు, సుదర్శనాచార్యులు--ఇలాంటి తెలుగు పేర్లే వుంటున్నా, తరవాత తరాలకి 'రంగ రాజన్'; 'శ్రీనివాసన్' ఇలా తమిళ పేర్లు పెడుతున్నారు!

మరి ఆంధ్ర వైష్ణవులకన్నా, తమిళ వైష్ణవులు యేవిధంగా గొప్పో?

ఆ కోవెలలో, సంక్రాంతి సందర్భంగా, యెనిమిదిరకాల 'అన్న ప్రసాదాలు' నైవేద్యం పెట్టి, భక్తులకి పంచిపెట్టారట.

అవీ విశేషాలు.

తాజా కలం : స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచినవి ఓ 70 లక్షల కోట్లు (యెన్ని 2జీ లో! యెన్నిరాష్ట్రాల యెన్ని యేళ్ల బడ్జెట్లో!) అని చెప్పాడట "వికీలీక్స్" వాడు!

No comments: